డెంగీని గుర్తించడం లేట్ అయ్యే కొద్దీ ప్రమాదం

డెంగీని గుర్తించడం లేట్ అయ్యే కొద్దీ ప్రమాదం

వానాకాలంలో సీజనల్ జ్వరాలు తరచూ వస్తుంటాయి. పైకి అన్ని జ్వరాలు ఒకేలా ఉన్నా.. డెంగీ ఫీవర్ లక్షణాలు వేరుగా ఉంటాయి.  డెంగీ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్, జాగ్రత్తలు కూడా వేరుగా ఉంటాయి. డెంగీ జ్వరం గురించి కొద్దిగా అవగాహన పెంచుకుంటే దాన్నుంచి తప్పించుకోవడం ఈజీ అవుతుంది.

రాకుండా ఉండాలంటే..

డెంగీ అనేది ఒక వైరల్ వ్యాధి. డెంగీకి మూలమైన ఫ్లేవీవైరస్‌‌లు దోమ నుంచి శరీరంలోకి చొరబడ తాయి. అందుకే డెంగీ రాకుండా అడ్డుకోవాలంటే ముందుగా దోమల నుంచి తప్పించుకోవాలి. ఒకప్పటిలాగా స్ప్రేలు, లిక్విడ్‌‌లతో దోమలు కంట్రోల్ అవ్వట్లేదు. అవి కూడా వాటి శక్తిని పెంచుకున్నాయి. అందుకే వాటిని అడ్డుకోవడంలో మనం కూడా అప్‌‌డేట్ అవ్వాలి. 

డెంగీ వ్యాధిని మోసుకొచ్చే అయిడిస్ లేదా ఏషియన్ టైగర్ దోమలు పగటిపూట ఎక్కువగా కుడతాయి. అందుకే రాత్రిళ్లతో పాటు పగటి పూట కూడా జాగ్రత్తగా ఉండాలి.  ఈ రకం దోమలు మురుగునీటి కంటే ఖాళీ కుండీలు, డ్రమ్ములు, పాత టైర్లు, రోడ్లపై నిల్వ ఉండే వర్షపు నీళ్లు, పాత కూలర్లు లాంటి చోట్ల ఎక్కువగా ఉంటాయి. అందుకే, అలాంటివి ఇంటి చుట్టుపక్కల లేకుండా చూసుకోవాలి. ఇంట్లో ఎక్కడా నీళ్లు నిల్వ ఉంచకూడదు. నీళ్ల ట్యాంకులు, టబ్బులపై మూతలు పెట్టాలి. అలాగే ఇంట్లోకి వెలుతురు, గాలి వచ్చేలా చూసుకోవాలి.

చెమట వాసనకు దోమలు త్వరగా అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి శరీరానికి చెమట పట్టకుండా ఫ్రెష్‌‌గా ఉంచుకోవాలి. రోజుకు రెండు, మూడు సార్లు స్నానం చేస్తే మంచిది.  పడుకునేటప్పుడు దోమతెరలు వాడాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే బట్టలు వేసుకోవాలి. పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు, పాదాలకు సాక్స్‌‌లు లాంటివి వాడాలి. అవసరమనుకుంటే మస్కిటో రెపెల్లెంట్ క్రీములు రాసుకోవచ్చు. డెంగీ ఉన్న వాళ్లను కుట్టిన దోమలు మరొకరిని కుడితే వాళ్లకూ వ్యాధి వ్యాపిస్తుంది. కాబట్టి హాస్పిటల్స్, జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి. 

 జ్వరం వస్తే..

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో ఫీవర్ రావొచ్చు. అయితే ప్రతీ జ్వరాన్ని డెంగీ అనుకుని భయపడకూడదు. జ్వరంతో పాటు చలిగా అనిపించడం, విపరీతమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, ఆకలి వేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అది డెంగీ అవ్వొచ్చు.  ఒక్కోసారి జ్వరం లేకపోయినా విపరీతమైన ఒళ్లు నొప్పులు, అలసిపోయినట్టు అనిపించడం, శరీరంపై దద్దుర్లు రావడం, బీపీ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్పుడు కూడా డెంగీ పరీక్షలు చేయించుకోవాలి. రక్త పరీక్ష చేయించుకుంటే డెంగీ అవునో, కాదో తేలిపోతుంది. డెంగీ ఉంటే వెంటనే డాక్టర్‌‌‌‌ను కలవాలి. డెంగీని ఎంత త్వరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ అంత ఈజీ అవుతుంది. తీవ్రతను బట్టి డెంగీ ట్రీట్మెంట్ ఉంటుంది.

  ఈ జ్వరం అంత ప్రమాదమా?

మిగతా జ్వరాలతో పోలిస్తే డెంగీలో మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. దానికి కారణం ప్లేట్‌‌లెట్లు. రక్తంలో రక్తకణాలతో పాటు ప్లేట్‌‌లెట్స్‌‌ కూడా ఉంటాయి. ఇవి శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టేలా చేస్తాయి. ఇవి లేకపోతే శరీరంలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది. మామూలుగా ఒక వ్యక్తిలో ఇవి 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటాయి. డెంగీ సోకినప్పుడు వీటి సంఖ్య తగ్గిపోతుంది. ఒక్కోసారి డెంగీని గుర్తించే సరికే పరిస్థితి చేయిదాటిపోవచ్చు. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు. కానీ ప్లేట్‌‌లెట్ల సంఖ్యను పెంచడానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో లేదు. శరీరమే ఇమ్యూనిటీ సాయంతో ప్లేట్‌‌లెట్లను పెంచుకోవాలి. ప్లేట్‌‌లెట్ల సంఖ్య ఇరవై వేల కంటే తక్కువకి పడిపోతే డాక్టర్లు కొత్త ప్లేట్‌‌లెట్లను ఎక్కిస్తారు. అప్పటికీ శరీరం సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోతే పరిస్థితి సీరియస్ అవుతుంది. వైరస్ ప్రభావం ఎంత ఎక్కువగా ఉంది? బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది? అనేదాన్ని బట్టి ప్రమాదం స్థాయి మారుతుంటుంది. అలాగే డెంగీ వైరస్ దాడిచేసినప్పుడు రక్తనాళాల గోడలు డ్యామేజ్ అవుతాయి. దాంతో రక్తస్రావం అవుతుంది. దీనివల్ల కొన్ని అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. డెంగీ మరణాలకు ఇది కూడా ఒక కారణం.

డెంగీని గుర్తించడం లేట్ అయ్యే కొద్దీ ప్రమాదం కూడా పెరుగుతుంది. కొంత మందిలో డెంగీ వైరస్‌‌ సోకిన వారం రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొన్నిసార్లు నార్మల్ ఫీవర్‌‌‌‌లా వచ్చి తగ్గిపోతుంది. మరికొన్నిసార్లు జ్వరం రాకుండా ఒళ్లు నొప్పులు మాత్రమే వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో రక్త పరీక్ష చేయించకపోతే వచ్చింది డెంగీ అన్న సంగతి తెలియదు. అలా కొంత నష్టం జరుగుతుంది. అందుకే వచ్చింది డెంగీనో, కాదో తెలియాలంటే ఈ సీజన్‌‌లో శరీరంలో ఎలాంటి మార్పులొస్తున్నాయో గమనిస్తుండాలి.  కాస్త నలతగా అనిపిస్తే వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలి. జ్వరం వచ్చి, తగ్గాక కూడా మరోసారి రక్త పరీక్ష చేయించుకోవడం మంచిది.

  ఇలా కోలుకోవచ్చు

డెంగీ పాజిటివ్ వస్తే వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెడతారు డాక్టర్లు. ప్లేట్‌‌లెట్ల సంఖ్య నార్మల్‌‌గా ఉంటే మందులతో డెంగీని నయం చేయొచ్చు. ఒకవేళ ప్లేట్‌‌లెట్ల సంఖ్య పడిపోతూ ఉంటే మందులతో పాటు సరైన ఆహారాన్ని తీసుకుంటూ ప్లేట్‌‌లెట్ల సంఖ్యను పెంచుకోవాల్సి ఉంటుంది.  ప్లేట్‌‌లెట్లు పెంచేందుకు  పండ్లు, ఆకుకూరలు, గోధుమ గడ్డి, బొప్పాయి ఆకుల రసం లాంటివి తీసుకోవాలి. అలాగే పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రాక్ష,  దానిమ్మ, నారింజ పండ్లను ఎక్కువగా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి డెంగీ నుంచి త్వరగా కోలుకోవచ్చు. నూనె పదార్థాలు, వేపుళ్లు,  డెంగీ జ్వరం తగ్గేంత వరకు తీసుకోకపోవడమే మంచిది. 

డెంగీ ట్రీట్మెంట్  టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టైంకి మందులు వేసుకోవాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ట్రీట్మెంట్ తర్వాత ఆకలి మామూలుగా ఉండి,  శ్వాస వేగం, పల్స్ రేట్, బీపీ నార్మల్‌‌గా ఉండి,  ప్లేట్‌‌లెట్ల సంఖ్య 70 వేల నుంచి లక్ష వరకూ ఉంటే డెంగీ తగ్గుతుందని అర్థం.  

 వీళ్లలో ఎక్కువ

డయాబెటిస్‌‌తో బాధపడుతున్న వాళ్లకి, ముసలి వాళ్లకి, చంటి పిల్లలకు, ఇమ్యూనిటీ డిసీజ్‌‌లు ఉన్నవాళ్లకు డెంగీతో ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అందుకే వీళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే పిల్లల్లో జ్వరం లేకుండానే డెంగీ వస్తుంది. 
అందుకే ఈ సీజన్‌‌లో పిల్లల ఆరోగ్యాన్ని ఓ కంట గమనిస్తుండాలి. కాస్త నలతగా అనిపిస్తే వెంటనే రక్త పరీక్ష చేయించడం మంచిది. అలాగే ఒకసారి డెంగీ వచ్చిన వ్యక్తికి మళ్లీ డెంగీ వస్తే తీవ్రత

భయపడొద్దు

డెంగీ సోకిన వంద మందిలో పదిమందికి మాత్రమే సీరియస్‌‌ అవుతుంది. కాబట్టి డెంగీ రాగానే అతిగా భయపడకూడదు. భయం, ఒత్తిడి వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. కోలుకోవడం కష్టమవుతుంది. చివరిగా చెప్పేదేంటంటే.. డెంగీ వచ్చాక ఇబ్బందులు పడటం కంటే రాకుండా చూసుకోవటమే బెటర్. దోమలు కుట్టకుండా చూసుకోగలిగతే డెంగీని పూర్తిగా నివారించొచ్చు.

డా. నవోదయ, 
కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, 
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్