మళ్లీ సుప్రీంకోర్టుకు చేరిన ఆప్​, కేంద్రం లొల్లి

మళ్లీ సుప్రీంకోర్టుకు చేరిన ఆప్​, కేంద్రం లొల్లి

న్యూఢిల్లీ: నేషనల్​ క్యాపిటల్​ ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీ, నియామకాలపై కేంద్ర ప్రభుత్వం, అర్వింద్  కేజ్రీవాల్  మధ్య జరుగుతున్న గొడవ మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలు, నియామకాలపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారం ఉంటుందని పేర్కొంటూ సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై కేంద్రం రివ్యూ కోరింది. అయితే, బ్యూరోక్రాట్ల బదిలీ, నియామకాల్లో ఢిల్లీ లెఫ్టినెంట్  గవర్నర్(ఎల్జీ) దే తుది నిర్ణయమంటూ కేంద్రం శుక్రవారం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.  దీంతో అర్వింద్  కేజ్రీవాల్  ప్రభుత్వం కూడా ఈ ఆర్డినెన్స్​ను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించింది. బ్యూరోక్రాట్ల ట్రాన్స్ ఫర్, పోస్టింగ్స్​లో (పోలీస్, పబ్లిక్  ఆర్డర్, భూ వ్యవహారాలు మినహా) తుది నిర్ణయం ఆప్  సర్కారుదేనని పేర్కొంటూ సీజేఐ​ జస్టిస్  డీవై చంద్రచూడ్  నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలతో కూడిన బెంచ్  ఈనెల 11న తీర్పు చెప్పింది.

దీంతో కేంద్రం హడావుడిగా ‘నేషనల్  క్యాపిటల్  సివిల్  సర్వీసెస్  అథారిటీ’ పేరుతో శుక్రవారం రాత్రి ఓ ఆర్డినెన్స్  పాస్  చేసింది. ఈ అథారిటీకి సీఎం చైర్ పర్సన్ గా, చీఫ్​  సెక్రటరీ, ప్రిన్సిపల్  హోం సెక్రటరీ సభ్యులుగా ఉంటారని ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు. ‘‘అథారిటీ నిర్ణయించాల్సిన విషయాలన్నీ అందులో సభ్యుల మెజారిటీ ఓట్ల ఆధారంగా చెల్లుబాటు అవుతాయి. ఒకవేళ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే, ఎల్జీదే తుది నిర్ణయం” అని ఆర్డినెన్స్​లో తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఆర్డినెన్స్  రద్దుచేసినట్లయింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఏమైనా తేడాలు ఉంటే, వాటిని తొలగించడానికే ఈ ఆర్డినెన్స్​ను జారీచేశారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కేంద్రం ఆర్డినెన్స్  రాజ్యాంగ విరుద్ధం

కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆప్ సర్కారు తీవ్రంగా మండిపడింది. కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్  రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు తమకు ఇచ్చిన అధికారాన్ని దొంగిలించడానికే  ఆ ఆర్డినెన్స్  పాస్  చేశారని విమర్శించింది. సుప్రీం తీర్పుపై ఆర్డినెన్స్  పాస్ చేస్తూ సుప్రీంకోర్టునే కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా సవాలు చేస్తోందని ఢిల్లీ సీఎం అర్వింద్ 
కేజ్రీవాల్ విమర్శించారు.