నీళ్ల కోసం ఢిల్లీ మంత్రి నిరాహార దీక్ష

నీళ్ల కోసం ఢిల్లీ మంత్రి నిరాహార దీక్ష
  •      వాటర్ విడుదల కోసం హర్యానా సర్కారుకు ఆతిశీ డిమాండ్ 

న్యూఢిల్లీ: నీళ్ల కోసం ఢిల్లీ వాటర్ మినిస్టర్ ఆతిశీ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీకి రావాల్సిన వాటా ప్రకారం హర్యానా ప్రభుత్వం నీళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె దీక్ష మొదలుపెట్టారు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ భార్య సునీత, మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఇతర లీడర్లతో కలిసి శుక్రవారం రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీకి ఆతిశీ నివాళులు అర్పించారు.

 అనంతరం దక్షిణ ఢిల్లీలోని భోగల్ కు చేరుకుని నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆతిశీ మాట్లాడుతూ.. హీట్ వేవ్ కారణంగా ఢిల్లీలో విపరీతమైన నీటి కొరత ఉందని చెప్పారు. ‘‘ఢిల్లీకి కావాల్సిన నీళ్లన్నీ పక్క రాష్ట్రాల నుంచే వస్తుంటాయి. సిటీకి ప్రతిరోజు 1,005 మిలియన్ గ్యాలన్ల నీళ్లు వస్తుంటాయి. ఇందులో హర్యానా నుంచి ప్రతిరోజు 613 మిలియన్ గ్యాలన్ల నీళ్లు రావాల్సి ఉంది.

 కానీ హర్యానా సర్కార్ రెండు వారాలుగా రోజుకు 513 మిలియన్ గ్యాలన్లను మాత్రమే ఇస్తున్నది. దీంతో నీళ్లు అందక 28 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. రెండ్రోజులుగా నీళ్ల విడుదలను హర్యానా మరింత తగ్గించింది. ప్రతిరోజు 493 మిలియన్ గ్యాలన్ల నీటినే విడుదల చేస్తున్నది. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది” అని ఆవేదన వ్యక్తంచేశారు. 

‘‘ఢిల్లీకి రావాల్సిన వాటా ప్రకారం నీళ్లను విడుదల చేయాలని హర్యానా సర్కార్​కు విజ్ఞప్తి చేశాను. ఈ విషయంలో స్పందించి సాయం చేయాలని ప్రధాని మోదీకి లెటర్ రాశాను. కానీ ఎవరూ స్పందించలేదు. నీళ్ల కోసం ఢిల్లీ ప్రజలు పడుతున్న బాధ చూడలేక, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నిరాహార దీక్ష చేపట్టాను. ఢిల్లీకి సరిపడా నీళ్లు అందేవరకూ ఇది కొనసాగుతుంది” అని తెలిపారు. 

నీళ్లపై రాజకీయాలా?: కేజ్రీవాల్  

ఆతిశీ దీక్ష సందర్భంగా తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ తన మెసేజ్​ను పంపించారు. దాన్ని ఆయన భార్య సునీత చదివి వినిపించారు. ‘‘నీళ్ల కోసం ఢిల్లీ ప్రజలు పడుతున్న బాధలను టీవీలో చూసి చలించిపోయా. ఎవరైనా దాహంతో ఉంటే, నీళ్లు ఇవ్వడం మన సంస్కృతి. ఢిల్లీకి పక్క రాష్ట్రాల నుంచే వాటర్ వస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాలు మద్దతుగా నిలుస్తాయని ఆశిస్తున్నాం. కానీ హర్యానాలోని బీజేపీ సర్కార్ ఢిల్లీకి రావాల్సిన వాటాను తగ్గించింది. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ నీళ్లపై రాజకీయాలు చేయడానికి ఇది సమయమా?” అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.