న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలోని మొత్తం 70నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. శనివారం జరిగే పోలింగ్‌కు అంతా సిద్ధమని తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొంది. పోలింగ్ కేంద్రాల్లో టెక్నికల్, సెక్యూరిటీ ఏర్పాట్లను పకడ్భందీగా చేశామని పేర్కొంది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న షాహీన్బాగ్ఏరియాతో పాటు ఇతర సున్నితమైన ప్రాంతాల్లోని 5 పోలింగ్ కేంద్రాలపై మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఢిల్లీ ఈసీ అధికారులు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి సెక్యూరిటీ ఏర్పాట్లు చేసి, ఓటర్లలో కాన్ఫిడెన్స్ నింపే చర్యలు తీసుకున్నామని అన్నారు. మొత్తం 70 నియోజకవర్గాల్లోని 1.47 కోట్ల మంది ఓటర్లు శనివారం తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 18, 19 ఏళ్ల వయస్కులు 2,32,815 మంది కాగా, 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్ల సంఖ్య 2,04,830.. ఇక సర్వీస్ ఓటర్లు 11,608 మంది ఉన్నారని ఢిల్లీ సీఈఓ రణబీర్ సింగ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఢిల్లీ సీఈవో ఆఫీస్ వినూత్న ప్రచారం చేసింది. మెగా మల్టీ డొమైన్ ఔట్డోర్క్యాంపెయిన్తో పాటు మేజర్ ఎఫ్ఎం స్టేషన్లలోనూ ప్రచారం చేసింది. అధికార ఆమ్ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ట్రయాంగులర్ పోటీ జరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల ఫలితాలను మరోసారి రిపీట్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ.. మొన్నటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ఈ ఎన్నికల్లో రాబట్టాలని బీజేపీ ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి.
సెక్యూరిటీ ఏర్పాట్లిలా..
అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎన్ఎస్జీ, ఎస్ఎస్బీలకు చెందిన 190 కంపెనీల కేంద్ర బలగాలు, 19,000మంది హోం గార్డులు, 42,000 పోలీసులతో పాటు మొత్తం మంది 69వేల మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు స్పెషల్ సీపీ(ఇంటలిజెన్స్) ప్రవీర్ రంజన్ తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో మోహరించిన బలగాలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువని అన్నారు. ఢిల్లీలోని 2689 లొకేషన్లలో మొత్తం 13,750 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఇందులో 516 లొకేషన్లలోని 3,704 పోలింగ్ కేంద్రాలను అధికారులు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా ప్రకటించారు. ఈ కేంద్రాల్లో పోలీస్ సెక్యూరిటీతో పాటు పారామిలటరీ బలగాలను కూడా మోహరిస్తామని చెప్పారు.
