ఐపీఎల్‎లో ఇప్పటివరకు టైటిల్ నెగ్గని జట్టు

ఐపీఎల్‎లో ఇప్పటివరకు టైటిల్ నెగ్గని జట్టు
  • ఐపీఎల్‌‌‌‌ 15 మరో 5 రోజుల్లో

వెలుగు స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ లో ఇప్పటివరకు టైటిల్ నెగ్గని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. 14 సీజన్లలో ఆరు సార్లు ప్లేఆఫ్స్ చేరిన ఈ టీమ్.. 2020లో ఫైనల్ వరకూ వచ్చినా రన్నరప్ తో సరిపెట్టుకుంది. 2019లో ఢిల్లీ డేర్ డేవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ గా పేరు మార్చుకున్న ఈ జట్టు.. వరుసగా మూడేళ్లు ప్లేఆఫ్స్ చేరింది. ఈసారి మెగావేలంలో పక్కా వ్యూహంతో బరిలో దిగి స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసిన ఈ టీమ్ ఎలాగైనా టైటిల్ సాధించాలన్న కసితో ఉంది. గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌–ఎలో ఉన్న ఢిల్లీ ఈ నెల 27న ముంబై ఇండియన్స్ తో జరిగే పోరుతో ఈ సీజన్ ను ప్రారంభించనుంది. వేలానికి ముందు కెప్టెన్​ రిషబ్​ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్జ్‌‌‌‌లను రిటైన్ చేసుకున్న ఢిల్లీ ఫ్రాంచైజీ.. మెగా వేలంలో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తో పాటు లుంగి ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహ్మన్, ఖలీల్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, మిచెల్ మార్ష్, చేతన్ సకారియాలను తీసుకుని బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో బలం పెంచుకుంది. పేస్ బౌలింగ్ లో బలంగా  కనిపిస్తున్న ఈ టీమ్ స్పిన్ విభాగంలో గొప్పగా లేదని చెప్పొచ్చు. అశ్విన్, అమిత్ మిశ్రాలాంటి ఎంతో అనుభవమున్న స్పిన్నర్లను వదులుకున్నా.. ఆ స్థాయిలో పెర్ఫామెన్స్ ఇచ్చే స్పిన్నర్లను తీసుకోలేకపోయింది. అక్షర్ తో పాటు కుల్దీప్ యాదవ్ ఉన్నా.. అతడు కొంతకాలంగా సరిగా పెర్ఫామ్ చేయట్లేదు. బ్యాటింగ్ లో ఓపెనర్లుగా వార్నర్, పృథ్వీ షాలతో  ఓకే అనిపిస్తున్నా.. ఆ తర్వాతి ప్లేస్ ల్లో వచ్చే వారు ఎవరనే దానిపై మేనేజ్ మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. కేస్ భరత్, మార్ష్ మూడు, నాలుగు ప్లేస్ ల్లో వచ్చినా.. పావెల్, పంత్, సర్ఫ్ రాజ్ మిడిల్ లో బ్యాటింగ్ కు రావాల్సి ఉంటుంది. ఇందులో పంత్ తప్ప అంత నిలకడైన  ప్లేయర్ కనిపించడం లేదు. పావెల్ ప్రస్తుతం గాయంతో బాధపడుతుండటం ఢిల్లీకి పెద్ద దెబ్బ.