
బీసీ వాదాన్ని భుజాలకెత్తుకున్న కాంగ్రెస్ ‘కామారెడ్డి డిక్లరేషన్’ దాటి మరో అడుగు ముందుకువేసేనా? తెలంగాణలో బహుళ సంఖ్యాకులైన బీసీ వర్గాల్లో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. కులగణన, రిజర్వేషన్ల పెంపు తర్వాత రాజ్యాధికారం దిశలో బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవిస్తే బలమైన అడుగుపడినట్టేనని ఆ వర్గాలు భావిస్తున్నాయి. వెంటనే కాకున్నా ఎప్పటికయినా ముఖ్యమంత్రి హోదా దక్కితేనే వెనకబడిన వర్గాలకు పూర్తి న్యాయం జరుగుతుందనేది వారి నమ్మకం. బీసీలకు తలపెట్టిన మేలుకు అడ్డుపడుతున్నారని బీజేపీ, బీఆర్ఎస్లను ఎండగడుతున్న కాంగ్రెస్ ‘అదేదైనా?’ తమ పార్టీలోనే సాధ్యం అంటోంది.
బీసీల్లో మరింత నమ్మకాన్ని కలిగించడానికి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని పార్టీ అధిష్టానం కూడా అంగీకరిస్తోంది. కులగణన, రిజర్వేషన్ల పెంపుతో చట్టం, ఆర్డినెన్స్ తెచ్చినా శాసన, న్యాయపరమైన అవరోధాలున్నాయి కనుక పార్టీలో 42 శాతం రిజర్వేషన్ వర్తింపజేస్తూ, ఉప ముఖ్యమంత్రి పదవిస్తే గట్టి భరోసా కల్పించినట్టవుతుందని బీసీ వర్గాల్లో చర్చ మొదలైంది. మంత్రిస్థాయి నుంచి మండల నాయకుల వరకు అంతర్గత సమావేశాల్లో ఇప్పుడిదే మాట్లాడుకుంటున్నారు.
కాం గ్రెస్ లోపల, బయటా బీసీవాదం బలం పుంజుకుంటోంది. తెలంగాణలో బలహీనవర్గాలకు మేలుచేసే తమ నిర్ణయాలకు బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుపడుతున్నాయనే సందేశాన్ని బలంగా తీసుకువెళ్లగలిగిన కాంగ్రెస్, బీసీల్లో కొత్త నమ్మకాన్ని కలిగించడమే తదుపరి లక్ష్యంగా భావిస్తోంది. ఇందుకోసం ఒక బలమైన అడుగుపడాలని, రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వం ఉన్నందున బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ వెనుకబడిన వర్గాల్లో నెమ్మదిగా రాజుకుంటోంది. ఒకటీ అరా ప్రకటనలు తప్ప బహిరంగ డిమాండ్ అంతగా రాకపోయినా అంతర్గత చర్చల్లో ఇప్పుడిదే నడుస్తోంది.
ప్రభుత్వ పాలనాపరంగా పెద్దతేడా లేకుండానే మరో ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం వల్ల వచ్చే ఇబ్బందేమీ ఉండదని, సదరు బీసీ వర్గాల్లో మాత్రం ఆత్మవిశ్వాసం, కాంగ్రెస్‌పై నమ్మకం అమాంతం పెరుగుతాయనే వాదన ఒకటుంది. సీఎం పదవైనా, డిప్యూటీ సీఎం పదవైనా కుటుంబ ఆధిపత్యం ఉండే ప్రాంతీయ పార్టీల్లో బీసీలకివ్వడం అంత తేలిగ్గా సాధ్యం కాదని, కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీల్లోనే సాధ్యమవుతుందని బలహీనవర్గాలు కూడా బలంగా నమ్ముతాయి. దీన్ని ఆసరా చేసుకునే, ఎన్టీరామారావు (తెలుగుదేశం) కాలం నుంచి నిన్నా ఇయ్యాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు (బీఆర్ఎస్) హయాం వరకు ప్రాంతీయ పార్టీలపై అదే విమర్శ. ఏనాటికైనా అది మా పార్టీలోనే సాధ్యమని కాంగ్రెస్ చెప్పుకుంటూ వస్తోంది. ఇక బీజేపీ ఏకంగా 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడే, తాము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించింది.
దారి ఏర్పాటుకే డిప్యూటీ..
రాజ్యాంగంలో ప్రస్తావన కూడా లేని ఉప ముఖ్య మంత్రి ‘ఆరోవేలు’ వంటిదని ఆనాడే నీలం సంజీవరెడ్డి వంటి దిగ్గజ నాయకులు వెటకారం చేసినా, దానికుండే డిమాండ్, గుర్తింపు తక్కువేం కాదు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుమార్లు ఆ హోదాను పలువురు నాయకులకు కట్టబెట్టి సామాజిక, ప్రాంతీయవాదాల మధ్య సమతూకానికి యత్నించిన సందర్భాలున్నాయి. కాసు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కేవీ రంగారెడ్డికి, పీవీ నర్సింహారావు కాలంలో సి.జగన్నాథరావుకు, కోట్ల విజయభాస్కరరెడ్డి సీఎంగా ఉన్నపుడు కోనేరు రంగారావుకు, కిరణ్‌కుమార్ రెడ్డి పాలనలో దామోదర్ రాజనర్సింహ, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో మల్లు భట్టి విక్రమార్కలకు ఆ హోదా దక్కింది. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలలోనే జరిగినా బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి (ఒకసారే) అరుదే! తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి, మహమూద్ అలీ కూడా డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు నిర్వహించారు.
ఏపీలో డిప్యూటీ సీఎంలు!
విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో నాటి సీఎం చంద్రబాబునాయుడు (2014-–19) నేతృత్వంలో కే.ఇ.కృష్ణమూర్తి, చిన రాజప్పలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కితే, వై.ఎస్. జగన్మోహన్రెడ్డి హయాం (2019-–24)లో వివిధ సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ అయిదుగురు ఉప ముఖ్యమంత్రులున్నారు. జగన్ హయాంలో ఆళ్ల నాని, కొట్టు సత్యనారాయణల కైనా, ప్రస్తుతం చంద్రబాబు-2 (2024–-29) హయాంలో పవన్ కల్యాణ్ (జనసేన) కైనా ఉప ముఖ్యమంత్రి దక్కడం, కాపుల రాజ్యాధికార క్రమంలో ఒక ముందడుగుగానే ఆ వర్గాలు భావిస్తాయి.
దశాబ్దాలుగా సీఎం పదవికి బీసీ ఆశావాదులు!
ఎప్పటికైనా ముఖ్యమంత్రి హోదా దక్కించుకునే ప్రస్థానంలో ఉప ముఖ్యమంత్రి హోదా ఒకదారి ఏర్పాటు వంటిదని వారి విశ్వాసం. అటువంటి కోరిక తెలంగాణలో బీసీలకు ఎప్పట్నుంచో ఉంది. దశాబ్దాలుగా శివశంకర్, బాలాగౌడ్, మాణిక్‌రావ్, విఠల్రావు, డి.శ్రీనివాస్, కే కేశవరావ్ వంటి పేరున్న బీసీ నాయకులున్నా ఉప ముఖ్యమంత్రి పదవి వారెవరినీ వరించలేదు. పీవీ నర్సింహారావు సీఎంగా ఉన్నపుడు స్వల్పకాలం సి.జగన్నాథరావు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్క అంజయ్య తప్ప మరే బీసీ నాయకుడూ రాష్ట్ర ముఖ్యమంత్రి అవలేదు.
ఎందుకు బీసీ వాదం?
ఎందుకు బీసీవాదం రాజకీయవర్గాల్లో ఇంతలా చర్చనీయాంశమౌతోంది? ఈ ప్రశ్నకు సమాధానం తేలికే! రాష్ట్ర జనాభాలో వారు యాభైయారు శాతానికి పైబడి ఉండటం, ప్రస్తుత మన ప్రజాస్వామ్యంలో, ముఖ్యంగా ఓటు రాజకీయాల్లో బహుళ సంఖ్యాకుల (మెజారిటీ)కే ప్రాధాన్యత లభించడం సహజం. సామాజిక అవగాహన పెరుగుతున్న క్రమంలో వారిని మచ్చిక చేసుకోకుంటే రాజకీయంగా పుట్టగతులుండవన్నది పార్టీల గ్రహింపు. అందుకే, కాంగ్రెస్ పార్టీ ‘కామారెడ్డి డిక్లరేషన్’కు అంతలా ప్రాధాన్యత ఇస్తోంది. 2023 నవంబరు 9న, కామారెడ్డిలో పార్టీ నాయకులైన సిద్దరామయ్య (కర్నాటక సీఎం), మాణిక్ ఠాకూర్ (ఏఐసీసీ ప్రతినిధి)ల సమక్షంలో జరిగిన సదస్సులో, అధికారంలోకి రాగానే తెలంగాణలో కులగణన జరిపిస్తామని, బీసీల రిజర్వేషన్ 42 శాతానికి పెంచుతామని పార్టీ హామీ ఇచ్చింది. ఆ మేరకు కులగణన జరిపి, బీసీల రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతూ చట్టం తీసుకురావడంతో పాటు, రిజర్వేషన్ శాతాల గరిష్ట పరిమితి (క్యాప్) తొలగిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. కానీ, వాటికి కేంద్రం- గవర్నర్ అనుమతులు లభించక కార్యాచరణ సాధ్యపడటం లేదు.
ఇతరులదీ అదే పరుగు
గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ వాదాన్ని ఉరకలెత్తించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన భారీ దీక్షతో వేడి పెంచింది. అనివార్యంగా ఇది ఇతర పార్టీల్లోనూ వేడి పుట్టించింది. ఒకవైపు రాష్ట్రం ప్రతిపాదించిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ రూపంలో, మరోవైపు ఆర్డినెన్స్‌ను గవర్నర్ రూపంలో బీజేపీ నాయకత్వం తొక్కిపెట్టిందనే కాంగ్రెస్ వాదన రీత్యా బీసీ రాజ్యాధికార అంశంపై బీజేపీ ఆత్మరక్షణలో పడింది. నిజానికి గత ఎన్నికల ముందే బీజేపీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించింది. తమ ‘ఎం -త్రీ’ (ముదిరాజ్, మున్నూరుకాపు, మాదిగ) ఫార్ములాలో కూడా బీజేపీ బీసీలకు పెద్దపీట వేసింది.
బీసీ రిజర్వేషన్ పెంపు చట్టం, ఆర్డినెన్స్ విషయంలో తమ పార్టీకే చెందిన తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవితను ముందు వ్యతిరేకించిన బీఆర్ఎస్ నాయకత్వం చివరకు అదేదారిలోకి రావాల్సి వచ్చింది. కరీంనగర్లో తలపెట్టిన బీసీ సదస్సుకు పార్టీ నాయకత్వం ఇపుడు సన్నాహాల్లో ఉంది. రిజర్వేషన్ల పెంపుకు తామేమీ వ్యతిరేకం కాదని ఆయా వర్గాలకు నచ్చజెప్పే ధోరణి వారిలో కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో రాజకీయ తెరమీదకెక్కిన బీసీ వాదాన్ని మిగతా సామాజికవర్గాలూ తెలంగాణలో పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.
స్థానిక ఎన్నికల్లో ఆధిపత్యం
ఇప్పుడున్న శాసన, న్యాయ అవరోధాలను అధిగమించేలోపు పార్టీలో అంతర్గతంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని పార్టీ స్థూలంగా నిర్ణయించింది. ఈ అంశం, వచ్చే వారం జరగనున్న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో విపులంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఆ భేటీలో బీసీలకు ఉప ముఖ్యమంత్రి అంశాన్ని లేవనెత్తాలని కొందరు బీసీ నాయకులు భావిస్తున్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎం పదవి ఇస్తే బీసీల్లో కొత్త నమ్మకాన్ని పెంచినట్టవుతుందనేది వారి వాదన.
ఫలితంగా స్థానిక ఎన్నికల్లో ఆధిపత్యం లభించడంతో పాటు భవిష్యత్తులోనూ బలమైన ఆయా వర్గాలు పార్టీతోనే ఉంటాయని కాంగ్రెస్‌లో ఒక చర్చ సాగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి (పీసీసీ పీఠం) బీసీలకు పలుమార్లు దక్కినా సీఎం పదవి లభించలేదు. ఉప ముఖ్యమంత్రి ఇస్తే కొంతలో కొంత ఉపశమనం, రాజ్యాధికారం బాటలో ఒక మజిలీ అని బీసీ వర్గాల నాయకులనుకుంటున్నారు.
దిలీప్ రెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ