ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఐదు చానెల్స్​కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఐదు చానెల్స్​కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఐదు టీవీ న్యూస్ చానెల్స్​కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సున్నితమైన సమాచారాన్ని ఈడీ, సీబీఐ మీడియాకు లీక్ చేస్తూ.. తన హక్కులకు భంగం కలిగిస్తోందని లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన విజయ్ నాయర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ యశ్వంత్ వర్మ సోమవారం విచారించారు. సీబీఐ, ఈడీ అడగని ప్రశ్నలను కూడా అడిగినట్లు న్యూస్ చానెల్ లో ప్రచారం చేస్తున్నాయని నాయర్ తరఫు అడ్వకేట్ వాదనలు వినిపించారు. గతవారం హైకోర్టు ఆదేశించిన్లు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై తాము రిలీజ్ చేసిన మీడియా రిలీజ్ లను ఈడీ, సీబీఐ కోర్టుకు సమర్పించింది. అయితే, నాయర్ తన పిటిషన్‌లో పేర్కొన్న ప్రసారాలు తాము అందించిన సమాచారం ఆధారంగా జరగలేదని రెండు దర్యాప్తు ఏజెన్సీలు కోర్టుకు తెలిపాయి. 

దర్యాప్తు సంస్థలు సమాచారం, టీవీ చానెల్స్ ప్రసారాన్ని పరిశీలించిన తర్వాత రెండింటికి ఎలాంటి సంబంధం లేదని జస్టిస్ యశ్వంత్ వర్మ అభిప్రాయపడ్డారు. అనంతరం రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, జీ న్యూస్, టైమ్స్ నౌలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ చానెల్‌లు అందించే వార్తా నివేదికలను పరిశీలించి, ప్రసారాలు వాటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కోర్టుకు తెలియజేయాలని న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్, డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్బీడీఎస్ ఏ)ని కోర్టు ఆదేశించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ, ఈడీ జారీ చేసిన అధికారిక కమ్యూనికేషన్‌ల ఆధారంగా న్యూస్ టెలికాస్ట్ చేయాలంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. చానెల్‌లు ప్రసార మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని పేర్కొంది.