కమ్మేసిన పొగమంచు..పదైనా కనిపించని సూర్యుడు

కమ్మేసిన పొగమంచు..పదైనా  కనిపించని సూర్యుడు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటలు దాటినా కూడా వెలుతురు కనిపించడం లేదు. 9 గంటలు అయితేగానీ సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులకు రోడ్డు కనిపించపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లడ్ లైట్లు వేసినా రహదారి కనిపించలేనంతగా మంచు పడుతోంది. పొగమంచు ధాటికి మార్నింగ్ వాకర్స్, ఎక్సర్ సైజ్ చేసేవాళ్లు కనిపించడం లేదు. దీంతో స్టేడియాలు, పార్కులు, రోడ్లు అన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. 

మరో వారం పదిరోజుల్లో చలికాలం ముగియనుంది. అయినా ఆదిలాబాద్‌ జిల్లాలో చలిపులి పంజా విసురుతున్నది. జిల్లా వ్యాప్తంగా ప్రజలను వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలితీవ్రత పెరిగిపోయింది. దీనికితోడు చల్లని గాలులు వీస్తుండటంతో ఉదయం 10 గంటలైనా ఇంట్లోంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.కొండ ప్రాంతాలు, జాతీయ రహదారులపై, గ్రామాలు, వాగులను పొగమంచు కమ్ముకోవడంతో చలి మరింత పెరిగిపోయింది. దీంతో ప్రజలు మళ్లీ స్వెటర్లు, చలి మంటలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక వృద్ధులు, చిన్న పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలికి వణికిపోతున్న వారు బయటకు రాకుండా ఇంటికి పరిమితమయ్యారు.