పంజాబ్‌‌‌‌కు ఢిల్లీ దెబ్బ..15 రన్స్‌‌ తేడాతో ఓడిన కింగ్స్​

పంజాబ్‌‌‌‌కు ఢిల్లీ దెబ్బ..15 రన్స్‌‌ తేడాతో ఓడిన కింగ్స్​
  • ప్లేఆఫ్స్​ ఆశలు ఆవిరి!
  •  లివింగ్‌‌స్టోన్‌‌ పోరాటం వృథా
  •  క్యాపిటల్స్​ను గెలిపించిన రోసోవ్​, పృథ్వీ షా

ధర్మశాల: ఇప్పటికే ప్లే ఆఫ్స్‌‌కు దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్​ పోతూపోతూ పంజాబ్‌‌ కింగ్స్​ అవకాశాలను దెబ్బతీసింది. నాకౌట్​ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌లో పంజాబ్‌‌ పోరాడి ఓడింది. భారీ టార్గెట్‌‌ ఛేజింగ్​లో లివింగ్‌‌స్టోన్‌‌ (48 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 9 సిక్స్‌‌లతో 94)  ఒంటరి పోరాటం చేసినా.. బుధవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో పంజాబ్‌‌ 15 రన్స్‌‌ తేడాతో ఢిల్లీ చేతిలో కంగుతిన్నది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 213/2 స్కోరు చేసింది. రిలీ రోసోవ్‌‌ (37 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌‌లతో 82 నాటౌట్‌‌), పృథ్వీ షా (38 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 54) చెలరేగారు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్‌‌ 20 ఓవర్లలో 198/8 స్కోరు చేసింది. లివింగ్​స్టోన్​. అథర్వ తైడ్‌‌ (55) పోరాటం వృథా అయింది. రోసోవ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

‘టాప్‌‌’ లేపారు..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌‌లో టాప్‌‌ ఆర్డర్‌‌ దుమ్మురేపింది.  పృథ్వీ షా, డేవిడ్‌‌ వార్నర్‌‌ (46) స్టార్టింగ్‌‌ నుంచే పంజాబ్‌‌ బౌలర్లను చితక్కొట్టారు. ఇద్దరూ బౌండ్రీలతో హోరెత్తించారు. మూడో ఓవర్‌‌లో వార్నర్‌‌ రెండు ఫోర్లు, తర్వాతి ఓవర్‌‌లో పృథ్వీ 4, వార్నర్‌‌ 4, 6తో 17 రన్స్‌‌ రాబట్టాడు. ఐదో ఓవర్‌‌లో షా 4, 4, 6తో 16 రన్స్‌‌ దంచాడు. ఆరో ఓవర్‌‌లో వార్నర్‌‌ మరో రెండు ఫోర్లతో స్కోరు 61/0కి పెరిగింది. 39 రన్స్‌‌ వద్ద చహర్‌‌ క్యాచ్‌‌ డ్రాప్‌‌ చేయడంతో గట్టెక్కిన వార్నర్‌‌ 11వ ఓవర్‌‌లో సామ్‌‌ కరన్‌‌ (2/36)కు వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. దీంతో తొలి వికెట్‌‌కు 94 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఇక్కడి రోసోవ్‌‌  పంజాబ్‌‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 13వ ఓవర్‌‌లో 6, 4, 6.. తర్వాతి ఓవర్‌‌లో 6, 4 దంచాడు.  36 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన పృథ్వీ 15వ  ఓవర్‌‌లో ఔటైనా స్లాగ్‌‌ ఓవర్స్‌‌లో ఫిల్‌‌ సాల్ట్‌‌ (26 నాటౌట్‌‌), రోసోవ్‌‌ ఊచకోత కోశారు. ఈ క్రమంలో రోసోవ్‌‌ 25 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ ఫినిష్‌‌ చేశాడు. 19వ ఓవర్లో 6, 4, 6తో 18, చివరి ఓవర్లో 6, 4, 6, 4తో 23 రన్స్‌‌ చేశాడు. రోసోవ్​ జోరుతో ఓవరాల్‌‌గా చివరి ఐదు ఓవర్లలోనే 65 రన్స్‌‌ రాబట్టిన డీసీ ప్రత్యర్థికి భారీ టార్గెట్‌‌ నిర్దేశించింది. 

లివింగ్‌‌స్టోన్‌‌ దంచినా..

భారీ ఛేదనలో పంజాబ్‌‌కు ఆరంభం కలిసి రాలేదు. ధవన్‌‌ (0) రెండో ఓవర్‌‌లోనే డకౌట్‌‌ అయ్యాడు. దీంతో 1/0 స్కోరుతో కష్టాల్లో పడిన పంజాబ్‌‌ను ప్రభ్​సిమ్రన్‌‌ సింగ్‌‌ (22), అథర్వ తైడ్‌‌ కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓవర్లు కరిగిపోయాయి. రెండో వికెట్‌‌కు 49 రన్స్‌‌ జోడించి ఏడో ఓవర్‌‌లో ప్రభ్​సిమ్రన్‌‌ ఔటయ్యాడు. అథర్వతో  కలిసిన  లివింగ్‌‌స్టోన్‌‌ బ్యాట్‌‌ ఝుళిపించడంతో సగం ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌‌ 75/2తో నిలిచింది. మధ్యలో డీసీ ఫీల్డర్లు క్యాచ్‌‌లు డ్రాప్‌‌ చేసి మూల్యం చెల్లించుకున్నారు. 11వ ఓవర్‌‌లో లివింగ్‌‌స్టోన్‌‌ తొలి సిక్స్‌‌ బాదాడు. 12వ ఓవర్‌‌లో తైడ్‌‌ 4, లివింగ్‌‌స్టోన్‌‌ రెండు ఫోర్లు కొట్టడంతో 15 రన్స్‌‌ వచ్చాయి. 38 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన అథర్వ 15వ ఓవర్‌‌లో రిటైర్డ్‌‌హర్ట్‌‌ అయ్యాడు. తర్వాతి ఓవర్‌‌లో జితేష్‌‌ శర్మ (0) ఔట్‌‌తో పంజాబ్‌‌ డీలాపడింది. చివరి 4 ఓవర్లలో 79 రన్స్‌‌ కావాల్సిన దశలో షారూక్‌‌ ఖాన్‌‌ (6) వెనుదిరిగినా, లివింగ్‌‌స్టోన్‌‌, కరన్‌‌ (11) మూడు సిక్స్‌‌లు, ఓ ఫోర్‌‌తో ఆశలు రేకెత్తించారు. 19వ ఓవర్‌‌లో వరుస బాల్స్‌‌లో కరన్‌‌, బ్రార్‌‌ (0) ఔటైనా, ఇషాంత్​ వేసిన ఆఖరి ఓవర్లో లివింగ్‌‌స్టోన్‌‌ 6, 4, 6 కొట్టి ఆశలు రేపాడు. కానీ, చివరి మూడు బాల్స్​లో 16 రాబట్టలేకపోయాడు.సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో 213/2 (రోసోవ్‌‌ 82*, పృథ్వీ షా 54, సామ్‌‌ కరన్‌‌ 2/36),

పంజాబ్‌‌: 20 ఓవర్లలో 198/8 (లివింగ్‌‌స్టోన్‌‌ 94, అథర్వ 55, ఇషాంత్‌‌ 2/36).