ఇది కరోనా సునామీ.. ఢిల్లీ ఆస్పత్రులకు పోలీసు రక్షణ కల్పించండి

ఇది కరోనా సునామీ.. ఢిల్లీ ఆస్పత్రులకు పోలీసు రక్షణ కల్పించండి
  • ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయకపోవడంపై తీవ్రంగా స్పందించిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: తమకు ఆక్సిజన్ సరఫరా చేయడం లేదంటూ ప్రైవేటు ఆస్పత్రులు వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. కరోనా మహమ్మారి సునామీలా విరుచుకుపడుతుంటే నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ కళ్ల ముందే ఎవరైనా చనిపోతుంటే సంబంధం లేని వాళ్లు కూడా భరించలేరు. అలాంటిది ఆక్సిజన్ కొరతతో ఆత్మీయులు చనిపోతుంటే వారి బంధువులు.. రోగులను బతికించేందుకు ప్రయత్నించే డాక్టర్లు నిస్సహాయతతో కుమిలిపోయే పరిస్థితులు ఏర్పడడం దారుణమని వ్యాఖ్యానించింది. ప్రాణం మీద ఆశతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించిన వారి బంధువులు తమ కళ్ల ముందే ఆత్మీయులు చనిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయతతో ఎలా స్పందిస్తారో తెలియడం లేదని, వెంటనే ఢిల్లీలోని ఆస్పత్రులకు పోలీసు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పటికీ ఢిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎందుకు సరఫరా చేయడం లేదని కోర్టు నిలదీసింది. ఢిల్లీ ప్రభుత్వం ఖాళీ సిలిండర్లు ఇవ్వడం లేదన్న సొలిసిటర్  జనరల్ వివరణపై కోర్టు తీవ్రంగా స్పందించింది. 21వ తేదీకల్లా ఇస్తామన్నారు కదా.. ఇప్పటికీ ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. ఆక్సిజన్ సరఫరాను ఎవరైనా అడ్డుకుంటే చెప్పండి వారెవరైనా సరే ఉరి తీయిస్తామని కోర్టు హెచ్చరించింది. ఇది కరోనా సెకండ్ వేవ్ అని తేలిగ్గా తీసుకోవద్దు... ఇది కరోనా సునామీ అని గుర్తించి ఇప్పటికైనా కళ్లు తెరవాలని ప్రభుత్వాలను హెచ్చరించింది.