- మంత్రులు తుమ్మల, పొంగులేటితో కలిసి విద్యాశాఖ, ప్రాజెక్టులపై సమీక్ష
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు స్పీడప్ చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ లో సాగునీటి పారుదల, విద్యా శాఖలపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్ వీపీ గౌతమ్ తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి, వాటికి కావాల్సిన నిధులు, పూర్తయ్యే గడువును అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో ఉన్న మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎన్ఎస్పీ కెనాల్స్, సీతారామ ప్రాజెక్ట్, మధ్య తరహా, చిన్న తరహా పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి క్యాలెండర్ తయారు చేసుకుని ఆ ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. జిల్లాలో అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఇప్పటికీ పనులు మొదలు కాని చిన్న నీటి ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులు పారదర్శకంగా, జవాబుదారీగా వ్యవహరించాలని చెప్పారు. ప్రభుత్వం విద్యపైన ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు.
రాష్ట్ర బడ్జెట్లో అవసరమైనన్ని నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు వెంటనే భూములను గుర్తించాలని ఆదేశించారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ద్వారా అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్ సంఖ్య పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగయ్యేలా ..
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగుకు వచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. అగ్రిమెంట్ ప్రకారం పనులు పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కు ప్రభుత్వం పట్టుదలతో ఉందని చెప్పారు.
రూ.20 కోట్ల ఖర్చుతో 18 వేల ఎకరాలకు సాగునీరు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాలేరుకు సంబంధించి రూ.20 కోట్ల ఖర్చుతో 18 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించవచ్చని తెలిపారు. సీజన్ లో ప్రస్తుతమున్న సాగునీటి ప్రాజెక్టుల రిపేర్లు, చిన్న, చిన్న పనులు పూర్తి స్థాయిలో చేసి, వాటి పూర్తి సామర్థ్యం తో చిట్ట చివరి ఆయకట్టుకు నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలన్నారు. పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కల్గించి, విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, విద్యా శాఖలో అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరిగేలా చేపడుతున్న చర్యల గురించి వివరించారు. సమీక్షకు ముందు ఎన్ఎస్పీ స్కూల్ లో విద్యార్థులకు భట్టితో కలిసి మంత్రులు యూనిఫాం, బుక్స్ పంపిణీ చేశారు.
రూ.2 వేల కోట్ల నిధులతో స్కూళ్లలో వసతుల కల్పన చేసి, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని భట్టి చెప్పారు. మెగా డీఎస్సీ ద్వారా సుమారు 10 వేల పోస్టుల భర్తీచేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యే లు మట్టా రాగమయి, రాందాస్ నాయక్, డిప్యూటీ సీఎం ఓఎస్డీ కృష్ణ భాస్కర్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, అడిషనల్కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఇర్రిగేషన్ సీఈ విద్యాసాగర్, డీఈవో సోమశేఖరశర్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మధిరలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా
మధిర : ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకుని మధిర నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం వందనం గ్రామంలో రూ.4 కోట్లతో వందనం- పుట్టకోట గ్రామాల మధ్యన బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చింతకాని మండలం రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించడానికి రూ.25 కోట్లతో కోధుమూరు- వందనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంజూరు చేసినట్లు తెలిపారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. వారంలో రెండు రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు.
పురోగతి లేకపోతే చర్యలు
ఖమ్మం రూరల్ : మున్నేరు రిటైనింగ్వాల్పనులు వేగవంతం చేయాలని, పదిరోజుల్లో మళ్లీ సైట్ విజిట్ కు వస్తానని, పనుల్లో పురోభివృద్ధి లేకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను హెచ్చరించారు. బుధవారం ఖమ్మం రూరల్ దానవాయిగూడెంలో మున్నేరు రిటైనింగ్ వాల్ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిపుణులైన వర్కర్లను నియమించి పనుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలన్నారు. రెవెన్యూ అధికారులు మున్నేరుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని సూచించారు. రామన్నపేట జడ్పీహెచ్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బడిబాట కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
రహదారి పనులు క్వాలిటీగా చేపట్టాలి
ఖమ్మం టౌన్ : రహదారుల పనులను క్వాలిటీగా, త్వరగా చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్ హెచ్ ఏఐ అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మంలోని వీడీఓఎస్ కాలనీలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎన్ హెచ్ ఏఐ అధికారుల మీటింగ్ లో ఆయన ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, ఖమ్మం టు అశ్వారావుపేట రోడ్డు పనుల పురోగతిపై మాట్లాడారు. కల్లూరు నుంచి మధిర రోడ్డు దగ్గర, దంసలాపురం బోనకల్ రోడ్డు దగ్గర, వేంసూర్ నుంచి సత్తుపల్లి రోడ్డు దగ్గర ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్లను ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ డైరెక్టర్ కు మంత్రి సూచించారు. ఖమ్మం టు అశ్వారావుపేట రోడ్డుపై గుంతలను పూడ్చాలన్నారు.