యూపీలో ఢిల్లీ తరహా ఘటన

యూపీలో ఢిల్లీ తరహా ఘటన
  • బాడీని ఆరు ముక్కలుగా నరికి, బావిలో పడేశాడు
  • ఘటనా స్థలంలోనే పోలీసులపై కాల్పులు.. ఎదురు కాల్పుల్లో బుల్లెట్ గాయం
  • ఉత్తరప్రదేశ్‌‌లో వెలుగు చూసిన ఘటన

ఆజంగఢ్‌‌‌‌(యూపీ): ఢిల్లీ తరహా లాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌‌‌‌లో చోటుచేసుకుంది. తనను ప్రేమించి మరొకరిని పెండ్లి చేసుకుందన్న కారణంతో ఓ వ్యక్తి యువతిని దారుణంగా చంపేశాడు. బాడీని ఆరు ముక్కలుగా నరికి, బావిలో పడేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని ఆజంగఢ్‌‌‌‌ జిల్లా ఇషాక్‌‌‌‌ పురి గ్రామంలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌, అనురాధ(20) కొంతకాలం ప్రేమించుకున్నారు. తర్వాత విడిపోయారు.

దీంతో ఈ ఏడాది మొదట్లో అనురాధకు మరో యువకుడితో పెళ్లి జరిగింది. తనను కాదని మరో వ్యక్తిని పెండ్లి చేసుకోవడంతో, అప్పటి నుంచి ఆమెపై ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌ కోపం పెంచుకున్నాడు. తన తల్లిదండ్రులు, బంధువు సర్వేశ్‌‌‌‌, ఇతర కుటుంబసభ్యులు సాయంతో అనురాధను హత్య చేయాలని ప్లాన్‌‌‌‌ చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 9న మాట్లాడాలని చెప్పి, బైక్‌‌‌‌పై గుడికి తీసుకెళ్లాడు.

అప్పటికే అక్కడున్న సర్వేశ్‌‌‌‌ సాయంతో అనురాధను చెరుకు తోటలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. ఇద్దరూ కలిసి డెడ్‌‌‌‌బాడీని ఆరు ముక్కలుగా నరికి పాలిథిన్‌‌‌‌ సంచిలో వేసి, దగ్గర్లోని బావిలో పడేశారు. తలను బావికి దగ్గర్లో ఉన్న చెరువులోకి విసిరేసి వెళ్లిపోయారు. నవంబర్ 15న బావిలో అనురాధ డెడ్‌‌‌‌బాడీ తేలడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు ప్రిన్స్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను శనివారం అరెస్ట్ చేశారు. ఆదివారం అనురాధ తలను వెతకడానికి ఘటనా స్థలానికి తీసుకెళ్లగా, అప్పటికే అక్కడ దాచిపెట్టిన నాటు తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపి, పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా, యాదవ్‌‌‌‌కు బుల్లెట్‌‌‌‌ గాయం తగిలింది.