డిప్యూటీ సీఎం గూడెం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ కుమార్ దీపక్

డిప్యూటీ సీఎం గూడెం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ కుమార్ దీపక్
  •     పర్యటన వివరాలు  వెల్లడించిన కలెక్టర్

దండేపల్లి, వెలుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గూడెం పర్యటన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,రాష్ట్ర గిరిజన ఆర్థికాభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ కొట్నాక తిరుపతి, డీసీపీ భాస్కర్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం పునర్నిర్మాణం, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి  ఉప ముఖ్యమంత్రి ఈ నెల 13న శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 

అనారోగ్య సమస్యలతో సింగరేణిలో విధులు నిర్వహించలేని ఉద్యోగుల కుటుంబసభ్యులకు మంచిర్యాలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో నియామకపత్రాలు అందజేస్తారని, సాయంత్రం శ్రీరాంపూర్ ఏరియాలో ఓపెన్ కాస్ట్ గనులను పరిశీలిస్తారని వెల్లడించారు. అనంతరం మంచిర్యాలలోని శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేస్తారని, ఉప ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అడిషనల్ కలెక్టర్ రాములు, డీఆర్డీవో కిషన్, ఏసీపీ ప్రకాశ్, సీఐ రమణమూర్తి, తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండే తదితరులు ఉన్నారు.