యూత్‌లోనే డిప్రెషన్‌ ఎక్కువ

యూత్‌లోనే డిప్రెషన్‌ ఎక్కువ

యూత్‌‌ మీద సొసైటీ చాలా ఒపీనియన్స్‌‌తో ఉంటుంది. అదెలాగంటే... స్కూల్లోనేమో ‘మీ చేతుల్లోనే దేశ భవిష్యత్తు’ ఉంది అంటారు. ‘రేపటి తరానికి మీరే మార్గదర్శి’ అంటూ పెద్ద రెస్పాన్సిబిలిటీని భుజాల మీదకి ఎత్తుతారు. పేరెంట్స్‌‌ ఏమో ‘రేపు చాలా గొప్పవాళ్లై మా కష్టాలు తీరుస్తారు’ అంటారు. 

చిన్నప్పటి నుండే ఇలా మానసికంగా ఒక్కో విషయాన్ని వాళ్లపైన రుద్దుతూ పెంచుతారు. ఆ మాటలను మైండ్‌‌లో పెట్టుకున్న వాళ్లకు సొంతకాళ్లమీద నిలబడాల్సి వచ్చినపుడు వాళ్లలోని స్టామినా ఎంతనేది తెలుస్తుంది.  దేశంలో 15 నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లలోనే డిప్రెషన్‌‌ ఎక్కువగా ఉంటుంది. దాదాపు వందలో 20 శాతం మంది డిప్రెషన్‌‌లోకి వెళ్తున్నారు. వాళ్లలో తాము అనుకున్న కెరీర్‌‌‌‌లో లేని వాళ్లే ఎక్కువ. వీళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో రీజన్‌‌.

అవేంటంటే...
చాలామంది పేరెంట్స్‌‌ వాళ్ల పిల్లలకు ఇష్టమున్నది చదవనివ్వరు. స్కూల్‌‌ నుండి కాలేజ్‌‌ వరకు నువ్వు ‘ఈ కోర్స్‌‌ చెయ్యి, ఈ గ్రూప్‌‌ తీస్కో’ అంటూ ఒత్తిడి తెస్తారు. ‘మీకేం చేయాలని ఉంది’ అని అడగకుండా వాళ్ల నిర్ణయాలను పిల్లలపై రుద్దుతారు. వేరే పిల్లలతో పోల్చుతూ వాళ్లలాగ ఉండాలని ఫోర్స్‌‌ చేస్తారు. ఇదంతా విని అసలు తాము ఏం చేయాలనుకున్నారో మరిచిపోతారు. ఈ విషయం పైన అతిగా ఆలోచించి ‘నేనేం చేయాలి. నాకు నచ్చింది చేయాలా? లేదా మా వాళ్లకు నచ్చింది చేయాలా?’ అనే కన్ఫ్యూజన్‌‌లో పడి డిప్రెషన్‌‌ బారిన పడుతున్నారు.

డిప్రెషన్‌‌కు సొసైటీ వల్ల పడే ఒత్తిడి కూ‌‌‌‌డా ఒక కారణం. చుట్టు పక్కల వాళ్ల మాటలు విని పిల్లలకు ఇష్టం ఉందో, లేదో తెలుసుకోకుండా ‘వాళ్ల పిల్లాడు చదివేది చదువు.’ ‘ఆ జాబ్‌‌ బాగుంటుంది అది చెయ్యి’ అని ఒత్తిడి చేస్తారు. కొంతమంది వర్క్‌‌ బిజీలో పడి వాళ్ల పిల్లలను సరిగ్గా పట్టించుకోరు. వాళ్లకు అన్ని అవసరాలు సమకూరుస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంచుతున్నాం అనుకుంటారు. పిల్లలతో సరిగ్గా టైం స్పెండ్‌‌ చేయరు. దీంతో పేరెంట్స్‌‌ మమ్మల్ని  సరిగ్గా పట్టించుకోవట్లేదు అని డిప్రెషన్‌‌లోకి వెళ్తారు. ఇంకొందరు చెడు దారిన పడే అవకాశం కూడా ఉంది. కెరీర్ పట్ల ఒక ప్లానింగ్‌‌ లేకపోవడం, లైఫ్‌‌లో సెటిల్‌‌ అవుతాననే కాన్ఫిడెన్స్‌‌ లేకపోవడం కూడా డిప్రెషన్‌‌కు కారణం. వీటన్నిటితో పాటు ఫైనాన్షియల్‌‌ ప్రాబ్లమ్స్‌‌ కూడా యూత్‌‌ డిప్రెషన్‌‌కు కారణాలే. 

ఇవన్నీ ఒక ఎత్తైతే... లవ్‌‌ బ్రేకప్స్‌‌ కూడా డిప్రెషన్‌‌కు ఒక కారణం. తెలిసీ తెలియని వయసులోనే  ప్రేమలో పడుతున్నారు చాలామంది. తరువాత ఏదో ఒక కారణంతో బ్రేకప్‌‌ అయి డిప్రెషన్‌‌లోకి వెళ్తున్నారు. డిప్రెషన్‌‌లోకి వెళ్లడానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. డిప్రెషన్‌‌ బారిన పడిన వాళ్లను గుర్తించాలి. డిప్రెషన్‌‌కు సరైన కారణం 
కనుక గుర్తిస్తే వాళ్లకు మంచి కౌన్సెలింగ్‌‌ ఇప్పించి తిరిగి మామూలు మనుషులను చేయొచ్చు.