హాస్టల్ విజిట్ క్యాలెండర్ను రెడీ చేయండి..గురుకులాల్లో పకడ్బందీగా పర్యవేక్షణ ఉండాలి : డిప్యూటీ సీఎం భట్టి

హాస్టల్ విజిట్ క్యాలెండర్ను రెడీ చేయండి..గురుకులాల్లో పకడ్బందీగా పర్యవేక్షణ ఉండాలి : డిప్యూటీ సీఎం భట్టి
  • మంత్రి లక్ష్మణ్​తో కలసి గురుకులాలపై డిప్యూటీ సీఎం భట్టి రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు, పకడ్బందీ పర్యవేక్షణ ఉండేలా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ప్రజాభవన్‌‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌‌తో కలిసి సమీక్ష నిర్వహించిన భట్టి.. హాస్టల్స్ విజిట్ క్యాలెండర్‌‌ను రూపొందించి, అధికారులు క్రమం తప్పకుండా పర్యటించి రిపోర్టులు ఇవ్వాలని సూచించారు. ఈ పర్యటనలకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించాలని తెలిపారు.

విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పెంచిన 40 శాతం డైట్, 200 శాతం కాస్మోటిక్ చార్జీల మెనూను అన్ని వసతి గృహాలు, గురుకులాల్లో ప్రముఖంగా కనిపించేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వసతి గృహాల్లోని సౌలత్​లపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, దోమతెరలు, నిరంతర నీటి సరఫరా వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు.

పిల్లల హెల్త్​ రికార్డులు రూపొందించాలి

సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ రికార్డులను రూపొందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా, కార్పొరేట్ ఆసుపత్రులు ఆన్‌‌లైన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయని, ఆ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

రెసిడెన్షియల్ స్కూల్స్ భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ అవసరాలను తీర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.