
ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతోన్న మహిళా ఐపీఎల్ ఫైనల్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (35, 29 బంతుల్లో), షిఖా పాండే (27*,17 బంతుల్లో ), రాధా యాదవ్ (27*, 12 బంతుల్లో) మినహా ఢిల్లీ బ్యాటర్లెవరూ రాణించలేదు. ముంబై బౌలర్లలో వాంగ్, హెయిలీ మాథ్యూస్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అమీలా కెర్ కు రెండు వికెట్లు దక్కాయి.
ఒకానొక దశలో ఢిల్లీ స్కోరు 100 పరుగులు దాటుతుందా అనుకున్న టైంలో షిఖా పాండే, రాధా యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ ఆ స్కోరైనా చేయగలిగింది. ఢిల్లీకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (11) తక్కువ స్కోరుకే ఔట్ అయింది. తర్వాత వచ్చిన క్యాప్సీ (0) పరుగులేమీ చేయకుడానే వెనుదిరిగింది.
దీంతో మరో ఓపెనర్ లానింగ్.. రోడ్రిగ్స్‌తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసింది. కానీ, 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోడ్రిగ్స్ ఔట్ అయింది. ఆ తర్వాత జట్టు స్కోరు 73 పరుగుల వద్ద మరిజన్నె కప్ (18), మెగ్‌లానింగ్ ఔట్ అవడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. తనియా భాటియా, అరుంధతి రెడ్డి కూడా డకౌటయ్యారు. జోనా సేన్ (2), మిన్ను మని (1) పరుగులు చేశారు. చివర్లో షిఖా పాండే, రాధా యాదవ్ రాణించడంతో ఢిల్లీ 131 పరుగులు చేసింది.