రూరల్​ మార్కెట్లలో పుంజుకోనున్న అమ్మకాలు

రూరల్​ మార్కెట్లలో పుంజుకోనున్న అమ్మకాలు

న్యూఢిల్లీ: బిస్కెట్లు, సబ్బులు, షాంపూలు, టూత్​పేస్టుల వంటి ఫాస్ట్​మూవింగ్​ కన్జూమర్​ ప్రొడక్టులకు (ఎఫ్​ఎంసీజీ) గత కొన్ని క్వార్టర్లలో గిరాకీ తగ్గింది.  ఇక నుంచి మాత్రం పరిస్థితులు బాగుంటాయని కంపెనీలు చెబుతున్నాయి. ముఖ్యంగా రూరల్​ మార్కెట్లలో అమ్మకాలు మెరుగవుతాయని అంటున్నాయి. ఇక ముందు గిరాకీ బాగుంటుందనే ఉద్దేశంతో గోద్రెజ్​ కన్జూమర్​ ప్రొడక్ట్స్​ లిమిటెడ్​ (జీసీపీఎల్​), డాబర్​, మారికో, ఇమామీ వంటివి మార్కెటింగ్​ ఖర్చులను పెంచుతున్నాయి. 

అడ్వర్టైజ్​మెంట్స్​ను మరింత ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించాయి. పోయిన ఏడాది డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్​ అర్బన్​ మార్కెట్లలో ఇవి గ్రోత్​ను సాధించాయి. సూపర్​మార్కెట్ల వంటి మోడర్న్​ ట్రేడ్​చానెల్స్​, ఈ–కామర్స్​ కంపెనీల అమ్మకాలు బాగున్నాయి. కిరాణా షాపుల వంటి వాటిల్లో అమ్మకాలు మాత్రం పెద్దగా మారలేదు. ఎఫ్​ఎంసీజీ పరిశ్రమ విక్రయాల్లో దాదాపు 35 శాతం ఉండే గ్రామీణ మార్కెట్లు మూడో క్వార్టర్లో మందకొడిగా ఉన్నాయి. అయినప్పటికీ ఈసారి పంటలు బాగుంటాయనే అంచనాలు, వ్యవసాయ ఆదాయం పెరుగుతుందనే సంకేతాలు, ప్రభుత్వం ఇన్సెంటివ్​లను కొనసాగించడం వంటివి రూరల్​ మార్కెట్లకు మేలు చేస్తాయని కంపెనీలు తెలిపాయి. ఎఫ్​ఎంసీజీ సంస్థ డాబర్ ఎగ్జిక్యూటివ్​ ఒకరు మాట్లాడుతూ క్యూ3లో గ్రామీణ మార్కెట్లలో ఇన్​ఫ్లేషన్​ ఒత్తిళ్ల ప్రభావం ఎక్కువగా కనిపించిందని, జనం చిన్న, తక్కువ ధరల ప్యాక్‌‌‌‌‌‌‌‌లకు మారడం వల్ల తమకు వరుసగా రెండవ క్వార్టర్​లో అమ్మకాలు తగ్గాయని తెలిపింది.  

పట్టణ మార్కెట్ల కంటే గ్రామాలు వెనుకబడ్డాయని పేర్కొంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో డిమాండ్ పుంజుకుంటోందని, ప్రభుత్వం ఖర్చులను పెంచడం వల్ల పల్లెటూళ్లలోనూ ఎఫ్​ఎంసీజీ ప్రొడక్టుల అమ్మకాలు పెరుగుతాయని డాబర్ ఇండియా సీఈఓ మోహిత్ మల్హోత్రా అన్నారు. మోడర్న్​ ట్రేడ్, ఈ–-కామర్స్​అమ్మకాలు బాగుండటం, ఇన్​ఫ్లేషన్​తగ్గుదల కారణంగా పట్టణాల మార్కెట్ల నుంచి ఆదాయం ఇంకా పెరుగుతుందని ఆయన అన్నారు. తాజా క్వార్టర్​లో డాబర్  నికర లాభం  5.51 శాతం తగ్గి రూ. 476.55 కోట్లకు చేరుకోగా,  ఆదాయం 3.44 శాతం పెరిగి రూ. 3,043.17 కోట్లకు చేరుకుంది. ఇది ప్రకటనలు,  ప్రచారం కోసం రూ.146.5 కోట్లు ఖర్చు చేసింది.  సఫోలా,  పారాచూట్ వంటి బ్రాండ్లు ఉన్న మారికో లిమిటెడ్  నికర లాభం 5.04 శాతం పెరిగి రూ.333 కోట్లకు చేరుకుంది.  మొత్తం ఆదాయం 2.61 శాతం వృద్ధితో రూ.2,470 కోట్లుగా ఉంది.  రాబోయే క్వార్టర్లలో మరింత గ్రోత్ ​సాధిస్తామని  పేర్కొంది. 

మారికో ప్రకటనల  ఖర్చుల వాటా అమ్మకాల ఆదాయంలో 8.9 శాతం వరకు ఉంది. ఇది సీక్వెన్షియల్​గా 3 శాతం పెరిగింది. రాబోయే క్వార్టర్లలో అన్ని విభాగాల్లో సానుకూల వృద్ధి సాధిస్తామనే నమ్మకం కనిపిస్తోందని మారికో ఎండీ సౌగతా గుప్తా తెలిపారు. జీసీపీఎల్​ మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ సీతాపతి ఇలా అన్నారు: "వస్తువుల ధరలు కాస్త తగ్గడంతో వాడకంలో క్రమంగా పెరుగుదల కనిపిస్తున్నది. గ్రాస్​ మార్జిన్లు పెరుగుతున్నాయి. ముందస్తు మార్కెటింగ్ పెట్టుబడులను, పొదుపులను పెంచుతున్నాం. రాబోయే కాలంలో లాభదాయకత మెరుగుపడటంపై ఫోకస్​ చేశాం”అని వివరించారు. డిసెంబరు క్వార్టర్​లో గోద్రెజ్ గ్రూప్ ఎఫ్​ఎంసీజీ విభాగం నికరలాభం రూ. 546.34 కోట్లు కాగా, మొత్తం ఆదాయం రూ. 3,598.92 కోట్ల వరకు వచ్చింది. మొత్తం రాబడిలో 3.55 శాతం పెరిగింది. బ్యాలెన్స్ షీట్‌‌‌‌‌‌‌‌ చాలా బాగుందని, నెట్​క్యాష్​ సానుకూలంగా ఉందని పేర్కొంది. 

డిసెంబరు క్వార్టర్​లో గిరాకీ తక్కువే...

డేటా అనలిటిక్స్ సంస్థ నీల్సన్​ ఐక్యూ పోయినవారం విడుదల చేసిన ఒక రిపోర్ట్​ ప్రకారం, డిసెంబర్ క్వార్టర్​లో ఎఫ్​ఎంసీజీ పరిశ్రమ వెనుకబడింది. వాల్యూమ్​ గ్రోత్​ ప్రతికూలంగా ఉంది. వినియోగదారులు ధరల భారంతో ఇబ్బందిపడ్డారు. దీంతో గ్రామీణ మార్కెట్లు 2.8 శాతం క్షీణించాయి. వరుసగా ఆరవ క్వార్టర్లోనూ ప్రతికూల వాల్యూమ్ గ్రోత్​ను రికార్డు చేశాయి. పట్టణ మార్కెట్ మాత్రం 1.6 శాతం నిలకడమైన సానుకూల వృద్ధిని కొనసాగించింది.  సమీప భవిష్యత్​ ఆశాజనకంగా ఉంటుందని,  ఇన్​ఫ్లేషన్ ఎఫెక్ట్​ తక్కువగా ఉండొచ్చని ప్రముఖ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌‌‌‌‌‌‌‌యూఎల్)తెలిపింది. దీనివల్ల వినియోగదారుల డిమాండ్‌‌‌‌‌‌‌‌ క్రమంగా పెరుగుతుందని, మార్జిన్లు బాగుంటాయని పేర్కొంది. ప్రస్తుత క్వార్టర్​లో సత్తా చాటి లాభదాయకతను పెంచుకుంటామని, గ్రామీణ మార్కెట్లలో డిమాండ్​ పెరుగుతోందని హెచ్‌‌‌‌‌‌‌‌యూఎల్ సీఈఓ సంజీవ్ మెహతా చెప్పారు. డిసెంబర్​ క్వార్టర్​లో హెచ్‌‌‌‌‌‌‌‌యూఎల్  నికర లాభం 7.9 శాతం పెరిగి రూ.2,481 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం 16.35 శాతం పెరిగి రూ.15,707 కోట్లకు చేరుకుంది. ఐటీసీ లాభం కూడా 18.28 శాతం వృద్ధితో రూ. 4,848.95 కోట్లకు చేరుకుంది. డిసెంబరు క్వార్టర్​లో జనం బాగానే కొన్నారని,   అయితే అమ్మకాలు కరోనా ముందుస్థాయిలో లేవని ఐటీసీ పేర్కొంది.