
న్యూఢిల్లీ: 20 కార్లతో మూడు గంటల పాటు చేజింగ్ చేసి కిడ్నాపర్ నుంచి ఇద్దరు చిన్నారులను ఢిల్లీ పోలీసులు రక్షించారు. ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ఏరియా ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు శనివారం తమ ఇద్దరు పిల్లలను తీసుకొని కారులో ఒక స్వీట్ షాప్‌కు వచ్చారు. షాప్ ముందు కారు నిలిపి, అందులోనే కారు కీస్‌తో పాటు పిల్లలను వదిలి దంపతులు స్వీట్లు కొనడానికి వెళ్లారు.
ఇంతలో ఒక వ్యక్తి కారులో కూర్చున్నాడు. నువ్వు ఎవ్వరని పిల్లలు అడగగా.. కారును పార్కింగ్ లాట్‌లో పార్క్ చేయాలని మీ పేరెంట్స్ తనకు చెప్పినట్లు పేర్కొన్నాడు. వెంటనే కారుతో సహా పిల్లలను తీసుకొని పరారయ్యాడు. చిన్నారుల పేరెంట్స్‌కు ఫోన్ చేసి, రూ.50 లక్షలిస్తేనే పిల్లలను విడిచిపెడతానన్నాడు. వెంటనే పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రెస్క్యూ టీమ్‌ని అలర్ట్ చేశారు.
సీసీటీవీ కెమెరాల సాయంతో నిందితుడు వెళ్తున్న మార్గాన్ని తెలుసుకున్నారు. ఆయా మార్గాల్లో పోలీసులను ఉన్నతాధికారులు అలర్ట్ చేశారు. మొత్తం 20 కార్లలో నిందితుడిని చేజ్ చేశారు. కిడ్నాపర్ ఢిల్లీకి 100 కిలోమీటర్ల దూరంలో సమయ్‌పూర్ బద్లీ ఏరియాలో కారుతో సహా చిన్నారులను విడిచిపెట్టి పారిపోయాడు.