భారత ప్రజాస్వామ్యానికి అవే మూల స్తంభాలు

భారత ప్రజాస్వామ్యానికి అవే మూల స్తంభాలు

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య స్ఫూర్తి భారతీయుల జీవన శైలిలో తరతరాలుగా ఇమిడిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. చట్టాలు, నాగరిక విలువలను ఇండియన్స్ ఎంతగానో గౌరవిస్తారని సమ్మిట్ ఫర్ డెమొక్రసీలో మోడీ వ్యాఖ్యానించారు. యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోడీ వర్చువల్ గా పాల్గొన్నారు. కార్యక్రమంలో 12 దేశాల అధినేతలు,  80 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. భారతీయ నాగరిక విలువలు ప్రజాస్వామ్యానికి అసలైన మూలాధారమని చెప్పారు. ఈ దేశ ప్రజల జీవనశైలిలో అదో భాగమన్నారు. 

ప్రజాస్వామ్య సూత్రాలను గ్లోబల్ గవర్నెర్స్ లో భాగం చేయాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు.  సునిశితత్వం, జవాబుదారీతనం, సంస్కరణల్లో భాగస్వామ్యం కావడం, సమ్మిళిత అభివృద్ధిని సాధించడమే భారత ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా నిలిచాయ‌ని వెల్ల‌డించారు. ప్ర‌జాస్వామ్యానికి భార‌త్ పుట్టినిల్లు వంటిద‌న్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేయ‌డానికి తాము అన్ని దేశాలతో క‌లిసి ముందుకు సాగుతామ‌న్నారు. ప్రజాస్వామ్య సమాజాలను కాపాడేందుకు టెక్నాలజీని సరైన దిశలో వినియోగించుకోవాలని సూచించారు. డెమొక్రసీ అంటే ఎప్పటికప్పుడు తప్పులు సరిదిద్దుకుంటూ మెరుగ్గా ముందుకెళ్లడమేనని అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ వ్యాఖ్యానించారు. ఏకాభిప్రాయం, పరస్పర సహకారంతోనే ప్రజాస్వామ్య సమాజాలను మెరుగ్గా నడపగలమని పేర్కొన్నారు.