ఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసు: పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే.. ?

ఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసు: పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే.. ?

ఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసులో యువతి పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలోని వైద్యుల బోర్డు పోలీసులకు సమర్పించిన నివేదిక ప్రకారం.. ఆమె మరణానికి కారణం తల, వెన్నెముక, ఎడమ తొడ ఎముక ప్రాంతాల్లో గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరగడమేనని తెలుస్తోంది. ప్రమాదం జరగడం వల్ల ఏర్పడిన గాయాల వల్ల ఆమె శరీరం పూర్తి మొద్దుబారిపోయిందని ఈ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఆమెపై లైంగిక వేధింపులు జరిగినట్టుగా వస్తున్న ఆరోపణలపైనా ఈ నివేదిక క్లారిటీ ఇచ్చింది. అలాంటి సంఘటనలేమీ జరగలేదని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఫైనల్ రిపోర్టు త్వరలోనే అందుతుందని పోలీసు స్పెషల్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా తెలిపారు.

ఈ కేసులో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు.. లైంగిక వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు ఇప్పటికే చెప్పారు. అయితే ఘటన జరిగిన సమయంలో బాధితురాలితో పాటు ఆమె స్నేహితురాలు కూడా ఉన్నట్టు సీసీ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయానని పోలీసులు తెలిపింది. ఆమె పోలీసులకు పూర్తిగా సహకరిస్తోందని, సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకుంటున్నామని స్పెషల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సాగర్ ప్రీత్ హుడా చెప్పారు.