- డీఈవో భోజన్న
నర్సాపూర్ (జి)/ దిలావర్ పూర్, వెలుగు : ఇంగ్లిష్ భాషాభివృద్ధి కోసం ఎల్టా (ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్) చేస్తున్న కృషి అభినందనీయమని డీఈవో భోజన్న అన్నారు. శుక్రవారం దిలావర్పూర్ మండలంలోని ఫెయిర్ హైస్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంగ్లిష్ ఒలంపియాడ్, ఎడ్యుకెస్ట్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొంతకాలం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్టా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లాలో కార్పొరేట్ స్థాయి విద్యార్థులకు తీసిపోని విధంగా ఇంగ్లిష్ భాషలో నైపుణ్యం సాధిస్తున్నారని చెప్పారు.
అనంతరం రాష్ట్రస్థాయి ఇంగ్లిష్ ఒలంపియాడ్, ఎడ్యుకేస్ట్ విజేతలకు డీఈవో బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. జుమ్మెరాత్ పేట్ హైస్కూల్ కు చెందిన అయిట్ల నవ్య, బాసర జడ్పీహెచ్ఎస్ కు చెందిన ఫిర్దోస్ భాను, మాస్కాపూర్ జడ్పీహెచ్ఎస్ కు చెందిన మహేశ్వర్, దిలావర్పూర్ జడ్పీహెచ్ఎస్ కు చెందిన ఎం సుమిత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
కార్యక్రమంలో జడ్జిలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవికుమార్, రజిత, వశిష్ట కాలేజ్ ప్రిన్సిపాల్ అఖిలేష్ కుమార్, గం గన్న డేవిడ్, ఎంఈవో సదానందం, ఫెయిర్ స్కూల్ కరస్పాండెంట్ నరసింహారెడ్డి, ఎల్టా వ్యవస్థాపక అధ్యక్షుడు కడార్ల రవీంద్ర, జిల్లా అధ్యక్షుడు కొప్పుల వేణుగోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, టీచర్లు పాల్గొన్నారు.
