ఘజియాబాద్ ‘గ్యాంగ్-రేప్’ ఓ డ్రామా: పోలీసులు

ఘజియాబాద్ ‘గ్యాంగ్-రేప్’ ఓ డ్రామా: పోలీసులు

ఘజియాబాద్ ‘గ్యాంగ్ రేప్’ డ్రామా అని పోలీసులు తేల్చేశారు. ఆస్తి తగాదాలో ఇరికించడానికి ఓ మహిళ ఆడిన నాటకంగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ చేసిన స్పందించడంతో చర్చనీయాంశంగా మారిన ఈ కేసును యూపీ పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. 36 ఏళ్ల ఓ మహిళ తనను ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. సదరు మహిళ ఫిర్యాదుతో ఐదుగురిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళను గురుతేగ్ బహదూర్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీయడంతో స్వాతి మలివాల్ నిర్భయ కేసుతో పోల్చారు. 

ఆస్పత్రిలో మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించిన జీటీబీ ఆస్పత్రి వైద్య సిబ్బంది.. ఆమెకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని తేల్చి చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానాలు రావడంతో  మరో రెండు ప్రభుత్వాసుపత్రులకు పోలీసులు తీసుకెళ్లారు. అయితే.. అక్కడ వైద్యపరీక్షలకు నిరాకరించింది. దీంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆమె మొబైల్‌ ఫోన్ సిగ్నల్‌ను ట్రేస్‌ చేసిన పోలీసులు చివరికి ఇదంతా కట్టు కథ అని తేల్చారు. 

తన స్నేహితురాలి బర్త్‌ డే పార్టీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కారులో వచ్చిన ఐదుగురు తనను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్న ఓ స్నేహితుడు.. అదే స్పాట్‌లో ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్ లో విచారించగా అసలు విషయం బయటపడింది. బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ నుంచి ఆ స్నేహితుడికి పేటీఎం ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందని, ఈ వ్యవహారాన్ని అత్యాచారం కోణంలో ప్రచారం చేయించేందుకే అతనికి ఆమె డబ్బు ఇచ్చిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. 

ఆ ఐదుగురితో ఆస్తి తగాదాలు ఉండడం వల్లే  ఆమె అలా నాటకం ఆడిందని యూపీ రీజినల్‌ పోలీస్‌ చీఫ్‌ ప్రవీణ్‌ కుమార్‌ వెల్లడించారు. సామూహిక అత్యాచారం జరిగిందని చెబుతున్నా ఆ సమయంలో ఆమె తన స్నేహితులతో రిసార్ట్ లో ఉందని తేల్చారు. వారి సహకారంతోనే గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిందని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.