వీడియో: ఐఫోన్ అంటే అంత పిచ్చి ఏంట్రా నాయనా.. అలా కొడతారా!

వీడియో: ఐఫోన్ అంటే అంత పిచ్చి ఏంట్రా నాయనా.. అలా కొడతారా!

దేశంలో ఐఫోన్ సందడి మొదలైంది. ఫోన్లయందు ఐఫోన్ వేరయ్యా అన్నట్లు జనాలు ఎగబడుతున్నారు. ఫోన్ దక్కించుకోవడానికి షాపులు తెరవడానికి ముందే బారులు తీరుతున్నారు. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిల్చున్న దృశ్యాలు దర్శనమిస్తుంటే.. మరికొన్ని చోట్ల భౌతిక దాడులకు ఎగబడుతున్నారు. తాజాగా, ఢిల్లీలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఢిల్లీలోని కమలా నగర్ మార్కెట్‌లో ఉన్న ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్ సిబ్బందిని కస్టమర్లు దారుణంగా గాయపరిచారు. ఈ తతంగం అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఇద్దరు వ్యక్తులు సిబ్బందిపై భౌతికంగా దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐఫోన్ 15 డెలివరీలో జాప్యమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. మరోవైపు మొబైల్ అమ్మను అన్నందుకు ఈ దాడి జరిగిందని మరొకొందరు చెప్తున్నారు.

తమ సహోద్యోగులను కొట్టకుండా ఆపడానికి స్టోర్‌లోని ఇతర సిబ్బంది జోక్యం చేసుకోవడం వీడియోలో చూడవచ్చు. వీడియో ఆధారంగా దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.79వేలు

ఇక కొత్తగా విడుదలైన నాలుగు ఫోన్లలో చౌకైనది అంటే.. iPhone 15 మాత్రమే. దీని ప్రారంభ ధర 128GB వేరియంట్ రూ.79,900గా ఉంది. అదే 256GB అయితే రూ.89,900.. 512GB అయితే రూ.1,09,900 వెచ్చించాలి. మిగిలిన మూడు iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max కాస్త ధర ఎక్కువే. ఉదాహరణకు iPhone 15 ప్లస్ ధరలు చూస్తే.. iPhone 15 Plus (128 GB) రూ. 89,900, (256 GB) రూ. 99,900, (512 GB) రూ.1,19,900గా ఉన్నాయి.