కవిత కస్టడీ పొడిగింపు.. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కీలక పరిణామం

కవిత కస్టడీ పొడిగింపు.. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కీలక పరిణామం

లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత కస్టడీని.. మరో మూడు రోజులు పొడిగించింది కోర్టు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత.. ఇద్దరినీ కలిపి విచారించాల్సిన అవసరం ఉందని.. కస్టడీ పొడిగించాలంటూ పిటీషన్ దాఖలు చేసింది ఈడీ. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024, మార్చి 23వ తేదీతో కవిత కస్టడీ ముగుస్తుంది. ఈ క్రమంలోనే పొడిగింపు కోసం పిటీషన్ దాఖలు చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. ఐదు రోజుల కస్టడీ కోరగా.. మూడు రోజుల కస్టడీ పొడిగిస్తూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

విచారణకు సహకరించడం లేదు: ఈడీ

కవిత కస్టడీ ఇవాళ్టితో ముగుస్తుండటంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఈడీ. విచారణ సందర్భంగా మరో ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ స్పెషల్ కోర్టును కోరారు  అధికారులు.  కేసు విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ ఆఫీసర్లు కోర్టుకు వివరించారు. లిక్కర్ స్కాంలో మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కవిత ఫోన్ డేటాను పూర్తిగా డిలీట్ చేశారని కోర్టుకు చెప్పారు ఈడీ అధికారులు. మరికొందరితో కలిపి కవితను విచారించాల్సి ఉందన్నారు ఈడీ అధికారులు. కస్టడీలో ఎప్పటికప్పుడు ఆమెకు మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నామని.... డాక్టర్లు  సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని కోర్టుకు వివరించారు ఈడీ అధికారాలు. 

నలుగురి స్టేట్ మెంట్లు, ముడుపుల గురించి కవితను ప్రశ్నించినట్లు తెలిపారు. కుటుంబం వ్యాపారం, ఆదాయపు పన్ను గురించి వివరాలు అడిగితే ఇవ్వలేదని ,చెప్పింది ఈడీ. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం కవిత కస్టడీని మార్చి 26 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది.

న్యాయపోరాటం చేస్తాం: కవిత

మరోవైపు ఈడీ అరెస్ట్, విచారణపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. తనపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు.  కుట్రపూరితంగా లిక్కర్ స్కాంలో ఇరికిస్తున్నారని మండిపడ్డారు.  దీనిపై న్యాయస్థానంలో పోరాడుతామన్నారు కవిత. ఎన్ని కుట్రలు చేసినా నిజమే గెలుస్తుందన్నారు. విచారణలో ఏడాది క్రితం అడిగిన ప్రశ్నలనే ఇప్పుడు అడుగుతున్నారని విమర్శించారు.