మాకు మద్దతివ్వండి.. సీపీఐకి డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి

మాకు మద్దతివ్వండి.. సీపీఐకి డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి
  • బీజేపీని అడ్డుకోవడానికి కలిసి పనిచేద్దామని సూచన
  • ఇండియా కూటమికి సపోర్టు చేస్తం: కూనంనేని

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో  కాంగ్రెస్  పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఐ నేతలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. బీజేపీని అడ్డుకోవడానికి కలిసి పనిచేద్దామని ఆయన సూచించారు. శనివారం హైదరాబాద్​ హిమాయత్ నగర్ లోని సీపీఐ ఆఫీస్  మగ్దూం భవన్​లో సీపీఐ నేతలతో భేటీ అయ్యారు. తాజా రాజకీయాలు, లోక్ సభ ఎన్నికలపై సీపీఐ నేతలతో ఆయన చర్చించారు. అనంతరం మీడియాతో భట్టి మాట్లాడారు. బీజేపీ అడ్డుకోవాలంటే సీపీఐ, కాంగ్రెస్  కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 

లౌకికవాదాన్ని కాపాడేందుకు, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, పేదల అభివృద్ధిని కాంక్షిస్తూ భవిష్యత్తులో  కూడా సీపీఐతో కలిసి పని చేయాలని నిర్ణయించామని తెలిపారు. దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, రాజ్యాంగాన్ని కాపాడడమే ఇండియా కూటమి లక్ష్యమన్నారు. నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఖూనీచేస్తున్నదని ఆయన ఆరోపించారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వపరంగా సహాయ, సహకారాలు అందిస్తామని సీపీఐ నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి సయ్యద్  అజీజ్  పాషా, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో భట్టి భేటీ అయ్యారు. 

బీజేపీని  నిలువరించడమే లక్షం: కూనంనేని 

సీపీఐ రాష్ర్ట కార్యదర్శి, ఎమ్మెల్యే  కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాష్ర్టంలో బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో ఒకటి, రెండు స్థానాల్లో పోటీ చేయాలని తాము భావించినా బీజేపీని అడ్డుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు సపోర్టు చేస్తున్నామని చెప్పారు. దేశంలో బీజేపీ అతిపెద్ద అవినీతి పార్టీ అని ఆయన మండిపడ్డారు.

రూ.13 వేల కోట్ట ఎలక్టోరోల్  బాండ్లలో రూ.8 వేల కోట్లు బీజేపీకే  వచ్చాయని, కాంగ్రెస్  పార్టీ తన సొంత డబ్బును ఖర్చు చేసుకోలేని పరిస్థితి తెచ్చారని విమర్శించారు. అలాగే సీపీఐకి కూడా రూ.11 కోట్ల జరిమానా విధించారని ఫైర్  అయ్యారు. అవినీతి బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్తగూడెంలో తనకు  మద్దతు ఇచ్చినందుకు సీపీఎంకు తాము ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటామని తెలిపారు. కమ్యూనిస్టులు ఎప్పటికీ కలిసే ఉంటామని, ప్రజా సమస్యలపై కలిసే పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.