టెండర్ల నిర్వహణలో జాప్యం

టెండర్ల నిర్వహణలో జాప్యం
  • తునికాకు సేకరణ జరిగేనా?
  • టెండర్ల నిర్వహణలో జాప్యం
  • ఇప్పటికీ పూర్తికాని అగ్రిమెంట్​
  • బోనస్​ కోసం కార్మికుల నిరీక్షణ
  • సర్కారు నుంచి స్పందన కరువు

భద్రాచలం, వెలుగు:  ఏటా తునికాకు సేకరణకు నిర్వహించే టెండర్లు ఆలస్యమవుతున్నాయి. ఒకవేళ ఈ ప్రక్రియ పూర్తయినా అగ్రిమెంట్ చేసుకోవడంలో కాంట్రాక్టర్లు మరింత జాప్యం చేస్తుంటారు. దీంతో సేకరణ సమయం పూర్తయి, అకాల వర్షాలు, తుఫాన్ల కారణంగా ఆకు పాడైపోతుంది. ఫలితంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో తునికాకు సేకరణ ప్రక్రియను డిసెంబరులోనే ప్రారంభించేవారు. అటవీశాఖ ద్వారా జరిగే ఈ టెండర్లు పూర్తి కాగానే కూలీల సంఖ్య, కల్లాల ఏర్పాటు, రవాణాకు వినియోగించే వాహనాలు తదితర వివరాలతో కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకునేవారు. కొన్నేళ్లుగా ఫిబ్రవరిలోనే టెండర్లు పిలుస్తున్నారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే మార్చి వరకు కొనసాగుతుంటాయి. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 6,14 తేదీల్లో ఈ–-టెండర్ల స్వీకరణకు నోటిఫికేషన్​ఇచ్చారు. అప్పటికీ కాంట్రాక్టర్లు రాకపోతే మార్చిలో కూడా స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. గతేడాది మాదిరగానే అగ్రిమెంట్ల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 30 యూనిట్ల ద్వారా 38,800 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించనున్నారు.

మంత్రి మాట అమలయ్యేనా?

రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి50 ఆకుల తునికాకు కట్టకు రూ.3లు ఇస్తామని ఇటీవలే ప్రకటించారు. గతంలో రూ.2.01లు మాత్రమే ఇచ్చేవారు. ఏకంగా రూపాయి వరకు పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే కార్మికులు మాత్రం రూ.5లు ఇవ్వాలని డిమాండ్​చేస్తున్నారు. కాగా రేట్​ పెంచడానికి జీవో రాలేదు. ఇప్పటికే కార్మికులతో పాటు కార్మిక సంఘాలు కూడా ఆందోళనలు చేపడుతున్నాయి.  

బోనస్​ఇవ్వకుండా తాత్సారం..

రాష్ట్ర సర్కారు తునికాకు కార్మికులకు బోనస్​ఇవ్వకుండా దగా చేస్తోంది.  2012–-14 మధ్యకాలంలో బోనస్ ఇచ్చి ఆ తర్వాత 8 ఏళ్లుగా పైసా వదలడం లేదు. ఏటా గిరిజనులు సేకరించిన తునికాకును అమ్మడం ద్వారా వచ్చే లాభాల్లో కొంత బోనస్ రూపంలో ప్రభుత్వం కార్మికులకే ఇస్తుంటుంది. ఈ విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.16కోట్ల బోనస్​ ప్రభుత్వం వద్దే ఉంది. వేసవిలో పంటగా భావించే తునికాకు సేకరించి గిరిజన కార్మికులు ఉపాధి పొందుతుంటారు. బోనస్​ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. రకరకాల కారణాలు చెప్పి తాత్సారం చేస్తోంది. ఒకసారి బ్యాంకు అకౌంట్లు సరిగ్గా లేవని, మరోసారి పేర్లు తప్పుగా ఉన్నాయని కొర్రీలు పెడుతూ వస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా తునికాకు సేకరణే జరగలేదు. తర్వాత సేకరణ ఆలస్యం కావడంతో వర్షాలు ఇతరత్రా కారణాలతో ఆకు తక్కువగా వస్తోంది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన తమకు బోనస్ ఇస్తే ఇంటి అవసరాలు తీరుతాయని కార్మికులు వేడుకుంటున్నారు.

కట్టకు రూ.5లు ఇవ్వాలి...

50 ఆకుల కట్టకు రూ.3లు ఇవ్వాలని తాము 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు పెరిగిన ధరల దృష్ట్యా రూ.5లు ఇవ్వాలి. టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడం దారుణం. మార్చి మొదటి వారంలోనే ఫ్రూనింగ్​అంటే కొమ్మ కొట్టే పనులు మొదలు కావాలి. ఇప్పుడు కొమ్మకొడితేనే ఏప్రిల్ నాటికి ఆకు ఎక్కువగా వస్తుంది. 
 
–కెచ్చెల రంగారెడ్డి, సీపీఐ(ఎంఎల్, ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి

బోనస్​ఇచ్చి ఆదుకోవాలే..

తమ కష్టార్జితం బోనస్​ఇచ్చి సర్కారు ఆదుకోవాలి. ఎండనక, వాననక విషపురులు, అడవి జంతువులను దాటుకుని తునికాకు తెస్తున్నం. మాకు వచ్చే బోనస్​ఇవ్వకుండా వాళ్ల దగ్గరే పెట్టుకున్నరు. కుటుంబ అవసరాల కోసం ఉపయోగపడతాయని ఆశతో ఉన్నం.


–సోడి నాగేశ్వరరావు, కుర్నపల్లి, చర్ల