చేపల పంపిణీ లేనట్లేనా..?

చేపల పంపిణీ లేనట్లేనా..?
  • గత ఏడాది జూలై నెలలోనే చేపల పంపిణీ కంప్లీట్
  • ఈ ఏడాది ఇంకా స్టార్ట్​ కాని టెండర్ల ప్రక్రియ 

గద్వాల, వెలుగు: ప్రతి ఏడాది లాగా మత్స్యకారులకు చేపల పిల్లల పంపిణీ ఈసారి ఉంటుందాలేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏటా జూలై లోపే టెండర్ల ప్రక్రియ కంప్లీట్ చేసి చేపపిల్లల పంపిణీ కూడా పూర్తి చేసేవారు. కానీ, ఈ ఏడాది ఆగస్టు నెలలోనూ టెండర్లు కూడా పిలవలేదు. ప్రభుత్వం ఈసారి కూడా ఉచితంగా చేపపల్లిలను ఇస్తుందన5ఇ ఇంకా నడిగడ్డ మత్స్యకారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు డిపార్ట్​మెంట్​ నుంచి కూడా ఎలాంటి సమాచారం రాకపోవటంతో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.

ప్రతి ఏడూ 1.70 కోట్ల చేపల పంపిణీ

జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి ఏడాది 1.70 కోట్ల చేప పిల్లలను ఉచితంగా మత్స్యకారులకు, చేపల పెంపకందారుల సహకార సంఘాలకు పంపిణీ చేసేవారు. వాటిని జిల్లాలో ఉన్న 375 చెరువులు, రిజర్వాయర్లలో వదిలేవారు. చేపలు పెరిగిన తర్వాత వాటిని అమ్ముకొని మత్స్యకారులు, సహకార సంఘాల సభ్యులు ఆర్థికంగా లబ్ధి పొందేవారు. చేపల పంపిణీ కోసం ప్రతి ఏటా ప్రభుత్వం, ఫిషరీ డిపార్ట్​మెంట్​ వానాకాలం మొదలుకాగానే ప్రక్రియ ను ప్రారంభించేవారు. 

ఏ జిల్లాకు ఎన్ని చేప పిల్లలు కావాలి..? ఎవరు ఎంత రేటు కు పంపిణీ చేస్తారు..? అన్న వివరాలను తెలుసుకోవడంపాటు టెండర్లను ఆహ్వానించేవారు. ఈ ప్రక్రియ మే, జూన్వరకు పూర్తి చేసి జూలై చివరినాటికి చేపల పంపిణీ కంప్లీట్ చేసేవారు. కానీ ఈసారి ఆగస్టు వచ్చినా టెండర్లు కూడా పిలువకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

చేప పిల్లల కోసం ఎదురుచూపులు

వర్షాకాలంలో అడపాదడపా కురిసిన వానలతో కుంటలు, చెరువుల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. నెట్టెంపాడు లిఫ్ట్​ద్వారా రిజర్వాయర్ల తో పాటు కొన్ని చెరువులను కూడా కృష్ణ నీటితో నింపారు. చేప పిల్లలు ఎప్పుడూ వస్తాయా అనే ఆత్రుతతో మత్స్య కార్మికులు, చేపల పెంపకం సంఘాలు ఎదురుచూస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని మత్స్యకార్మికులు ఎప్పుడు చేపలను పంపిణీ చేస్తారని అధికారులను అడుగుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో వారు కూడా మత్స్యకారులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. 

పంపిణి పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

చేప పిల్లల పంపిణీ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఇప్పటివరకు ఉచిత చేపల పంపిణీ పై ఎలాంటి క్లారిటీ లేదు. టెండర్ల ప్రక్రియ కూడా స్టార్ట్ కాలేదు. ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుచుకుంటాం.- షకీలా భాను, ఫిషరీ శాఖ ఏడి, గద్వాల.