
- సగానికి తగ్గిన జ్యుయెలరీ డిమాండ్
- ధరల పెరుగుదల ఆశతో ఇన్వెస్ట్‌మెంట్ పెరిగింది
ముంబై : దేశంలో బంగారం గిరాకీని కోవిడ్–19 భారీగా దెబ్బకొట్టింది. జ్యువెలరీ కొనడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో సెప్టెంబర్ క్వార్టర్లో గోల్డ్ డిమాండ్ ఏకంగా 30 శాతం తగ్గి 86.6 టన్నులకే పరిమితమైంది. బంగారం ధరలు ఎక్కువగా ఉండటం కూడా డిమాండ్ పడిపోవడానికి మరో కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) చెబుతోంది. సెప్టెంబర్‌తో ముగిసిన కిందటేడాది మూడో క్వార్టర్లో బంగారం గిరాకీ 123.9 టన్నులు. విలువ పరంగా చూస్తే బంగారం డిమాండ్ మూడో క్వార్టర్లో 4 శాతం తగ్గి రూ. 39,510 కోట్లకు చేరింది. గత ఏడాది మూడో క్వార్టర్లో ఇది రూ. 41,300 కోట్లు. ఐతే, ఈ ఏడాది రెండో క్వార్టర్‌తో పోలిస్తే మాత్రం బంగారం గిరాకీ పెరిగిందని డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం చెప్పారు. ఏప్రిల్–జూన్ క్వార్టర్లో గోల్డ్ డిమాండ్ 70 శాతం పడిపోయి 64 టన్నులకు చేరింది. ఆ క్వార్టర్లో గిరాకీ బాగా తగ్గడానికి లాక్‌డౌన్ ప్రధాన కారణం. ఆ తర్వాత లాక్‌డౌన్ రూల్స్‌ను సడలించడంతో కొంత గిరాకీ పెరిగింది. ఆగస్టులో బంగారం రేటు తగ్గడం కూడా డిమాండ్ పుంజుకోవడానికి మరో కారణమని సోమసుందరం అభిప్రాయపడ్డారు.
జ్యుయెలరీ డిమాండ్ దాదాపు సగానికి తగ్గిపోయింది. జ్యుయెలరీ డిమాండ్ 48 శాతం తగ్గి 52.8 టన్నులకు పరిమితమైందని డబ్ల్యూజీసీ ఈ రిపోర్ట్‌లో వెల్లడించింది. అంతకు ముందు ఏడాది జ్యుయెలరీ డిమాండ్ 101.6 టన్నులు. విలువ పరంగానైతే జ్యుయెలరీ డిమాండ్ 29 శాతం తగ్గి రూ. 24,100 కోట్లుగా నమోదైంది. జులై–సెప్టెంబర్ 2019 క్వార్టర్లో జ్యుయెలరీ డిమాండ్ రూ. 33,850 కోట్లు. ఆసక్తికరంగా జులై–సెప్టెంబర్ 2020 క్వార్టర్లో బంగారానికి ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ పుంజుకుంది. ఇది 52 శాతం పెరిగి 33.8 టన్నులకు చేరింది. విలువపరంగా చూస్తే గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ రెట్టింపైంది. ఈ డిమాండ్ 107 శాతం పెరిగి రూ. 15,410 కోట్లయింది. ఇండియాలో సాధారణంగానే మూడో క్వార్టర్లో బంగారం అమ్మకాలు తక్కువగా వుంటాయి. రుతుపవనాలు వచ్చే సమయం కావడంతోపాటు, మంచి రోజులు కావనే ఉద్దేశంతో బంగారం కొనడానికి ప్రజలు దూరంగా ఉంటారు. పండగలు, పెళ్లిళ్లు వంటి వాటి మద్దతు లేకపోవడంతో జ్యుయెలరీ డిమాండ్ ఏకంగా 48 శాతం పడిపోయిందని సోమసుందరం తెలిపారు. దేశంలో బంగారం కొనుగోలును ప్రత్యేకమైన అనుభవంగా పరిగణిస్తారని, సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు పెట్టుకోవడం వంటి ఇబ్బందులతో ప్రజలు బంగారం షాపులవైపు చూడలేదని అన్నారు. మరోవైపు బంగారం ధరలు భారీగా పెరుగుతాయనే అంచనాలతో ఇన్వెస్ట్‌మెంట్‌గా చూసే వారు ముందుకు రావడంతో ఆ కొనుగోళ్లు పెరిగాయని పేర్కొన్నారు. ఫలితంగా గోల్డ్ బార్స్, కాయిన్స్ గిరాకీ 51 శాతం పెరిగి 33.8 టన్నులకు చేరిందని చెప్పారు.
గోల్డ్ గోయింగ్ డిజిటల్ రూట్…
లాక్‌డౌన్ కాలంలో చోటు చేసుకున్న మరో ఆసక్తికరమైన పరిణామం…గోల్డ్ బిజినెస్ డిజిటల్ వైపు మళ్లడం. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రముఖ జ్యుయెలర్స్ అందరూ డిజిటల్ బాట పట్టారు. వాలెట్స్ ద్వారా కూడా గోల్డ్ అమ్మడం మొదలు పెట్టారు. వాలెట్స్ ద్వారా జరిగే సేల్స్ భారీగా పెరిగాయి. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) యాక్టివిటీ కూడా పెరిగిందని సోమసుందరం చెప్పారు. మూడో క్వార్టర్లో ఇండియాలో రీసైకిలయిన గోల్డ్ 41.5 టన్నులు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతం ఎక్కువ.
పండగలతో డిమాండ్ మెరుగవుతుందనే ఆశ
దసరా, థంతేరాస్, ఇతర పండగల కారణంగా నాలుగో క్వార్టర్లో బంగారం డిమాండ్ బాగా పెరుగు తుందనే అంచనాలున్నాయి. పంటల దిగుబడులు పూర్తవడంతో పెళ్లిళ్ల సీజనూ ఊపందుకుని ఈ డిమాండ్ బలపడుతుందనిఆశిస్తున్నారు. రుతుపవనాలు ఈ సారి అనుకూలంగా ఉన్నప్పటికీ, బంగారం ధరలు అధికంగానే ఉండటంతో డిమాండ్‌పై వాటి ప్రభావం కొంత ఉంటుందనిసోమసుందరం తెలిపారు. కాకపోతే, అంతకు ముందుక్వార్టర్లతో పోలిస్తే డిమాండ్ బాగా మెరుగవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు, పండగ సమయాలలో గతంలోలా ఇప్పుడు ఖర్చు పెట్టకపోవడంతో, ఆ డబ్బు ఇప్పుడు బంగారం కొనుగోలు వైపు వస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. కరోనా భయం నుంచి ఇంకా పూర్తిగా బయటకు రాకపోవడంతో పూర్తి ఏడాదికి బంగారం డిమాండ్ ఎంతఉంటుందనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని తెలిపారు. కోవిడ్-19 తర్వాత డిమాండ్ మళ్లీ గతంలోలాగే పుంజుకుంటుందని, 2009 తర్వాత జరిగినట్లే జరుగు తుందని అంచనా వేస్తున్నట్లుసోమసుందరం వెల్లడించారు.