ఇండియా కూటమి గెలిస్తే.. దేశమంతటా 24X7 కరెంట్

ఇండియా కూటమి గెలిస్తే.. దేశమంతటా 24X7 కరెంట్
  •    ప్రతి ఒక్కరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం: అర్వింద్ కేజ్రీవాల్
  •     ఏటా 2 కోట్ల ఉద్యోగాల భర్తీ.. ఢిల్లీకి రాష్ట్ర హోదా
  •     చైనా ఆక్రమించుకున్న మన భూమి వెనక్కి 
  •     స్వామినాథన్ రిపోర్ట్ ప్రకారం పంటలకు ఎంఎస్పీ 

ఇండియా కూటమి గెలిస్తే దేశమంతటా 24 గంటలూ కరెంట్ ఇస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. పేదలందరికీ ఫ్రీ కరెంటుతోపాటు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామన్నారు.

న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే దేశమంతటా 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తామని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పేదలందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. స్కూల్స్, హాస్పిటల్స్ రూపురేఖలు మార్చేసి నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని చెప్పారు. చైనా ఆక్రమించుకున్న మన భూభాగాన్ని విడిపిస్తామని.. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలతో మీటింగ్ తర్వాత కేజ్రీవాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

లోక్ సభ ఎన్నికలకు ఇండియా కూటమి తరఫున10 గ్యారంటీలను ప్రకటించారు. వీటిలో కొన్ని పనులను గత 75 ఏండ్లలోనే చేయాల్సి  ఉన్నా చేయలేదని.. అందుకే ఇప్పుడు తమ కూటమి అధికారంలోకి వస్తే వాటిని యుద్ధ ప్రాతిపదికన అమలయ్యేలా చూస్తామన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేశామని కేజ్రీవాల్ చెప్పారు. కేజ్రీవాల్ గ్యారంటీ అంటే ఒక బ్రాండ్ లాంటిదని, తన గ్యారంటీలన్నీ ట్రాక్ రికార్డ్​ను ప్రూవ్ చేసుకున్నాయని చెప్పారు.

మోదీ గ్యారంటీ కావాల్నో.. కేజ్రీవాల్ గ్యారంటీ కావాల్నో ప్రజలే తేల్చుకోవాలన్నారు. అవినీతిపరులందరినీ బీజేపీ చేర్చుకుంటోందని, తాము అధికారంలోకి వస్తే బీజేపీ వాషింగ్ మెషీన్​ను పబ్లిక్​గా డిస్ మాంటిల్ చేస్తామన్నారు.  

రూ. 1.25 లక్షల కోట్లతో ఫ్రీ కరెంట్ ఇవ్వొచ్చు.. 

దేశంలో కరెంట్ వినియోగం 2 లక్షల మెగావాట్లు ఉంటే.. ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల మెగావాట్లుగా ఉందని కేజ్రీవాల్ చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉన్నందున దేశమంతటా 24 గంటల కరెంట్ ఇవ్వడం సాధ్యమేనన్నారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో 24X7 కరెంట్ సరఫరాను సాధ్యం చేశామన్నారు. ఇండియా కూటమిని గెలిపిస్తే దేశమంతటా నిరంతర విద్యుత్ సరఫరాను చేసి చూపిస్తామన్నారు. రూ. 1.25 లక్షల కోట్లు కేటాయిస్తే దేశమంతటా పేదలకు 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వొచ్చన్నారు.

రూ. 5 లక్షల కోట్లతో స్కూళ్లను మార్చొచ్చు.. 

దేశంలో ప్రభుత్వ బడులు దారుణంగా ఉన్నాయని కేజ్రీవాల్ అన్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి రూ. 5 లక్షల కోట్లను ఖర్చు చేస్తే దేశమంతటా ప్రభుత్వ బడులను ప్రైవేట్ బడుల కన్నా మెరుగ్గా మార్చి, ప్రతి ఒక్కరికీ ఉచిత నాణ్యమైన విద్యను అందించొచ్చని తెలిపారు. ఇందుకయ్యే ఖర్చులో కేంద్రం సగం, రాష్ట్రాలు సగం వాటా భరించాలని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖాన్లను మెరుగుపరిస్తే ప్రతి ఒక్కరికీ ఉచిత, నాణ్యమైన వైద్యం ఇవ్వడం కూడా సాధ్యమేనని కేజ్రీవాల్ తెలిపారు. ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్ లు, ప్రతి జిల్లాలో మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్స్ కడితే వైద్య వ్యవస్థ రూపురేఖలు మారుతాయన్నారు.

నేషన్ ఫస్ట్ గ్యారంటీలో భాగంగా తాము చైనాకు చెక్ పెడతామని కేజ్రీవాల్ ప్రకటించారు. చైనా ఆక్రమించుకున్న మన భూభాగాన్ని తిరిగి విడిపిస్తామన్నారు. ఇందుకోసం ఒకవైపు దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇస్తామన్నారు. ఆర్మీకి నష్టం చేసే అగ్నివీర్ పథకాన్ని వెంటనే రద్దు చేస్తామన్నారు. 

పీఎం రేసులో లేను.. 

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను ప్రధాన మంత్రి పదవి రేసులో ఉండబోనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో ఆప్ భాగస్వామిగా మాత్రమే ఉంటుందని, గ్యారంటీలన్నీ అమలయ్యేలా చూస్తుందన్నారు. తగిన సమయం లేనందున తాము కూటమి పార్టీలతో చర్చించకుండానే 10 గ్యారంటీలను ప్రకటించామని, ఇందుకుగాను కూటమిలోని పార్టీలకు క్షమాపణలు చెప్తున్నానన్నారు. అయితే, తాము ప్రకటించిన గ్యారంటీలపై ఏ పార్టీకీ అభ్యంతరం ఉండబోదన్నారు. స్కూళ్లు, హాస్పిటళ్లు ప్రారంభిస్తామంటే ఎవరూ వద్దని అనరన్నారు.  

కేజ్రీవాల్ ప్రకటించిన 10 గ్యారంటీలు ఇవే..

1.    పేదలకు 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ 
2.    ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య 
3.    ప్రతి గ్రామంలోనూ మొహల్లా క్లినిక్​లు, 
జిల్లాల్లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల ఏర్పాటు 
4    చైనా ఆక్రమణలోని భారత భూభాగానికి విముక్తి
5    ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ. అగ్నివీర్ స్కీం రద్దు 
6    స్వామినాథన్ రిపోర్ట్ ప్రకారం.. పంటల కు కనీస మద్దతు ధర 
7    ఢిల్లీకి రాష్ట్ర హోదా 
8    ఏటా 2 కోట్ల ఉద్యోగాల భర్తీ 
9    అవినీతి నిర్మూలన  
10    వ్యాపారులకు వెసులుబాటు కల్పించేలా జీఎస్టీ సరళీకరణ