కార్తెలు కరిగిపోవట్టే.. కాలం అటేపాయె!

కార్తెలు కరిగిపోవట్టే.. కాలం అటేపాయె!
  • రాష్ట్రవ్యాప్తంగాలోటు వర్షపాతం..ఆందోళనలో రైతాంగం
  • దుక్కుల్లోనే ఎండిపోతున్నవిత్తనాలు.. ముదురుతున్న నార్లు
  • ఈసారి పంటల సాగుఅంచనా 1.31 కోట్ల ఎకరాలు
  • ఇప్పటి వరకూ సాగైంది50 లక్షల ఎకరాలే
  • మొత్తం సాగు 35 శాతమే..జోరువానలు పడితేనే సాగు’ ముందుకు

హైదరాబాద్​, వెలుగు:కార్తెలు ఒక్కొక్కటీ కరిగిపోతున్నాయి.. కానీ కాలమైతలేదు. మృగశిర, రోహిణి, ఆరుద్ర కార్తెలు ముగిసినా..  ఇప్పటివరకూ రాష్ట్రంలో ఎక్కడా సరిపడా వర్షం పడలేదు. ఈ సీజన్​ మొదట్లో కురిసిన తొలకరి వానలకే రైతులు దుక్కులు దున్ని, వరినార్లు పోసుకున్నారు. యూరియా, దుక్కిమందులు సిద్ధం చేసుకున్నారు.

ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు దుక్కుల్లోనే ఎండి పోతున్నాయి. వరినార్లు ముదిరిపోతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్​ ప్రారంభమై నెల గడుస్తున్నా.. ఒక్క జోరు వాన పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా అడపాదడపా ఓ మోస్తరు వర్షాలే పడుతున్నాయి. అదీ రెండు మూడు వారాలకోసారి కురుస్తుండడంతో ఎవుసం ముందుకు సాగడం లేదు. ఈ వానలు పునాస పంటలకు ఏమాత్రం సరిపోవని రైతాంగం దిగాలు చెందుతున్నది. 

సీజన్​లో జూన్​ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సరైన వానలే పడలేదు. దీంతో రైతులు పోసిన వరినార్లు ముదిరిపోతున్నాయి. నాట్లు వేసే పరిస్థితి లేదు. ఈ యేడు వానాకాలంలో 60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని సర్కారు అంచనా వేసింది. ఇప్పటి వరకూ కేవలం 1.71 లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పడడం గమనార్హం. అవికూడా అక్కడక్కడ బోర్ల కిందనే పడ్డాయి.

కొన్నిచోట్ల నారుమళ్లు పోసి నెలకు పైగా అయ్యిందని, పోసిన నారు ముదిరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలం సగం కరిగిపోవడంతో మున్ముందు జోరువానలు పడితేనే సాగు ముందుకు సాగుతుందని, సమృద్ధిగా వర్షాలు కురిసి.. చెరువులు, కుంటలు నిండి, బోర్లు ఆగకుండా పోస్తేనే పంట పండుతుందని అంటున్నారు.

కాలం ఇట్లాగే ఉంటే సాగు కష్టమే!

ఇటీవల ప్రతీరోజూ ఏదో ఒక టైమ్​ లో మబ్బులు పడుతుండగా.. వానలు కురువకుండానే మేఘాలు ముఖం చాటేస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో వానలు ముందు ఊరించినా ఆ తర్వాత కనుమరుగైపోయాయి. అక్కడక్కడా చిరుజల్లులు తప్ప.. వాగులు, వంకలు పొంగేలా వానలే పడలేదు. చినుకు రాక కోసం రైతులు నిత్యం మొగులు దిక్కు చూస్తున్నా.. వారికి నిరాశే ఎదురవుతున్నది. హైదరాబాద్​లో అప్పుడప్పుడన్నా వానలు పడుతుండగా.. గ్రామాల్లో చినుకు జాడే లేదు.

వానలు పడ్తయని జూన్ మొదటి వారంలో పత్తి రైతులు విత్తనం వేశారు. నెల రోజులు దాటినా ప్రస్తుతం పెద్ద వానలు లేక ఆందోళన చెందుతున్నారు. టోటల్​గా 35 శాతం సాగు నమోదైనా.. ఇంకా చాలా ప్రాంతాల్లో వానలు లేక ఇప్పటికీ నాట్లు పడలేదు. ఇప్పుడు వరి నార్లు నాటేసే స్టేజ్ వచ్చింది. కీలకమైన ఈ స్టేజ్​లోనే సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  

ఇప్పటికీ సాగు 35 శాతమే

ఈ వానాకాలం సీజన్​లో రాష్ట్రంలో  అన్ని రకాల పంటలు కలిపి 1.31 కోట్ల ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా పత్తి 66 లక్షల ఎకరాలు, వరి 60 లక్షల ఎకరాలు, మక్కజొన్న 6 లక్షలు, కందులు 7 లక్షలు, సోయా 4.29 లక్షలు , పెసర లక్ష ఎకరాల్లో సాగవుతాయని అంచ నా కట్టారు.

వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్ప టి వరకూ అన్ని రకాల పంటలు కలిపి 50 లక్షల ఎకరాల పంట మాత్రమే సాగైంది. అత్యధికంగా పత్తి 33.81లక్షల ఎకరాల పైచి లుకు  సాగు కాగా.. ఇప్పటి వరకూ జొన్నలు 20 వేల ఎకరాలు, మక్కజొన్న 1.92 లక్షలు, కందులు 2.37 లక్షలు, పెసర్లు 35 వేలు, సో యా 2.55 లక్షల ఎకరాలు సాగయ్యాయి. ఇలా ఎంత చూసినా ప్రభుత్వ అంచనాలో 35 శాతమే సాగవడం గమనార్హం.