సుఖేశ్ 200 కోట్ల దోపిడీ కేసు : జాక్వెలిన్ కు సమన్లు

సుఖేశ్ 200 కోట్ల దోపిడీ కేసు : జాక్వెలిన్ కు సమన్లు

బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసులు స‌మ‌న్లు జారీ చేశారు. సుఖేశ్ చంద్రశేఖ‌ర్ మనీలాండరింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆమెకు ఈ సమన్లు జారీ చేశారు.సెప్టెంబ‌ర్ 14న త‌మ ఎదుట హాజ‌రుకావాల‌ని వాటిలో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ఆర్ధిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) జాక్వెలిన్‌కు స‌మ‌న్లు జారీ చేయ‌డం ఇది మూడో సారి.

బిజీ షెడ్యూల్ వల్ల ఆమె వాటిని విస్మరించింది. తీహార్ జైలు నుంచి  సుఖేశ్ చంద్రశేఖర్ నడిపించిన దోపిడీ రాకెట్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసులు జాక్వెలిన్ ను ప్రశ్నించనున్నారు. ఈ కేసులో కొన్ని రోజుల క్రితం నటి నోరా ఫతేహిని ఈఓడబ్ల్యూ ఆరు గంటల పాటు ప్రశ్నించింది. 

మనీలాండరింగ్ కేసులో ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ ను ఈడీ గతంలో అరెస్టు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి భార్యను రూ.215 కోట్లకు దోపిడీ చేసిన కేసును అతడు ఎదుర్కొంటున్నాడు. వారి వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులను పరిష్కరిస్తానని చెప్పి సుఖేశ్ చంద్రశేఖర్  మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను సైతం ఈడీ నిందితురాలిగా చేర్చింది. సుఖేశ్ చంద్రశేఖర్ దాదాపు రూ.10 కోట్ల బహుమతులను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు పంపినట్టు దర్యాప్తులో ఈడీ గుర్తించింది.