కవితకు మరో 3 రోజుల కస్టడీ .. 26న తిరిగి ప్రొడ్యూస్ చేయాలని కోర్టు ఆదేశం

కవితకు మరో 3 రోజుల కస్టడీ .. 26న తిరిగి ప్రొడ్యూస్ చేయాలని కోర్టు ఆదేశం
  • సీసీ టీవీల ముందే విచారించాలని షరతు   
  • హోంఫుడ్, కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతి

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది. కవితకు గత వారం విధించిన 7 రోజుల కస్టడీ ముగియడంతో శనివారం ఆమెను ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఈ మేరకు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను ఈ నెల 26వ తేదీ ఉదయం11 గంటలలోపు తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.

విచారణ, కాన్ఫ్రంటేషన్ లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు సూచించారు. సీసీ టీవీల ముందే విచారణ చేపట్టాలని, ఆ ఫుటేజీని భద్రపర్చాలని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందించాలని చెప్పారు. కవిత రిక్వెస్ట్ మేరకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు కూడా  కోర్టు అనుమతించింది. కవితను భర్త అనిల్, కొడుకు ఆదిత్య, సోదరుడు కేటీఆర్, వదిన మంజుల, వరుసకు సోదరి అయిన బి. ననిత, పీఏ శరత్, అడ్వకేట్ మోహిత్ కలుసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. 

ఫోన్ డేటాను కవిత డిలీట్ చేశారు.. 

విచారణ సందర్భంగా ఈడీ తరఫు అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ వాదిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు కవితకు రోజూ మెడికల్ టెస్టులు చేస్తున్నట్టు తెలిపారు. లిక్కర్ స్కాంలో రూ. 100 కోట్ల ముడుపుల చెల్లింపుల్లో కవిత కుట్రదారు అని చెప్పారు. కేసులో మరో నలుగురి వాంగ్మూలాలు తీసుకొని, కలిపి ప్రశ్నించినట్లు తెలిపారు. కవిత మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తో కూడా సరిపోల్చినట్లు వివరించారు. మొబైల్ డేటా నుంచి కవిత కొంత సమాచారాన్ని డిలీట్ చేసినట్టు గుర్తించామన్నారు. కవిత తన మేనల్లుడి వ్యాపార వివరాలు అడిగితే, చెప్పలేదన్నారు.

కవిత నివాసంలో సోదాల సందర్భంగా ఫోన్ సీజ్ చేశామని, ఆ వ్యక్తి (కవిత మేనల్లుడు) విచారణకు హాజరుకాలేదన్నారు. కోర్టులో వాదనలు జరుగుతున్న టైంలోనే హైదరాబాద్ లోని కవిత కుటుంబసభ్యుల నివాసంలో సోదాలు జరుగుతున్నాయని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. కవిత మేనల్లుడి ద్వారా డబ్బు తరలించిన అంశంపై సమీర్ మహేంద్రుతో కలిపి విచారించేందుకు అప్లికేషన్ దాఖలు చేశామన్నారు. కేసులో మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున కవితను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు. అయితే, జడ్జి 3 రోజులు మాత్రమే కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

బెయిల్ పిటిషన్​పై తీర్పు రిజర్వ్  

ఈడీ కస్టడీ ముగిసిన రోజే బెయిల్ పిటిషన్ విచారించాలని స్పెషల్ జడ్జిని కవిత తరఫు అడ్వకేట్ రాణా కోరారు. అరెస్టు అయి, కస్టడీలో ఉన్న వ్యక్తి నుంచి కొన్ని పత్రాలను ఈడీ కోరుతోందని, బెయిల్ ఇచ్చి బయటకు పంపకుండా ఆ పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఫస్ట్ హియరింగ్ లోనే వివరణాత్మక వాదనలు వినిపించామన్నారు. దీంతో ఈడీ తరఫు అడ్వకేట్ జోహెబ్ జోక్యం చేసుకుంటూ.. ఆ వాదనలను కోర్టు తిరస్కరించిందన్నారు.

కవిత తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని రాణా కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఆ పిటిషన్ కు విచారణార్హత లేదని జోహెబ్ వాదించారు. అయితే, ఈడీ లేదా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నా.. బెయిల్ పిటిషన్ దాఖలు చేసే హక్కు ఉందని రాణా చెప్పారు. ఈ పిటిషన్ పై సమాధానం ఇచ్చేందుకు ఈడీకి ఐదు రోజుల సమయం సరిపోతుందన్నారు. ఇరువైపులా వాదనలు విన్న స్పెషల్ జడ్జి కావేరీ బవేజా తీర్పును రిజర్వ్ చేశారు. 

కుటుంబసభ్యులు, ఇతరులతో భేటీ 

కోర్టు అనుమతించడంతో కుటుంబసభ్యులు, ఎంపీ లు, మాజీ మంత్రులు, ఫాలోవర్లతో కోర్టు హాల్​లోనే కవిత కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా భర్త అనిల్, కొడుకులు ఆదిత్య, ఆర్య, ఇతర కుటుంబ సభ్యులు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేశ్ రెడ్డి, మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, జాగృతి నేతలు ఆమెను కలుసుకున్నారు. మాలోతు కవిత, సత్యవతి రాథోడ్, కుటుంబ సభ్యులు, అభిమానులు ఆమెను చూసి కంటతడిపెట్టారు. వారందరికీ కవిత ధైర్యం చెప్పారు. అందరినీ పలకరిస్తూ నవ్వుతూ మాట్లాడారు. అనంతరం ఈడీ అధికారుల వెంట కస్టడీకి వెళ్లిపోయారు.