చిన్నారులపై డెంగ్యూ పంజా ..రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ బాధితులతో ఆస్పత్రులు ఫుల్

చిన్నారులపై డెంగ్యూ పంజా ..రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ బాధితులతో ఆస్పత్రులు ఫుల్
  • నాలుగు రోజుల్లో నలుగురు పిల్లలు మృతి
  •  
  • నిలోఫర్ ఆస్పత్రికి ప్రతిరోజూ 25 నుంచి 30 మంది

కరీంనగర్ జిల్లా హాస్పిటల్​లోని పీడియాట్రిక్ వార్డు పేషెంట్లతో నిండిపోయింది. ఈ వార్డులో 38 బెడ్స్ ఉండగా, ప్రస్తుతం 61 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు. దీంతో నడిచే దారిలో అదనంగా మరో 4 బెడ్స్ వేశారు. ఒక్కో బెడ్ పై ఇద్దరిని ఉంచి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. పిల్లల తల్లులు, బంధువులతో ఆ వార్డు అంతా రద్దీగా మారింది.

నెట్​వర్క్/హైదరాబాద్, వెలుగు : చిన్నారులపై డెంగ్యూ పంజా విసురుతున్నది. డెంగ్యూ, ఇతర విష జ్వరాలు సోకిన పిల్లలతో రాష్ట్రంలోని ఆస్పత్రులు నిండిపోయాయి. హైదరాబాద్​లోని నిలోఫర్​ఆస్పత్రికి ప్రతిరోజూ 25 నుంచి 30 మంది పిల్లలు వైరల్​ఫీవర్స్​తో వస్తుండగా, వారిలో కనీసం ఆరుగురికి డెంగ్యూ కన్​ఫర్మ్ అవుతోందని సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. ఆస్పత్రిలో ప్రస్తుతం 35 మంది చిన్నారులు డెంగ్యూతో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇక కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వందలాది మంది చిన్నారులు విష జ్వరాలతో విలవిల్లాడుతున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని పీడియాట్రిక్ వార్డుతో పాటు ప్రైవేట్ హాస్పిటళ్లు ఫీవర్ వచ్చిన చిన్నారులతో నిండిపోయాయి.

కరీంనగర్ టీ డయాగ్నస్టిక్ సెంటర్ రిపోర్టు ప్రకారం.. ఈ నెలలో మంగళవారం నాటికి 106 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్టు తేలింది. పెద్దపల్లి జిల్లాలో గడిచిన 20 రోజుల్లో 72, కేవలం ఈ వారంలోనే 41 డెంగ్యూ కేసులు వచ్చినట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. నిజామాబాద్​జిల్లాలో ఈ నెలలో ఇప్పటివరకు 149 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఆయా చోట్ల చిన్నారులే బాధితులుగా ఉంటున్నారు. ఖమ్మం జిల్లాలో మంగళవారం నాలుగు డెంగ్యూ పాజిటివ్​కేసులు నమోదు కాగా, ఆ నలుగురూ విద్యార్థులే కావడం గమనార్హం.

పిల్లల్లోనే ఎక్కువ మరణాలు..

పెద్దవాళ్లతో పోల్చినప్పుడు రోగనిరోధకశక్తి తక్కువగా ఉండడం వల్ల15 ఏండ్లలోపు పిల్లలపై డెంగ్యూ తీవ్ర ప్రభావం చూపుతోందని, ఫలితంగా ప్లేట్​లెట్స్​స్పీడ్​గా పడిపోయి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని డాక్టర్లు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారంలో ఆదివారం ఆద్యంత్​అనే బాలుడు డెంగ్యూతో చనిపోగా, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దొద్దిగూడెంకు చెందిన కుడిమేత జలపతి (14) అనే బాలుడు సోమవారం చనిపోయాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన పెనుగొండ ఆద్యశ్రీ (9) హనుమకొండలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలానికి చెందిన సనశ్రీ(10) డెంగ్యూతో బుధవారం చనిపోయింది. ఇలా నాలుగు రోజుల వ్యవధిలో నలుగురు పిల్లలు డెంగ్యూ బారిన పడి చనిపోయినా, సర్కారు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్లేట్ లెట్స్ ఎక్కించే మిషిన్లు లేవ్..

పిల్లల్లో వరుసగా రెండ్రోజుల పాటు జ్వరం తగ్గకుంటే వెంటనే టెస్టులు చేయించి, డెంగ్యూ అని తేలితే ట్రీట్​మెంట్​ప్రారంభించాల్సి ఉంటుందని.. కానీ పేరెంట్స్​ఆలస్యం​చేస్తుండడంతో పరిస్థితి క్రిటికల్​గా మారుతోందని డాక్టర్లు చెబుతున్నారు. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్లేట్​లెట్​ సెపరేటర్ మిషిన్లు లేకపోవడంతో డెంగ్యూ పేషెంట్లను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్​లాంటి సిటీలకు రిఫర్​చేస్తున్నారు. ఈలోగా ఒకట్రెండు రోజులు వృథా అయి పరిస్థితి విషమిస్తోంది. నిర్మల్ జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతుండగా, ఇక్కడి ఆసుపత్రిలో ప్లేట్ లెట్ సెపరేటర్​పని చేయకపోవడంతో హైదరాబాద్​ రిఫర్ ​చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గత వారం రోజుల్లో 63 డెంగ్యూ పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇక్కడి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మిషిన్ లేకపోవడంతో ప్రైవేట్ ల్యాబ్స్, ఆసుపత్రుల్లో ప్లేట్​లెట్స్​ఎక్కించాల్సి వస్తోందని.. ఇదే అదనుగా లక్షలకు లక్షలు దోచుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఇన్​టైంలో ప్లేట్​లెట్స్​ఎక్కించే పరిస్థితి లేకపోవడం వల్ల కూడా పరిస్థితి విషమిస్తోందని అంటున్నారు.

స్కూళ్లు, హాస్టళ్ల చుట్టూ దోమలు వ్యాప్తి..

వర్షాకాలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్ల చుట్టూ మురికినీటి నిల్వలు, చెత్తాచెదారం పేరుకుపోయాయి. వాటిని తొలగించడంలో  పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. సిబ్బంది, లోకల్ ​ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, ఫండ్స్​లేవనే సాకుతో దోమల నిర్మూలన కార్యక్రమాలను పక్కన పెట్టేశారు. ఫాగింగ్​కూడా నామమాత్రంగా చేస్తుండడంతో దోమలు విజృంభించి.. వైరల్​ ఫీవర్స్, డెంగ్యూ వ్యాప్తి చెందుతున్నాయి.

ఖమ్మం రూరల్ మండలం తీర్థాలకు చెందిన తిరుమల.. స్థానిక బైపాస్ రోడ్డులోని కస్తూర్బా స్కూల్​హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతోంది. మూడ్రోజులుగా జ్వరం వస్తుండడంతో స్కూల్ సిబ్బంది పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. తిరుమలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించగా డెంగ్యూ పాజిటివ్​గా తేలింది. బిడ్డను తీసుకొచ్చేందుకు వెళ్లిన పేరెంట్స్​స్కూల్ ముందు ఉన్న పరిస్థితి చూసి నివ్వెరపోయారు. ఇక్కడ ఖాళీ ప్లాటులో భారీగా వర్షం నీళ్లు నిలిచాయి. గత నెలలో కురిసిన వర్షాలకు స్కూల్ ప్రహరీ కూలిపోయింది. అప్పటి నుంచి దోమల వ్యాప్తి పెరిగిందని, దీంతో తమ పిల్లలు డెంగ్యూ బారిన పడ్తున్నారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం తప్పుడు లెక్కలు

రాష్ట్రంలో డెంగ్యూ కేసులు, మరణాలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా కేసులు ఎక్కువగా లేవని బుకాయిస్తూ.. మరణాలను జీరోగా చూపేందుకు ప్రయత్నిస్తోంది. డెంగ్యూతో మరణించినప్పటికీ, దవాఖాన్లలో ఇచ్చే డెత్ సర్టిఫికెట్‌‌లో కాజ్ ఆఫ్ డెత్ ఇంకేదో రాసి ఇస్తున్నారు. ప్రభుత్వ సూచన మేరకే కాజ్ ఆఫ్ డెత్ డెంగ్యూగా రాయడం లేదని డాక్టర్లు చెబుతున్నారు.  వైరల్ ఫీవర్ బారిన పడి కూడా పరిస్థితి విషమించి ప్రాణాలు పోతున్న కేసులు ఉన్నాయంటున్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, పల్లె దవాఖాన్లు, బస్తీ దవాఖాన్లు ఉన్నప్పటికీ జనాలు జ్వరాల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టడం లేదు. ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని హెల్త్ డైరెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో.. కొన్ని చోట్ల హెల్త్ క్యాంపులు నిర్వహించారు. అయితే డాక్టర్లు ఉండాల్సిన క్యాంపుల్లో ఆశా వర్కర్లు, ఏఎన్‌‌ఎంలు మాత్రమే ఉంటున్నారు. దీంతో హెల్త్ క్యాంపులు పెద్దగా ప్రయోజనం కల్పించడం లేదు.

డెంగ్యూ కేసులు ఆరు వేలేనట!

రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ బాధితులతో దవాఖాన్లు కిటకిటలాడుతున్నప్పటికీ.. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం కేసుల సంఖ్య తక్కువగా ఉంటోంది. నెల రోజుల్లో 2.46 లక్షల మంది జ్వరాల బారిన పడగా.. 6,229 డెంగ్యూ కేసులు మాత్రమే నమోదైనట్టు ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌‌లో 4,673, కరీంనగర్‌‌‌‌లో 264, ఖమ్మంలో 218 కేసులు చూపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలో డెంగ్యూతో రెండ్రోజుల క్రితమే ఓ బాలుడు మరణించగా, ప్రభుత్వ లెక్కల్లో మాత్రం పెద్దపల్లిలో డెంగ్యూ కేసుల సంఖ్య జీరోగా చూపిస్తున్నారు. కొత్తగూ డెంలో వేల మంది డెంగ్యూ బారిన పడ్డారు. సుమారు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ జిల్లాలో 57 మందికే డెంగ్యూ సోకినట్టు సర్కార్ చెబు తోంది. సిరిసిల్ల, వికారాబాద్, యాదాద్రి, గద్వాల, మహబూబాబాద్‌‌, నారాయణపేట్ సహా పలు జిల్లాల్లో ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాలేదని అధికారిక లెక్కల్లో పేర్కొన్నారు.

రోజూ 30 కేసులు వస్తున్నయ్..

వైరల్ ఫీవర్లతో సగటున రోజూ 30 మంది పిల్లలు అడ్మిట్ అవుతున్నారు. వీరిలో యావరేజ్‌‌గా ఆరేడుగురికి డెంగ్యూ పాజిటివ్‌‌గా వస్తోంది. చికిత్స అందించి, పూర్తిగా కోలుకున్నాకే పిల్లల్ని డిశ్చార్జ్ చేస్తున్నాం. ప్రస్తుతం హాస్పిటల్‌‌లో 35 మంది డెంగ్యూ పేషెంట్లున్నారు. పిల్లలకు ఫీవర్ వస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లకు చూపించాలి. మూడ్రోజుల కంటే ఎక్కువగా ఫీవర్ ఉంటే, డాక్టర్ సూచన ప్రకారం టెస్టులు చేయించాలి. ఈ మధ్య న్యుమోనియా కేసులూ ఎక్కువగా వస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలి. - డాక్టర్ ఉషారాణి, సూపరింటెండెంట్‌‌, నీలోఫర్ హాస్పిటల్