నిజామాబాద్‌‌ జిల్లాలో దడపుట్టిస్తున్న డెంగీ

నిజామాబాద్‌‌ జిల్లాలో దడపుట్టిస్తున్న డెంగీ

నిజామాబాద్, వెలుగు:  ఉమ్మడి నిజామాబాద్‌‌ జిల్లాలో డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది డెంగీ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలంలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి దోమలు వృద్ధి చెందాయి. వాటి ప్రభావం వల్ల జనాలు డెంగీ బారిన పడుతున్నారు. ఈ సీజన్‌‌ జూలై నుంచి ఇప్పటి వరకు 800 డెంగీ కేసులు నమోదయ్యాయి. మూడు నెలల్లో 300పైగా కేసులు వచ్చినట్లు సమాచారం. నవంబర్‌‌‌‌ నెలలోనే 49 కేసులు వచ్చాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలు, వర్ని, కోటగిరి, నందిపేట మండలాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయి. అయితే అధికారికంగా నిజామాబాద్ జిల్లాలో 179, కామారెడ్డి జిల్లాలో 38 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కానీ  ప్రైవేట్ హాస్పిటళ్లలో దాదాపు 600 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. 

15 నెలలైనా పత్తాలేని నివేదిక..

ఉమ్మడి జిల్లాలో గతేడాది 250  కేసులు నమోదు కాగా అధికారికంగా 50 కేసులు మాత్రమే నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది.  ఈ ఏడాది ఇప్పటికే 800  కేసులు వచ్చాయి. ఒక్క జీజీహెచ్‌‌లో ఇప్పటి వరకు 83 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని డిచ్‌‌ పల్లి నందిపేట, ఆర్మూర్, భీమ్ గల్, బోధన్, కమ్మర్‌‌‌‌పల్లి మండలాల్లో 35, నవీపేటలో 20 కేసులు వచ్చాయి. డెత్ కేసులను వైద్య ఆరోగ్య శాఖ  అధికారికంగా ధ్రువీకరించడం లేదు.  ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న  ఫీవర్ సర్వేలోనూ డెంగీ కేసులు బయటపడుతున్నాయి. గత ఏడాది ఆగస్టు నెలలో  డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో  ఎంటమలాజిస్ట్‌‌లు  పర్యటించారు. దోమల శాంపిళ్లను సేకరించి 15 నెలలు దాటినా ఇప్పటికీ నివేదికను వెల్లడించలేదు. జిల్లా వ్యాప్తంగా డెంగీ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు  చేయడం లేదు. డెంగీ టెస్ట్ సెంటర్ నిజామాబాద్‌‌ జీజీహెచ్‌‌లో మాత్రమే ఉంది. ఇక్కడ రోజుకు వంద మందికి టెస్టులు చేస్తున్నారు. దీంతో చాలా మంది రోగులు ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారు. వారు ఇదే అదునుగా భావించి పేషంట్లను ఫీజుల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు.

దోమల నివారణ పేరు ఖర్చు..

నిజామాబాద్‌‌ అర్బన్ పరిధిలోని 60 డివిజన్లలో దోమల నివారణకు 13 మిషన్లతో సాయంత్రం వేళల్లో ఫాగింగ్ చేస్తున్నారు. ఇందుకు కార్పొరేషన్ రోజుకు రూ. 23 వేలు చొప్పున నెలకు రూ.6.90 లక్షలు ఖర్చు చేస్తోంది. ఏడాది కి రూ.82 లక్షల 80 వేలు ఖర్చు చేస్తున్నా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. 

దోమలతోనే డెంగీ ఫీవర్లు

స్లమ్ ఏరియాల్లో దోమలతోనే డెంగీ ఫీవర్లు ఎక్కువగా వస్తున్నాయి. దోమల నివారణకు నివారణకు లక్షలు ఖర్చు చేస్తున్నా సమస్య అలానే ఉంది. పరిసరాల పరిశుభ్రతపై మున్సిపల్ ఆఫీసర్లు అవగాహన కల్పించాలి. - అమంద్ విజయ్, స్థానికుడు

జీజీహెచ్‌‌లో 83 కేసులు

జీజీహెచ్‌‌లో ఇప్పటి వరకు 83 కేసులు నమోదయ్యాయి. డెంగీ పేషెంట్లకు స్పెషల్ ట్రీట్‌‌మెంట్‌‌ అందిస్తున్నాం. హాస్పిటల్‌‌లో రోజు వంద మందికి టెస్టులు చేస్తున్నాం. డాక్టర్‌‌‌‌ ప్రతిమారాజ్, సూపరింటెండెంట్, జీజీహెచ్‌