కల్యాణలక్ష్మి, కొత్త పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలోనూ జాప్యం

కల్యాణలక్ష్మి, కొత్త పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలోనూ జాప్యం
  • వీఆర్ఏల సమ్మె ఎఫెక్ట్.. సర్టిఫికెట్లు ఇస్తలే
  • ఒక్కో ఆఫీసులో వేలల్లో పేరుకుపోతున్న దరఖాస్తులు
  • నెల రోజులుగా గాడి తప్పిన రెవెన్యూ పాలన
  • ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే స్టాఫ్ లేక నిలిచిన సర్టిఫికెట్ల జారీ
  • కల్యాణలక్ష్మి, కొత్త పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలోనూ జాప్యం
  • సమ్మెలో 22 వేల మంది వీఆర్‍ఏలు.. పట్టించుకోని సర్కార్
  • ప్రెస్ నోట్లు, వినతిపత్రాలతోనే కాలం వెళ్లదీస్తున్న ట్రెసా నేతలు
  •  

హైదరాబాద్/ వరంగల్‍, వెలుగు:  నెలరోజులుగా వీఆర్‌‌‌‌ఏలు చేస్తున్న సమ్మెతో రాష్ట్రంలో రెవెన్యూ పాలన గాడితప్పింది. ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే స్టాఫ్ లేకపోవడం, మండలానికి ఒకరిద్దరు ఆర్ఐలు మాత్రమే ఉండడంతో ధరణి సంబంధిత దరఖాస్తులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, క్యాస్ట్, ఇన్‌‌కం, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, ఫ్యామిలీ మెంబర్, రెసిడెన్సీ తదితరాల కోసం పెట్టుకున్న దరఖాస్తుల పరిశీలన, సర్టిఫికెట్ల జారీ పెండింగ్‌‌లో పడిపోయింది. ఒక్కో తహసీల్దార్​ వద్ద వందలు, వేలల్లో దరఖాస్తులు పేరుకుపోయాయి. దీంతో రైతులు, స్టూడెంట్లతోపాటు వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో మండలం పరిధిలో ఉండే ఒకరిద్దరు ఆర్‍ఐలు, డిప్యూటీ తహసీల్దార్లు వందల్లో వచ్చే అప్లికేషన్ల వెరిఫికేషన్‍ చేయడం సాధ్యంకాక చేతులెత్తేస్తున్నారు.

వీఆర్ఏలకు అందని పే స్కేల్

ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించాలని వీఆర్‍ఏలు కోరుతున్నారు. పే స్కేల్‍, పీఎఫ్‍, మెటర్నటీ సెలవులు, ఈఎస్‍ఐ, హెల్త్ కార్డులు, పెన్షన్‍, జాబ్ సెక్యూరిటీ, వర్కింగ్ హవర్స్, ప్రమోషన్‍ అవకాశాలు కల్పించాలని పదులసార్లు వినతిపత్రాలు అందించారు.  ఐదేండ్ల తర్వాత వీఆర్వోలుగా అవకాశం కల్పిస్తామని చెప్పడంతో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖలోని సుమారు 22 వేల మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని, పే స్కేల్ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ 2017 ఫిబ్రవరి 24న ప్రగతి భవన్ లో హామీ ఇచ్చారు. కానీ పే స్కేల్ ఇవ్వకుండా రూ.6,500 వేతనాన్ని రూ.10,500కు పెంచారు. తర్వాత రెగ్యులరైజేషన్ మాట మరిచారు. 2020 సెప్టెంబర్‌‌‌‌లో వీఆర్వో వ్యవస్థ రద్దుపై అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంలో.. మినిమం పే స్కేల్ వర్తింపజేస్తామని మరోసారి ప్రకటించారు. కానీ రెండేళ్లు కావొస్తున్నా ఆ హామీ నెరవేరలేదు. దీంతో వీఆర్ఏలు గతంలో సీసీఎల్ఏను ముట్టడించారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో జులై 25 నుంచి సమ్మెలోకి వెళ్లారు. వంటావార్పు, జాతరలు, దీక్షలు, ప్రదర్శనలతో నిరసనలు తెలుపుతున్నా సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు.

పని ఒత్తిడిలో తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు

క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది లేకపోవడంతో రెవెన్యూ శాఖలో పనులు కావడం లేదు. భూసంబంధిత సమస్యలు, సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు తహసీల్దార్‌‌‌‌ ఆఫీసులకు రోజూ వందల్లో వస్తుండగా వాటిని వెరిఫై చేయలేక తహసీల్దార్లు తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా ఇలాంటి అప్లికేషన్లపై గతంలో వీఆర్వోలు, ఆర్ఐలు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా తహసీల్దార్లు అప్రూవ్ చేయడమో, రిజెక్ట్ చేయడమో చేసేవారు. కానీ వీఆర్వోలు లేకపోవడం, వీఆర్ఏలు సమ్మెలోకి వెళ్లడంతో తహసీల్దార్లకు చేతి కింద ఒకరిద్దరు ఆర్ఐలు తప్పా సిబ్బంది లేకుండాపోయారు. దీంతో సర్టిఫికెట్లు జారీ చేయలేకపోవడంతోపాటు జిల్లా అధికారులు కోరే సమాచారాన్ని సకాలంలో ఇవ్వలేకపోతున్నామని తహసీల్దార్లు చెబుతున్నారు. ఈ విషయమై ఈ నెల తొలివారంలోనే అన్ని జిల్లాల కలెక్టర్లకు తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు వినతిపత్రాలు సమర్పించారు. అయినా సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేదు.

ట్రెసా నేతలపై రెవెన్యూ ఉద్యోగుల ఆగ్రహం

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం.. రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమాన్ని పూర్తిగా మరిచింది. వీఆర్ఏల నుంచి డిప్యూటీ కలెక్టర్ల వరకు రెవెన్యూ ఉద్యోగులంతా ఒక్కో కేడర్ లో ఒక్కో సమస్యను ఎదుర్కొంటున్నారు. వీఆర్వోలు, వీఆర్ఏలు, ఆర్ఐలు, డీటీలు, తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు తదితర రెవెన్యూ ఉద్యోగులందరి సమస్యలపై గళమెత్తాల్సిన తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నేతలు.. కేవలం సీఎస్‌‌కు వినతిపత్రాలు సమర్పించడం, ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడంతోనే సరిపెడుతున్నారని రెవెన్యూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఐదున్నర వేల వీఆర్వోలను ఇతర శాఖల్లోకి పంపిస్తుంటే మొక్కుబడి ప్రకటనలు చేశారని, వీఆర్ఏల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో ట్రెసా నేతలు విఫలమయ్యారని, కింది స్థాయి వీఆర్వోలు, వీఆర్ఏలంటే మొదటి నుంచి వారికి చిన్నచూపే ఉందని ఆరోపిస్తున్నారు.

పెన్‌‌ పవర్ లేకున్నా.. అన్ని శాఖల్లో వీరే

రాష్ట్రవ్యాప్తంగా 22 వేల మంది వీఆర్‍ఏలు గ్రామ, మండల స్థాయిలో ఆఫీసర్ల కింద సహయకులుగా పనిచేస్తున్నారు. కొత్త రాష్ట్రంలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పెంచినా.. రెవెన్యూ, అగ్రికల్చర్‍, ఎడ్యుకేషన్ తదితర శాఖల్లో ఉద్యోగుల సంఖ్య మాత్రం పెంచలేదు. ఆయా శాఖల ఉద్యోగులు గ్రామ స్థాయిలో చేయాల్సిన పనులన్నీ రాష్ట్ర సర్కారు వీఆర్‍ఏలతో చేయించింది. పేరుకు పెన్ పవర్ లేదన్నమాట తప్పితే.. ప్రభుత్వపరంగా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఏ శాఖ తరఫున వెరిఫికేషన్‍ కావాలన్నా వీఆర్‍ఏల ప్రమేయం తప్పనిసరి అయింది. గతంలో సుంకరి, నీరడి, తరారి, మస్కూరి చేసే పనులన్నీ ప్రస్తుతం వీఆర్‍ఏలు చేస్తున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా వీఆర్‍ఏలను మీ సేవ ఆపరేటర్లుగా, అటెండర్లు, డ్రైవర్లు, ఇన్‍వార్డ్, ఔట్‍వార్డ్, కంప్యూటర్‍, ధరణి ఆపరేటర్లు.. ఆర్‍ఐ, జూనియర్‍, సీనియర్ అసిస్టెంట్లకు హెల్పర్లు నియమించారు. ప్రభుత్వ నిర్వహణలో మేజర్ డిపార్టుమెంట్లుగా చెప్పుకునే రెవెన్యూ, అగ్రికల్చర్‍, ఎడ్యుకేషన్‍, హెల్త్, పోలీస్ వంటి శాఖల్లో వీరి సేవలు లేకుండా ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలదు. మండల స్థాయిలో ఆఫీసర్లు చేయాల్సిన ఎన్నో రకాల సర్టిఫికెట్ వెరిఫికేషన్లు గ్రౌండ్ లెవల్లో వీరితోనే చేపిస్తున్నారు.

రైతు బీమా, కల్యాణలక్ష్మి..  అన్నీ ఆగినయ్‍

రైతులకు పట్టా పాస్‍బుక్‌‌ కావాలన్నా, భూవివరాల తప్పొప్పులు సరిదిద్దాలన్నా, ఆఫీసర్లకు సహాయకులుగా వీఆర్ఏలు వెరిఫికేషన్‌‌ చేయాల్సి ఉండటంతో మండలాఫీసుల్లో వందలాది ఫిర్యాదులు పెండింగులో ఉన్నాయి. రైతుబంధు, రైతు బీమా వివరాలు ప్రభుత్వానికి పంపేవారు లేరు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌ దరఖాస్తుల వెరిఫికేషన్ చేసేందుకు రావట్లేదు. స్టూడెంట్లకు అడ్మిషన్ కౌన్సెలింగ్‍, స్కాలర్‍షిప్‌‌ సమయంలో క్యాస్ట్, ఇన్‍కమ్‍, నేటివిటీ సర్టిఫికెట్లు సకాలంలో అందడంలేదు. వరదల కారణంగా పంట నష్టం వివరాలు, హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు సంబంధించి కరోనా కేసుల వివరాలు, సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సులు ముందుకు సాగడంలేదు. పోలీసోళ్లకు రోడ్డు ప్రమాదాలు, గుర్తు తెలియని మృతదేహాల వివరాలు ఇచ్చేవారు కరువయ్యారు. ప్రస్తుతం ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో 17 ఏండ్లు దాటినవారి వివరాలు సేకరించడానికి వీఆర్‍ఏలు అందుబాటులో లేరు. ఇలా మొత్తంగా గడిచిన నెల రోజుల నుంచి తహసీల్దార్ ఆఫీసుల్లో వందలాది అప్లికేషన్లు పెండింగ్‍లో ఉన్నాయి.

సర్టిఫికెట్ల కోసం తిప్పుకుంటున్రు

ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం క్యాస్ట్, ఇన్‌‌కం, నేటివిటీ సర్టిఫికెట్లు అడిగారు. పది రోజుల కింద అప్లై చేసినా. అవి ఎందుకు అవసరమో వివరించి చెప్పా. వెరిఫికేషన్ చేసి ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వడంలేదు. వెరిఫికేషన్ కోసం ఎవరూ మా ఇంటికి రావడంలేదు. రోజు తిరుగుతున్నా. ఏమైనా అంటే స్టాఫ్ లేదంటున్నరు.

- నిమ్మల మధుకర్‍, నర్సంపేట

ఒక్క హామీ నెరవేర్చలే

సీఎం 2017 ఫిబ్రవరి 24న వీఆర్‍ఏ సంఘం ప్రతినిధులతో మీటింగ్ పెట్టి అర్హులైన వీఆర్‍ఏలకు ఒకట్రెండు దఫాల్లో ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. ఇతర డిపార్ట్‌‌మెంట్లలో అవకాశం ఇస్తామన్నారు. వారసత్వ వీఆర్‍ఏలకు వెహికల్ డ్రైవర్లుగా నియమిస్తామని చెప్పారు. కానీ ఇందులో ఏ ఒక్కటి నెరవేరలేదు.

- కంది శిరిషారెడ్డి, రాష్ట్ర వీఆర్‍ఏల సంఘం మహిళా అధ్యక్షురాలు, జాక్ కో కన్వీనర్‍