గ్యాస్ పై బ్లాక్ దందా.. ఒక్కో సిలిండర్పై అదనంగా రూ.1000 వసూలు

గ్యాస్ పై బ్లాక్ దందా.. ఒక్కో సిలిండర్పై అదనంగా రూ.1000 వసూలు
  •      కమర్షియల్ గ్యాస్ సప్లై బంద్​తో డొమెస్టిక్ కు డిమాండ్​
  •      కొత్తగూడెంలోని ఓ రెస్టారెంట్ కు నిరంతరంగా సిలిండర్ల సప్లై
  •      ఒక్కో సిలిండర్​ బండపై అదనంగా రూ.500నుంచి రూ.1000 వసూలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కమర్షియల్​ సిలిండర్ల సప్లై బంద్​ కావడంతో డొమెస్టిక్ గ్యాస్​ సిలిండర్లకు డిమాండ్​ పెరిగింది. జిల్లాలోని పలు హోటళ్లు డొమెస్టిక్​ సిలిండర్లు బ్లాక్​లో తెప్పించుకుంటున్నారు. దీంతో డెలివరీ బాయ్స్​సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. డొమెస్టిక్​ గ్యాస్​తక్కువగా ఉపయోగించే వినియోగదారుల నుంచి సిలిండర్లు బుక్​ చేయించి పర్సంటేజీలు ఇస్తూ బ్లాక్​ దందాకు పాల్పడుతున్నారు. ఒక్కో డొమెస్టిక్ సిలిండర్​ ధర  రూ.960 కాగా, హోటల్స్, రెస్టారెంట్స్​లకు రూ.1,500 నుంచి రూ.2వేలకు చొప్పున అమ్ముతున్నారు.

డెలివరీ బాయ్స్​తో ఒప్పందాలు..

కమర్షియల్​ సిలిండర్లు దొరకకపోవడంతో హోటల్స్, రెస్టారెంట్ల ఓనర్స్​ గ్యాస్​ డోర్​ డెలివరీ బాయ్స్​తో మాట్లాడుకుని డొమెస్టిక్​ సిలిండర్లను బ్లాక్​లో కొనుగోలు చేస్తున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో డబుల్​ సిలిండర్ల కనెక్షన్స్ ఉన్న వారు 98,868 మంది, సింగిల్ సిలిండర్లు ఉన్న వారు 2,41,175 మంది, దీపం కనెక్షన్స్ 53,405, సీఎస్ఆర్​ కనెక్షన్స్​ 2,465, పీఎంయూవై కనెక్షన్స్ 73,162 ఉన్నాయి. మొత్తం 26 గ్యాస్​ ఏజెన్సీలున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్​ చేస్తున్న యుద్ధంతో గ్యాస్​కు కొంత కొరత ఏర్పడింది. ఈ క్రమంలో గృహ అవసరాలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కమర్షియల్​ గ్యాస్​ సిలిండర్ల సప్లైని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో హోటల్​ యాజమాన్యాలు గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్​ సిలిండర్ల వైపు దృష్టి సారించారు. సిలిండర్లను బ్లాక్​ చేస్తుండడంతో ఇదే అదనుగా భావించిన డోర్​ డెలివరీ బాయ్స్ డొమెస్టిక్ సిలిండర్లు కూడా దొరకడం లేదంటూ ప్రచారం చేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్ల నుంచి డిమాండ్ ఉండడంతో ఒక్కో సిలిండర్​పై అదనంగా రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల వినియోగదారులే దళారులుగా మారి హోటల్స్​కు, రెస్టారెంట్లకు అధిక ధరలకు సిలిండర్లను అమ్ముతుండడం గమనార్హం. కాగా, కొత్తగూడెం నగరంలోని మున్సిపల్​ కార్పొరేషన్​కు అతి సమీపంలోని ఓ రెస్టారెంట్​కు కమర్షియల్ గ్యాస్​ సిలిండర్లు నిరంతరం సప్లై అవుతుండడం చర్చానీయాంశంగా మారింది.  


సింగరేణిలో మరో విధంగా..

సింగరేణిలో ఏజెన్సీలతో కుమ్ముక్కైన డెలివరీ బాయ్స్ గ్యాస్​ బ్లాక్​ దందాకు తెరలేపారు. రిటైర్​ అయిన కార్మికుల్లో ఎక్కువ మంది వద్ద గ్యాస్​ సిలిండర్లుంటున్నాయి. ఇటువంటి వారిని గుర్తించిన డెలివరీ బాయ్స్ వారితో గ్యాస్ బుక్​ చేయిస్తున్నారు. కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్ ఏరియాలో నివసిస్తున్న ఓ మాజీ సింగరేణి కార్మికుడికి తెలియకుండానే గ్యాస్ బుక్ అయింది. సబ్సిడీ తన ఖాతాలో పడడంతో ఆశ్చర్య పోయాడు. కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్​లో ప్రైవేట్ జాబ్ చేస్తున్న ఓ వ్యక్తికి గ్యాస్ బుక్ లేకున్నా డెలివరీ బాయ్ సిలిండర్ ఇచ్చారు. ఈ వినియోగదారుడి సెల్ నెంబర్​కే ఓటీపీ వచ్చేలా ప్లాన్ చేసి మరీ ఇవ్వడం గమనార్హం. 

హోటల్ బంద్ పెట్టినం..

కమర్షియల్ గ్యాస్ దొరకడం లేదు. నాలుగు రోజులుగా హోటల్​ను బంద్ పెట్టినం. హోటల్ నడిస్తే మా కుటుంబంతో పాటు మరో ఆరు కుటుంబాలు బతుకుతాయి. పెద్ద హోటల్స్​కు మాత్రం సిలండర్ల సప్లై ఎట్లా అవుతుందో అర్ధం కావడం లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సప్లై చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 
-ప్రకాశ్​, చిరు హోటల్​ వ్యాపారి, కొత్తగూడెం

బ్లాక్ చేస్తే కఠిన చర్యలు..

డొమెస్టిక్​ సిలిండర్లను బ్లాక్​ చేయడం, హోటల్స్, రెస్టారెంట్లకు అధిక ధరలకు అమ్మడం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్ల కొరత లేదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హోటల్స్, రెస్టారెంట్లపై ఇప్పటికే దాడులు చేసి, డొమెస్టిక్​ సిలిండర్లను గుర్తిస్తున్నాం. దాడులు నిరంతరం కొనసాగిస్తాం. 
ప్రేమ్​ కుమార్​, సివిల్​ సప్లై ఆఫీసర్​, భద్రాద్రికొత్తగూడెం