
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణెకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఆమె ఎంపికైంది. ఇందుకు సంబంధించి హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపిక ఈ గౌరవాన్ని అందుకుంది. ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ నటి దీపిక కావడం విశేషం.
దీపికతో పాటు డెమి మూర్, రాచెల్ మెక్ ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి హాలీవుడ్ తారలు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన జాబితాలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 35 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసినట్టు ఛాంబర్ తెలిపింది. సినీరంగంలో అద్భుతమైన కృషి చేసిన వారిని ఇందుకోసం ఎంపిక చేసినట్లు వెల్లడించింది. దీపికకు మన దేశంతో పాటు విదేశాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో టైమ్స్ సహా పలు అంతర్జాతీయ మ్యాగజైన్స్ విడుదల చేసిన జాబితాలలో ఆమె చోటు దక్కించుకుంది. ఆమెకు దక్కిన విశిష్ట గౌరవం పట్ల సినీప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.