కారు.. బేకారు..ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా బీఆర్ఎస్ : రాజ్​నాథ్​సింగ్​

కారు.. బేకారు..ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా బీఆర్ఎస్ : రాజ్​నాథ్​సింగ్​
  • ధరణి పేరిట లక్షల ఎకరాల భూములు మాయం 
  • రెండు సార్లు అవకాశమిస్తే కేసీఆర్​ ఏం చేసిండు?
  • జాబ్స్​ ఇవ్వనందుకు యువతకు ఆయన క్షమాపణ చెప్పాలి
  • కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై దేశమంతా చర్చ
  • రాష్ట్రంలో బీజేపీకి ఒక్క చాన్స్​ ఇచ్చి చూడాలని ప్రజలకు వినతి
  • జమ్మికుంట, బడంగ్ పేట్  సభల్లో ప్రసంగం

హైదరాబాద్​/కరీంనగర్/జమ్మికుంట, వెలుగు :  కేసీఆర్ కుటుంబ అవినీతిపై రాష్ట్రంలోనే కాదు.. దేశమంతా చర్చ జరుగుతున్నదని, నిప్పు లేనిదే పొగ రాదనే విషయం గమనించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ అన్నారు. రాష్ట్రం లో కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరని చెప్పారు. రెండు సార్లు ప్రజలు అధికారం కట్టబెట్టినా తెలంగాణను ఎందుకు అభివృద్ధి చేయలేదో  కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్​చేశారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని, ప్రజలు నష్టపోయారని అన్నారు. 

‘‘బీఆర్​ఎస్​ కారు.. బేకారు అయిపోయింది. ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీలా ఆ పార్టీ తయారైంది” అని విమర్శించారు. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట ప్రభుత్వ  డిగ్రీ  కాలేజీలో, సాయంత్రం మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ లో బీజేపీ ఏర్పాటు చేసిన సభల్లో రాజ్​నాథ్​ సింగ్​ మాట్లాడారు. బీఆర్​ఎస్​ సర్కార్​ లీకేజీల ప్రభుత్వంగా మారిందని, యువతకు ఉద్యోగాలు ఇవ్వనందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, దళిత బంధు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే చేరిందని అన్నారు.  ‘‘కేసీఆర్ అధికారం లేకపోతే ఉండలేరు. అందుకే అబద్ధాలను ప్రచారాలు చేస్తున్నరు. తెలంగాణలో కుల, మత, ప్రాంత, వర్గం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నరు” అని ఆయన దుయ్యబట్టారు. 

వీరుల నేల తెలంగాణ

తెలంగాణ నేల వీరులను కన్న పుణ్యభూమి అని రాజ్​నాథ్​ సింగ్​ పేర్కొన్నారు. ‘‘రాణి రుద్రమ, కుమ్రంభీమ్ లాంటి ఎందరో పరాక్రమవంతులు ఈ గడ్డపై పుట్టారు. భద్రకాళి అమ్మవారు, రామప్ప ఆలయం కొలువైన నేల ఇది. 1984లో  దేశంలో రెండు స్థానాల్లో  బీజేపీ గెలిస్తే ఆ ఎన్నికల్లో గెలిచిన సీట్లలో ఒకటి తెలంగాణ నుంచే. తెలంగాణతో బీజేపీ ప్రత్యేక అనుబంధం ఉంది” అని తెలిపారు. 27 ఏండ్లుగా గుజరాత్ లో  బీజేపీ అధికారంలో ఉందని, అభివృద్దికి గుజరాత్ రోల్ మోడల్ గా నిలిచిందని, తెలంగాణలో కేసీఆర్​కు అధికారం ఇస్తే ఆగం పట్టించారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో పదేండ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా... విస్మరించి, ఇక్కడి వనరులను దోచుకున్నారని ఆరోపించారు.  కేసీఆర్ అధికార దుర్వినియోగం చివరికి ఢిల్లీ వరకు వినిపిస్తున్నదన్నారు. 

ఫ్యామిలీ ఫస్ట్​ అంటున్నడు

‘‘స్టేట్ ఫస్ట్ అనే అభిప్రాయం ఉన్నవాళ్లను తెలంగాణ ప్రజలు కోరుకున్నరు. కాని ఫ్యామిలీ ఫస్ట్ అనే వ్యక్తుల చేతిలోకి రాష్ట్రం వెళ్లింది. యావత్  తెలంగాణ సమాజం కుటుంబం పాలనను వ్యతిరేకిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులిస్తున్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం సహకరిస్తలేదు.  తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని రాజ్​నాథ్​ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే పోరాటం చేయలేదని, రాష్ట్ర ప్రజలు, బీజేపీ కూడా పోరాడిందని తెలిపారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ‘‘నేను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నం.

రాష్ట్రం ఏర్పడితే వేగంగా అభివృద్ధి చెందుతుందని భావించినం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్  రెండు అభివృద్ధిలో దూసుకుపోవాలని కోరుకున్నం. కానీ ఇక్కడ జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉంది. ఒక్క కేసీఆర్​ ఫ్యామిలీనే అభివృద్ధి చెందుతున్నది” అని పేర్కొన్నారు. బీజేపీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుందని, అయోధ్యలో రామమందిరం కడతామని చెప్పి కట్టి తీరుతున్నదని తెలిపారు. అక్కడ జనవరి 24 నుంచి దర్శనం కల్పించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. 

ధరణి పోర్టల్​తో భూములు మాయం

తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకు వచ్చి.. లక్షల ఎకరాల భూములను మాయం చేశారని కేసీఆర్​పై రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భూరికార్డులు డిజిటలైజ్ చేసి పారదర్శకంగా సమాచారం అందించడమేగాక రుణ సౌకర్యం పొందే సదుపాయం కల్పిస్తున్నదని తెలిపారు. భూస్వామిత్వ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ భూమి హక్కులు లభించాయన్నారు. కాంగ్రెస్ హయాంలో రూపాయి ఇస్తే.. 20 పైసలు మాత్రమే పేదల దగ్గరకు చేరేవని, అదే మోదీ ప్రభుత్వలో నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయటం ద్వారా అవినీతి తుడిచిపెట్టుకుపోయిందని ఆయన పేర్కొన్నారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని అన్నారు. తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కమలం పువ్వుపై కూర్చొని లక్ష్మీదేవి ప్రజల ఇంటి ముందుకు వస్తుందని తెలిపారు. తెలంగాణను కాంగ్రెస్ మోసం చేసిందని, రాష్ట్ర ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ అనేక సమస్యల్ని పరిష్కరించలేదని, చేయి గుర్తు ఇక్కడి జనాన్ని ఎప్పుడో వదిలి వెళ్లిందని ఆయన అన్నారు. 

కల్వకుంట్ల కుటుంబం జైలుకే : కిషన్ రెడ్డి 

గతంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనను చూశామని, ఇప్పడు కల్వకుంట్ల కుటుంబ పాలనను చూస్తున్నామని బీజేపీ స్టేట్​ చీఫ్​, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనను చూశామని, ఇప్పుడు కేసీఆర్ పార్టీది అదే విధానమని మండిపడ్డారు. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి జరగలేదన్నారు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా.. ఇక బీఆర్ఎస్‌‌‌‌కు ప్రజలు ఓట్లు వేయరని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని మజ్లిస్ చేతుల్లో పెట్టేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఆదేశాలతో, అండదండలతో మహేశ్వరంలో మజ్లిస్ నాయకులు అక్రమంగా ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. కాంగ్రెస్ కూడా మజ్లిస్ కు కొమ్ముకాస్తున్నదని ఆయన దుయ్యబట్టారు.

ప్రవళిక కుటుంబాన్ని  బద్నాం చేస్తున్నరు : జవదేకర్​

కేసీఆర్​ పాలనలో పదేండ్లలో తెలంగాణకు ఏం ఒరిగిందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్​ ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలు అడియాసలయ్యాయని తెలిపారు. నిరుద్యోగ యువతి ప్రవళిక గ్రూప్స్ కు అప్లై చేసుకోలేదని కేటీఆర్ అనడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘ప్రవళికను, ఆమె కుటుంబాన్ని బద్నాం చేస్తున్న ఇలాంటి సర్కార్​ను తరిమికొట్టాలి” అని ఆయన అన్నారు. ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో యువతకు బీఆర్​ఎస్​ సర్కార్​ తీరని ద్రోహం చేసిందని, ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. హుజూరాబాద్​ సభలో   ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.