Delhi Mayor elections : 10 ఏండ్ల తర్వాత మహిళా మేయర్

Delhi Mayor elections : 10 ఏండ్ల తర్వాత మహిళా మేయర్

న్యూ ఢిల్లీ:  ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కొనసాగుతోంది. 250 మంది కౌన్సిలర్లు, ఏడుగురు లోక్ సభ, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఈ ఎన్నికల్లో పాలుపంచుకుంటున్నారు. జనవరి 6నే మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా.. ఆప్ (AAP), బీజేపీ (BJP) కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో మేయర్ ఎన్నిక వాయిదా పడింది. దీంతో ఈ  సమావేశాన్ని ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈసారి మేయర్ పదవి రొటేషన్ పద్దతిలో ఉండనుంది. ఐదేండ్ల పదవికాలాన్ని మొదటి ఏడాది మహిళలకు, రెండోది ఓపెన్ కేటగిరీ, మూడోది రిజర్వ్‌డ్ కేటగిరీకి, మిగిలిన రెండు మళ్లీ ఓపెన్ కేటగిరీకి రిజర్వ్ చేశారు. దీంతో ఢిల్లీకి ఈ ఏడాది మహిళా మేయర్‌ రానున్నారు. అయితే, దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఢిల్లీకి మహిళా మేయర్ రానున్నారు.

డిసెంబరు 4న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగగా, డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు పూర్తైంది. మొత్తం 250 స్థానాల్లో సభ్యులు పోటీకి దిగగా.. 134 వార్డుల్లో ఆప్, 104 వార్డుల్లో బీజేపీ గెలిచింది. మేయర్ పదవి కోసం ఆప్‌ తరపున షెల్లీ ఒబెరాయ్‌ పోటీ పడుతుండగా, బీజేపీ అభ్యర్థిగా రేఖా గుప్తా బరిలో నిలిచారు. ఆప్ బ్యాకప్ అభ్యర్థిగా అషు థాకూర్‌ పోటీలో ఉన్నారు.

డిప్యూటీ మేయర్‌ పోస్ట్‌ కోసం ఆప్‌ నుంచి ఆలె ముహమ్మద్‌ ఇక్బాల్‌, జలాజ్‌ కుమార్‌లు, బీజేపీ నుంచి కమల్‌ బార్గీలు బరిలోకి దిగారు. పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురైంది. ఈ సమావేశానికి స్పీకర్ గా సత్య శర్మ వ్యవహరిస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెను తాత్కాలిక స్పీకర్ గా నియమించారు. మేయర్ ఎన్నికకు ముందు సభకు నామినేటెడ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంపై కూడా గందరగోళం నెలకొంది. ఎన్నికైన సభ్యులను కాకుండా నామినేట్ అయిన సభ్యులతో ముందుగా ప్రమాణ స్వీకారం ఎలా చేయిస్తారంటూ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సభకు ముందు తమ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ 10 మంది నామినేటెడ్ సభ్యుల పేర్లను పేర్కొనడంపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేసింది.