కోల్ బెల్టులో బీఆర్ఎస్​కు ఎదురుగాలి

కోల్ బెల్టులో బీఆర్ఎస్​కు ఎదురుగాలి

తెలంగాణకు  కొంగు బంగారంగా  ప్రకృతి ప్రసాదించిన వనరులు సింగరేణి గనులు. ఈ గనులు తెలంగాణలో గోదావరి తీరం వెంబడి ఉన్నాయి. తెలంగాణలో విస్తరించి ఉన్న సింగరేణిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమంది  ఆధారపడి బతుకుతున్నారు. ఉపాధి పొందుతున్న కుటుంబ సభ్యులు సుమారు ఆరు లక్షల మంది వరకు ఉంటారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలుపును కోల్​బెల్టు ప్రభావితం చేయనుంది. 

సింగరేణి పరిధిలో 17 ఓపెన్ కాస్టు, 27 అండర్ గ్రౌండ్( యూజీలు )ఉండగా,  ప్రస్తుతం 42,000 మంది కార్మికులు,- ఉద్యోగులు, 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు.60 వేల మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. గతంలో 1,42,000 పైగా కార్మికుల సంఖ్య ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మిక సంస్కరణలు రావడం, మిషన్ మైనింగ్, యాంత్రీకరణ లాంటి కారణాలతో కార్మికులు సంఖ్య తగ్గుతోంది. అయితే ఓపెన్ కాస్టు బొగ్గు  తవ్వకాలు చేపట్టడంతో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య మాత్రం పెరుగుతున్నది.  ప్రైవేట్ యాజమాన్యంతో బొగ్గును ఉత్పత్తి చేయడం వేగవంతమైంది.

12 నియోజకవర్గాల్లో కోల్ బెల్ట్​ ప్రభావం

12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కోల్ బెల్ట్ ఏరియా విస్తరించి ఉన్నది. ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు,పెద్దపల్లి, రామగుండం, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, పినపాక, సత్తుపల్లి, ఇల్లెందు ఉన్నాయి. 2018 లో జరిగిన ఎన్నికల్లో 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అదిలాబాద్, పెద్దపల్లి,  వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ లోక్​సభ స్థానాల్లో సింగరేణి ఓటర్ల  ప్రభావం ఉంటుంది. సుమారు ఆరు లక్షల మంది ప్రత్యక్ష, పరోక్ష ఓటర్లు  గెలుపు, ఓటమిలో  కీలకం కాబోతున్నారు. కార్మికుల ఓట్ల లక్ష్యంగా పార్టీలు గురిపెడుతున్నాయి.

కార్మికుల హామీలు అమలుచేయని సర్కారు

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులకు ఉద్యమ సందర్భంలోనూ, 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోనికి వచ్చిన కేసీఆర్​ ప్రభుత్వం అమలుచేయలేదు. సింగరేణి గుర్తింపు సంఘానికి గౌరవాధ్యక్షునిగా ఎమ్మెల్సీ కవిత ఉన్నప్పటికీ  కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయింది. 2018లో జరిగిన ఎన్నికల సందర్భంలోనూ, 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కార్మికులు చెల్లిస్తున్న ఆదాయ పన్నుకు మినహాయింపు తెస్తామని,  ప్రతి కార్మికుడి  సొంత ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తామని,  కొత్తగా ఓపెన్ మైనింగ్ లను చేపడతామని, ప్రస్తుతం నివాసముంటున్న పాత  క్వార్టర్స్ ను వారికే అలాట్మెంట్ చేస్తామని కార్మికులకు వాగ్దానాలు చేసినారు. కానీ, ఆనాడు ఇచ్చిన వాగ్దానంలో ఏ ఒక్కటీ కూడా నేటికీ అమలుపరచలేదు. 

తగ్గుతున్న ఉద్యోగ అవకాశాలు

ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటంతో కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు, రాష్ట్రంలో బీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరిస్తున్నదని కార్మికుల్లో తీవ్ర వ్యతిరేక భావం నెలకొన్నది. ఎన్నికల ప్రచారానికి వస్తున్న అధికార పార్టీ నాయకులను, మంత్రులను కార్మికులు నిలదీస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన శాసనసభ్యులు ఏనాడూ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయకపోగా.. ప్రైవేట్ మైనింగ్ వారితో చేతులు కలుపుతూ వారి లాభాల్లో  వాటా పొందుతున్నారు.

దీనితో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేక భావం కార్మికుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నూతనంగా యాంత్రీకరణ, అధిక పని గంటలు తదితర కారణాలతో సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ నియామక ప్రక్రియతో శ్రమ దోపిడీ జరుగుతోంది. రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగుల్లో  పింఛను విషయంలో చాలా అసంతృప్తి ఉంది.  సుదీర్ఘ కాలంగా వేతన సవరణ అమలు కాకపోవడంతో పాత పింఛన్లే వస్తున్నాయి.

 కార్మిక సంఘాల ఎన్నికలు నిలిపివేత

 తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు 43 రోజులు నిరవధిక సమ్మె చేసి ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ సెంటిమెంటుతో  కార్మిక సంఘాలకు జరిగిన ఎన్నికల్లో 2012 , 2016 లో  బీఆర్ఎస్ కు అనుబంధమైన తెలంగాణ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. నాలుగు సంవత్సరాలకు మార్చినా..  నేటికి 7 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ, కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించలేదు.  బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తెస్తూ ఎన్నికలు నిలుపుదల చేస్తోంది.  

చివరికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏవో కారణాలు చెబుతూ  ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తున్నది. దీంతో  తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కార్మికుల హక్కుల పరిరక్షణ, బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకించడం,  ప్రస్తుతం పని చేయుచున్న 30వేల కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయడంతోపాటు, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించుటకు సహకరించే శాసనసభ్యుల్ని గెలిపించుకోవాలని సింగరేణి కార్మికులు కృతనిశ్చయంతో ఉన్నారు.

ఏటా 80 మిలియన్ల టన్నుల బొగ్గు

ఏటా 80 మిలియన్ల టన్నుల బొగ్గును సంస్థ వెలికితీస్తున్నది. మొత్తం బొగ్గులో 85 శాతం బొగ్గును థర్మల్ కేంద్రాలకు,  మిగతా 15 శాతం సిమెంట్ కంపెనీలకు  సంస్థ అమ్ముతున్నది. ఈ ప్రాంతంలో  పదివేల మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని అంచనా. తెలంగాణలోని ప్రభుత్వ సంస్థయైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో కేంద్ర ప్రభుత్వం 49 శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వం 51 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. రాష్ట్రంలోని గోదావరి,  ప్రాణహిత లోయ ప్రాంతంలో 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో బొగ్గు గనులు ఉండటంతో ఈ ప్రాంతాన్ని కోల్ బెల్ట్ ఏరియాగా పిలుస్తారు.

ఉజ్జిని రత్నాకర్ రావు, ఏఐటీయూసీ,  మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి