లిక్కర్​ స్కామ్​లో కవితనే సూత్రధారి: సీబీఐ

లిక్కర్​ స్కామ్​లో కవితనే సూత్రధారి: సీబీఐ
 • లిక్కర్​ స్కామ్​లో కవితనే సూత్రధారి
 • ఆప్​కు రూ. 100 కోట్ల మళ్లింపులో ఆమెదే కీలక పాత్ర
 • కస్టడీ అప్లికేషన్​లో సంచలన విషయాలు వెల్లడించిన సీబీఐ
 • కవితను మూడురోజుల సీబీఐ కస్టడీకి అప్పగించిన కోర్టు
 • శరత్​చంద్రారెడ్డి నుంచి తెలంగాణ జాగృతికి రూ.80 లక్షల విరాళం
 • ప్రతిఫలంగా లిక్కర్​ దందాలో చాన్స్​ ఇస్తానని శరత్​కు కవిత హామీ
 • ఐదు రిటైల్​​ జోన్ల​ కోసం 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్​
 • మహబూబ్​నగర్​లో భూమి సేల్​ డీడ్​ పేరిట రూ. 14 కోట్లు వసూలు
 • అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ బెదిరింపులు
 • కేజ్రీవాల్​తో కలిసి కవిత కుట్ర పన్నారు.. తప్పించుకునేలా సమాధానాలు
 • ఆమెను కస్టడీకి తీసుకొని ఇంటరాగేట్​ చేస్తే కానీ 
 • మరిన్ని వివరాలు బయటకు రావు..  కోర్టు దృష్టికి తెచ్చిన సీబీఐ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే ప్రధాన సూత్రధారి అని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​తో కలిసి ఆమె కుట్ర పన్నారని సీబీఐ పేర్కొంది. కవితను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని అంశాలు బయటకు వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు కస్టడీ అప్లికేషన్​ను రౌస్​ ఎవెన్యూలోని స్పెషల్​ కోర్టులో శుక్రవారం దాఖలు చేసింది. విచారించిన కోర్టు.. కవితను 3 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. 11 పేజీల కస్టడీ అప్లికేషన్​లో సీబీఐ సంచలన విషయాలను వెల్లడించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన మొదలు, స్కామ్​లో పలువురి పాత్ర, కేసు దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సహ నిందితుల స్టేట్​మెంట్లను పొందుపరిచింది. 

ట్రయల్ కోర్టు పర్మిషన్ తో ఈ నెల 6న తీహార్ జైల్లో కవితను విచారించామని, అయితే ఆమె నుంచి సరైన సమాధానాలు రాలేదని సీబీఐ పేర్కొంది. లిక్కర్ స్కామ్​లో కవిత పాత్ర, హవాలా రూపంలో మళ్లించిన డబ్బు వివరాలపై ప్రశ్నించినట్లు తెలిపింది. వీటికి తప్పించుకునే ధోరణిలో కవిత సమాధానాలు చెప్పారని, అందువల్ల కస్టడీలో ఇంటరాగేషన్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. లిక్కర్ స్కామ్​లో ఇతర భాగస్వాముల నుంచి పొందిన డబ్బులను విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లించడం, లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో నిందితులతో కలిసి కవిత కుట్ర పన్నారని సీబీఐ తెలిపింది. 

ఈ ప్రశ్నలన్నింటిపై కవిత దగ్గర జవాబులు ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా ఆమె భిన్నమైన సమాధానాలు ఇచ్చారని, వాస్తవాలను దాచిపెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని, ఆమెకు మాత్రమే తెలిసిన ఎవిడెన్స్​లను ముందు పెట్టినా.. నిజాలను అంగీకరిచడం లేదని కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ కేసులో సరైన ముగింపు రావాలంటే.. కవిత దాచిన వాస్తవాలు బయటకు రావాల్సి ఉందంది. ఈ నిజాల్ని రాబట్టేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 26న తమ ముందు హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదని, అందువల్ల కస్టడీకి తీసుకొని సాక్ష్యాలను చూపించి ఇంటరాగేట్ చేస్తేనే ఆమె నుంచి మొత్తం కుట్రకోణం బయటకు వస్తుందని కోర్టుకు తెలిపింది. అక్రమంగా డబ్బుల  మళ్లింపు, ఇతర నిందితుల పాత్రతోపాటు ఇతర అంశాలను ఆమె నుంచి రాబట్టాల్సి ఉందని వివరించింది. 

జాగృతికి శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 80 లక్షలు

ఢిల్లీ లిక్కర్ పాలసీలో లబ్ధి పొందేందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షలు ఇచ్చారని సీబీఐ తెలిపింది. శరత్ చంద్రారెడ్డికి చెందిన అరబిందో గ్రూప్స్​లోని  ‘అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా 2021 మార్చిలో ఈ నగదు బదిలీ జరిగినట్లు పేర్కొంది. ఇందుకు ప్రతిఫలంగా ఢిల్లీ లిక్కర్​ వ్యాపారంలో అవకాశం ఇస్తామని శరత్​ చంద్రారెడ్డికి కవిత హామీ ఇచ్చారని సీబీఐ వెల్లడించింది. 

భూమి సేల్​ డీడ్​ తీసి రూ.14 కోట్లు

ఢిల్లీ లిక్కర్ పాలసీ 2021–- 22 ప్రకారం ఒకే సంస్థకు రెండు రిటైల్ జోన్ల కంటే మించి కేటాయించవద్దనే రూల్​ ఉందని సీబీఐ తెలిపింది. అయితే ఈ రూల్​కు విరుద్ధంగా మూడు సంస్థలకు 5 రిటైల్​ జోన్లు కేటాయించారని పేర్కొంది. ఈ మూడు సంస్థలు శరత్ చంద్రారెడ్డివని ఆధారాలను కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఇట్ల జోన్లు  కేటాయించినందుకు ప్రతిఫలంగా శరత్​చంద్రారెడ్డి నుంచి కవిత రూ. 14 కోట్ల భూ సేల్​ డీడ్​ ద్వారా లబ్ధిపొందారని తెలిపింది. మహబూబ్ నగర్​లోని తన అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసేందుకు సేల్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాల్సిందిగా శరత్ చంద్రారెడ్డిపై కవిత ఒత్తిడి చేశారని.. ఈ స్థలం కొనడం ఇష్టం లేదని, ఈ ల్యాండ్ విలువ ఏమిటో కూడా తనకు తెలియదని శరత్ చంద్రారెడ్డి చెప్పినా ఆమె పట్టించుకోలేదని సీబీఐ వివరించింది. వెంటనే రూ.14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రా రెడ్డిని కవిత డిమాండ్ చేశారని, దీంతో 2021 జులైలో అరబిందో గ్రూప్స్​లోని ‘మహిర వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్’కు చెందిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆయన భూమిని కొనుగోలు చేశారని తెలిపింది. తొలుత 2021 జులైలో రూ.7 కోట్లు,  అదే ఏడాది నవంబర్​లో మరో రూ.7 కోట్లు కవితకు చెల్లించారని ఎవిడెన్స్​ను కోర్టుకు సీబీఐ సమర్పించింది. అయితే.. సేల్​ డీడ్​ తీసినప్పటికీ ఎలాంటి భూ మార్పిడి జరగలేదని పేర్కొంది. 

బుచ్చిబాబు వాంగ్మూలంతో తెరపైకి కవిత పేరు

లిక్కర్​ స్కామ్​లో కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు విచారణతో కవిత పేరు తెరపైకి వచ్చిందని సీబీఐ తెలిపింది. బుచ్చిబాబు మొబైల్ ఫోన్లలో లభించిన వాట్సప్ చాటింగ్స్, ఎవిడెన్స్​లతో పాటు అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలంతో కవిత పాత్ర తేలిందని పేర్కొంది. హవాలా రూపంలో డబ్బు మళ్లించినట్లు పలు పత్రాలు దొరికాయని కోర్టు దృష్టికి తెచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్, ఇతర నిందితుల ద్వారా రూ.100 కోట్లు మళ్లించడం, ఆ డబ్బును ఇతరుల నుంచి కవిత వసూలు చేయడం వంటివి బయటపడ్డాయని పేర్కొంది. కవితకు ఇండో స్పిరిట్ హోల్ సేల్ లైసెన్స్​లో భాగస్వామ్యం ఉందని, ఇందులో ఆమె బినామీగా అరుణ్ పిళ్లై వ్యవహరించారని.. బుచ్చిబాబు, కవితకు మధ్య జరిగిన ఫోన్ కాల్ ద్వారా ఈ విషయం బహిర్గతమైందని సీబీఐ వివరించింది. ఎయిర్ పోర్ట్ జోన్​లో మాగుంట రాఘవ కంపెనీ ‘పిక్సీ ఎంటర్ ప్రైజెస్’కు  ఎన్​వోసీ వచ్చేందుకు కవిత సహాయపడ్డారని వెల్లడించింది. 

2021 సెప్టెంబర్ 20న ఢిల్లీలోని హోటల్ తాజ్ మాన్ సింగ్​లో ఫెర్నార్డ్ రికార్డు ఇండియా నిర్వహించిన మీటింగ్​లో అరబిందో గ్రూప్​కు చెందిన శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, సమీర్ మహేంద్ర, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయిన్​పల్లి పాల్గొన్నారని.. ఈ మీటింగ్ కు సంబంధించిన ఫొటోలు ఫెర్నార్డ్ రికార్డు సంస్థకు చెందిన మనోజ్ రాజ్ మొబైల్ ఫోన్​లో లభించాయని కోర్టుకు సీబీఐ ఆధారాలు సమర్పించింది. కాగా..  2022 డిసెంబర్ 11న హైదరాబాద్ లో కవితను తాము విచారించామని, అయితే అప్పటికి మాగుంట రాఘవ, ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులురెడ్డి, శరత్ చంద్రారెడ్డి స్టేట్​మెంట్లను రికార్డు చేయలేదని తెలిపింది. వీరి స్టేట్​మెంట్ల తర్వాతే కవిత పాత్ర స్పష్టంగా తేలిందని సీబీఐ వెల్లడించింది. 

కేజ్రీవాల్​తో కవిత మంతనాలు

తమ దర్యాప్తులో భాగంగా సౌత్ గ్రూప్ కు చెందిన లిక్కర్ వ్యాపారి 2021  మార్చి 16న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను ఆయన ఆఫీసులో కలిశారని సీబీఐ పేర్కొంది. ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసేందుకు తాను సుముఖంగా ఉన్నట్లు ఆ వ్యాపారి సీఎంకు వెల్లడించారని, ఈ విషయంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత మిమ్మల్ని సంప్రదిస్తారని కేజ్రీవాల్ సూచించారని తెలిపింది. అలాగే తమ పార్టీ(ఆమ్​ ఆద్మీ పార్టీ)కి కావాల్సిన నిధులు ఎలా మళ్లించాలో కూడా కవితే వివరిస్తారని లిక్కర్​ వ్యాపారితో కేజ్రీవాల్ చెప్పినట్లు పేర్కొంది. ఇందుకు సదరు వ్యాపారి వాంగ్మూలాన్ని కోర్టు దృష్టికి తెచ్చింది. 

‘‘కేజ్రీవాల్ సూచనతో ఆ వ్యాపారి 2021 మార్చి 20న హైదరాబాద్ లో కవితను ఆమె ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా.. కేజ్రీవాల్​తో తాము మాట్లాడుతున్నామని, సీఎం టీం ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నదని వ్యాపారికి కవిత వివరించారు. అలాగే తనతో పాటు అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు, అరుణ్ పిళ్లైతో టచ్​లో ఉండాలని వ్యాపారికి ఆమె సూచించారు. లిక్కర్ బిజినెస్​లో పార్ట్​నర్​ షిప్ కావాలంటే... ఆప్ (ఆమ్​ ఆద్మీ పార్టీ)కు రూ. 100 కోట్లు ముడుపులుగా చెల్లించాల్సి ఉందని, ఇందుకోసం ముందుగా రూ.50 కోట్లు చెల్లించాలని ఆ వ్యాపారికి కవిత చెప్పారు. అనంతరం కవిత సీఏ బుచ్చిబాబు 2021 మార్చి 21న వ్యాపారిని కలుసుకుని రూ.50 కోట్లు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇందుకు తగ్గట్లుగా ఆ వ్యాపారి తన కొడుకు ద్వారా బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లికి రూ.25 కోట్లు చెల్లించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఈ వ్యాపారి కొడుకుకు ఇండో స్పిరిట్ హోల్ సేల్ బిజినెస్ లో రూ.32.5 శాతం వాటాను ఇచ్చారు. మరోవైపు పెర్నాల్డ్ రికార్డు ఇండియా ద్వారా ఇండో స్పిరిట్ కు హోల్ సేల్ బిజినెస్ దక్కేలా విజయ్ నాయర్ కీ రోల్ పోషించారు. నిబంధనలకు భిన్నంగా ఇండో స్పిరిట్​కు హోల్ సేల్ లైసెన్సు ఇచ్చారు” అని కవిత కస్టడీ అప్లికేషన్​లో సీబీఐ వివరించింది. వ్యాపారులు కుమ్మక్కయ్యారని, భాగస్వాములు బ్లాక్ లిస్టు అయ్యారని ఆరోపణలు వచ్చినా పట్టిచ్చుకోకుండా అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​సిసోడియా ఒత్తిడి మేరకు ఇండో స్పిరిట్ కు అక్రమ వ్యాపారం కేటాయించినట్లు తేలిందని సీబీఐ పేర్కొంది.

కేసే తప్పు..చెప్పేది ఏముంది?: కవిత

‘‘లిక్కర్ కేసే తప్పు.. ఇంకా చెప్పేది ఏముంది” అని కవిత అన్నారు. కోర్టు హాల్ నుంచి బయటికి వస్తున్న  టైంలో ఆమెను మీడియా ప్రశ్నించగా.. ‘‘సీబీఐ అధికారులు మళ్లీ అవే ప్రశ్నలు అడుగుతారు. కొత్తగా చెప్పేది ఏమీ లేదు. సీబీఐది వృథా ప్రయాస. సీబీఐ చేస్తున్నది తప్పు’’ అని వ్యాఖ్యానించారు.  

తెలంగాణలో బిజినెస్ ఎట్లజేస్తవో చూస్త

డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు సీబీఐ తెలిపింది. ‘‘ఢిల్లీ లిక్కర్​ పాలసీ రూల్స్​కు విరుద్ధంగా శరత్ చంద్రారెడ్డికి చెందిన మూడు సంస్థలకు 5 రిటైల్ జోన్లు దక్కాయి. ఇట్ల కేటాయించినందుకు గాను ఒక్కో జోన్ కు రూ.5 కోట్ల చొప్పున 25 కోట్లు చెల్లించాలని శరత్​చంద్రారెడ్డిని కవిత డిమాండ్​ చేశారు. లిక్కర్ పాలసీలో లబ్ధిపొందేందుకు తాను విజయ్ నాయర్ ద్వారా ఆమ్​ ఆద్మీపార్టీకి మొత్తం రూ .100 కోట్లు చెల్లించానని ఆయనతో అన్నారు. అయితే.. శరత్ చంద్రా రెడ్డి రూ. 25 కోట్లు ఒకేసారి చెల్లించేందుకు ఒప్పుకోలేదు. దీంతో తాను చెప్పినట్టు వినకపోతే తెలంగాణలో వ్యాపారం ఎట్ల చేస్తవో చూస్తానని శరత్​చంద్రారెడ్డిని కవిత బెదిరించారు” అని కస్టడీ అప్లికేషన్​లో సీబీఐ పేర్కొంది.