ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మరోసారి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈసారి హైదరాబాద్ టార్గెట్ గా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు ఇవాళ తెల్లవారుజామున నుంచి 25 ప్రత్యేక టీమ్ లుగా ఏర్పడి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. గతంలో దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ... ఇప్పుడు కేవలం హైదరాబాద్ లో జరిగిన వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం గమనార్హం.
మొదట్లో సీబీఐ FIR ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో రెండుసార్లు సోదాలు జరిపింది. ఇప్పుడు మూడోసారి పెద్ద ఎత్తున రంగంలోకి దిగడంతో ఈ స్కాంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. గత తనిఖీల సమయంలో రామచంద్రపిళ్లై ఇల్లు, ఆఫీస్ లలో సోదాలు జరిగాయి. ఇప్పుడు మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న అధికారులు.. లిక్కర్ సిండికేట్ వ్యాపారుల ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేపడుతున్నారు. లిక్కర్ స్కాంలో మరిన్ని ఆధారాల వేట కోసం ఈడీ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియాతో పాటు పలువురు ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
