
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- మంచిర్యాల జిల్లాలో పర్యటన
మంచిర్యాల/లక్సెట్టిపేట/దండేపల్లి, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో మహిళల కోసం మైక్రో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి వ్యాపారవేత్తలుగా తయారు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. ఆర్థిక ఇబ్బందులెన్నున్నా, మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆదివారం ఆయన మంచిర్యాల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ముందుగా లక్సెటిపేటలో కొత్తగా నిర్మించిన 30 బెడ్స్ ఆస్పత్రిని ప్రారంభించి, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హైస్కూల్ బిల్డింగ్ లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత దండేపల్లి మండలం అందుగులపేటలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సోలార్ పవర్ ప్లాంట్, హాజీపూర్ మండలం వేంపల్లిలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. గుడిపేటలో నిర్మాణంలోని మెడికల్ కాలేజీ బిల్డింగ్ ను పరిశీలించారు.
అనంతరం అందుగులపేటలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టే ఆలోచనలో ఉందని తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అందుగుల పేటలో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ కెపాసిటీని ఆరు మెగావాట్లకు పెంచుతామని, దండేపల్లి మండలంలో గోదావరిపై నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లు మంజూరు చేస్తామన్నారు.
మంచిర్యాల సెగ్మెంట్ లో 440 కేవీ, 220 కేవీ కెపాసిటీ తో విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రపోజల్స్ పంపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా లక్సెట్టిపేటలో 30 బెడ్స్ హాస్పిటల్, కాలేజీ, హైస్కూల్ బిల్డింగ్ లను ప్రారంభించడం సంతోషంగా ఉందని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తెలిపారు. రూ.2కోట్లతో మంచిర్యాలలో కళాభవన్ నిర్మించి కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తామని, గాంధారివనంలో బోటింగ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
863 మహిళా సంఘాలకు రూ.80 కోట్ల వడ్డీ లేని లోన్లు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చెక్కులను పంపిణీ చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మార్కెట్ రోడ్ లో రూ.78 కోట్లతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ చైర్ పర్సన్ సురేఖ, కలెక్టర్ కుమార్ దీపక్, గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఐటీడీఏ పీవో కుష్బూగుప్తా, డీఎఫ్ వో శివ్ ఆశిష్ సింగ్, డీఆర్డీవో కిషన్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ పాల్గొన్నారు.