
- అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట పట్టణంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా, పలువురు మంత్రులు వస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. బుధవారం ఆస్పత్రి వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13న ఉపముఖ్యమంత్రి, మంత్రులు లక్సెట్టిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. ప్రభుత్వ హైస్కూల్, కాలేజీ నూతన భవనంలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారని అన్నారు.
దండేపల్లి మండలం రెబ్బనపల్లి స్కూల్లో సోలార్ ప్లాంట్ను ప్రారంభిస్తారని, మంచిర్యాల మెడికల్ కాలేజ్, మహా ప్రస్థానాన్ని కూడా సందర్శిస్తారని తెలిపారు. మెరుగైన విద్య, వైద్యం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెల్లా నాగభూషణం, ఎండీ ఆరిఫ్, పింగిలి రమేశ్, కొత్త వెంకటేశ్వర్లు, చింత అశోక్, అంకతి శ్రీనివాస్, నలిమెల రాజు, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.