
- రాబోయే 20 ఏండ్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయండి
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
కొల్లాపూర్, వెలుగు: హైడల్ పవర్ తో పాటు పంపింగ్ స్టోరేజ్ వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్రంలో 23 పాయింట్స్ ను గుర్తించి వాటి మీద సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ఆదివారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల వద్ద జెన్ కో, ట్రాన్స్ కో అధికారులతో సమావేశం నిర్వహించారు.
జూరాల నుంచి పులిచింతల వరకు కృష్ణా నదిపై ఉన్న హైడల్ పవర్ ప్రాజెక్టులపై రివ్యూ చేశారు. సోలార్ విద్యుత్ ను స్టోరేజీ చేసి రాత్రి వేళల్లో ఉపయోగించుకొనేలా అవసరమైన వ్యవస్థను రూపొందించుకోవాలన్నారు. రాబోయే తరాల కోసం పర్యావరణ హితమైన పవర్ ను ఉత్పత్తి చేసి అందించాలని సూచించారు.
రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని, రాబోయే ఇరవై ఏండ్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలని సూచించారు.
గ్రీన్ హైడ్రోజన్, ఫ్లోటింగ్ సోలార్, రూఫ్ సోలార్, థర్మల్ పవర్, పవన విద్యుత్, అణు విద్యుత్ బ్యాటరీ స్టోరేజ్ వంటి ప్రత్యామ్నాయ విద్యుత్ కోసం తమవంతు కృషి చేయాలన్నారు. అంతకుముందు సోమశిల వద్ద కృష్ణా నదిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తదితరులు పుణ్య స్నానాలు చేశారు. లలిత సోమేశ్వర ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.