ఢిల్లీ హాస్పిటల్ అగ్ని ప్రమాదం: ఆసుపత్రి యజమాని సహా మరొకరు అరెస్ట్

ఢిల్లీ హాస్పిటల్ అగ్ని ప్రమాదం: ఆసుపత్రి యజమాని సహా మరొకరు అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలోని న్యూ బోర్న్ బేబీ కేర్ హాస్పిటల్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మరణించగా.. మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అనంతరం ఢిల్లీ పోలీసులు ఆదివారం(మే 26) ఆసుపత్రి యజమాని సహా మరొకరిని అరెస్టు చేశారు.

న్యూ బోర్న్ బేబీ కేర్ హాస్పిటల్ యజమాని డాక్టర్ నవీన్ ఖిచిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 336, 304ఏ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే, అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రికి షిప్ట్‌కి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ ఆకాష్ (25)ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. హాస్పిటల్ అగ్నిప్రమాదంపై విచారణ ప్రారంభించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం జరిగింది.

కాగా, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మరణించిన ఏడుగురి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన శిశువుల కుటుంబాలకు 50 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది.