కూల్చివేతలపై స్టే ఇవ్వలేం.. కానీ చట్టానికి లోబడి వెళ్లాలి

కూల్చివేతలపై స్టే ఇవ్వలేం.. కానీ చట్టానికి లోబడి వెళ్లాలి

ఉత్తరప్రదేశ్‌లో అక్రమ ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన హింసాకాండలో నిందితుల ఇళ్ల కూల్చివేతపై స్పందించిన కోర్టు..  "చట్టానికి లోబడి కూల్చివేతలు ఉండాలని, అవి ప్రతీకారం తీర్చుకోలేవ"ని పేర్కొంది. కానీ ఆ కూల్చివేతలను నిలిపివేయాలని మాత్రం సుప్రీం ఆదేశించలేదు. కూల్చివేతలపై స్టే ఇవ్వలేం.. కానీ చట్టానికి లోబడి వెళ్లాలని చెప్పగలమని కోర్టు వ్యాఖ్యానించింది. గత కొన్ని రోజుల క్రితం మహ్మద్ ప్రవక్తపై ఇద్దరు బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో కాన్పూర్ జిల్లాతోపాటు, యూపీలోని పలు చోట్ల ఇస్లాం సంఘాల ఆధ్వర్యంలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. దీంతో హింస కాండకు పాల్పడ్డ ఇళ్లను కూల్చివేసే పనిలో పడ్డ యోగీ ప్రభుత్వం.. ఘర్షణలో పాల్పడినట్టు భావిస్తున్న ఇద్దరి ఇళ్లను ఇటీవలే కూల్చివేసింది. మరి కొంతమంది ఇళ్లపైనా తమ ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధమవుతోంది. ఇలా చట్టవిరుద్ధమైన ఇళ్ల కూల్చివేతలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జమియత్ ఉలమా-ఇ-హింద్ అనే సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.