కృష్ణంరాజు మరణం చిత్రపరిశ్రమకు తీరనిలోటు అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ‘‘కృష్ణంరాజు నాకు ఆత్మీయ మిత్రుడు. ఢిల్లీలో ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు’’ అని చెప్పారు. ‘‘1998లో నేను కృష్ణంరాజును తొలిసారి కలిశాను. అప్పుడాయన పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ఢిల్లీకి వచ్చారు. వాజ్ పేయి మంత్రి వర్గంలో ఉన్నప్పుడు ఆయనకు చాలా దగ్గరయ్యాను’’ అని రాజ్ నాథ్ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించిన కృష్ణంరాజు సంతాప సభకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
‘‘కొన్ని నెలల క్రితం ఢిల్లీలో కృష్ణంరాజును కలిసేందుకు వెళ్లినప్పుడు అనారోగ్యంతో ఉన్నట్లు అనిపించలేదు. చాలా బాగా నాతో మాట్లాడారు. పాత రోజులను గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు ఇక లేరనే ఆకస్మిక వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. దాన్ని నేను చాలాసేపటి వరకు నమ్మలేకపోయాను’’ అని చెప్పారు. కృష్ణంరాజు పెద్ద స్టార్ అయినా.. నన్ను అన్నగారు అని పిలిచేవారని తెలిపారు. వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండేవారన్నారు. కృష్ణంరాజు 55 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేశారని చెప్పారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ని, కృష్ణంరాజు ని ప్రత్యేకంగా అభినందించానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
మచ్చలేని మనిషి కృష్ణంరాజు : కిషన్ రెడ్డి
కృష్ణంరాజుతో తనకు మంచి అనుబంధం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘‘ప్రధానిని కలవాలి’’ అని ఇటీవలె కృష్ణంరాజు తనకు ఫోన్ చేశారని గుర్తు చేసుకున్నారు. వైజాగ్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు కార్యక్రమానికి రాలేకపోయినందుకు కృష్ణంరాజు చాలా బాధ పడ్డారని తెలిపారు. సినీరంగంలో, రాజకీయాల్లోనూ మచ్చలేని మనిషిగా కృష్ణంరాజు పేరు తెచ్చుకున్నారని చెప్పారు. పార్టీలకు అతీతంగా చిన్నాపెద్దా, అన్ని రాజకీయ పార్టీనేతలతో మంచి సంబంధాలు ఏర్పర్చుకున్నారన్నారు.
ఫిల్మ్ నగర్ లో కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు : తలసాని
మర్యాదకి మారుపేరు కృష్ణంరాజు అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 55 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మంచి సినిమాలను చేశారని పేర్కొన్నారు. కృష్ణంరాజు మంచితనమే ప్రభాస్ కి వచ్చిందని తలసాని చెప్పారు. కృష్ణంరాజుకు,సీఎం కేసీఆర్ కు మంచి అనుబంధం ఉందని తెలిపారు. కృష్ణంరాజు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఫిల్మ్ నగర్ లో కృష్ణంరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
