అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బందితో డిప్యూటీ సీఎం పవన్..

అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బందితో డిప్యూటీ సీఎం పవన్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన రోజు నుండే ఒక పక్క అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ, మరో పక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాలనలో తనదైన మార్క్ తో దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొంది డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టిన పవన్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. తన తొలి ప్రసంగంతో ఆకట్టుకున్న పవన్, రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందు అసెంబ్లీ ఆవరణమంతా కలియదిరుగుతూ సిబ్బందితో ముచ్చటించారు.

అసెంబ్లీ సిబ్బందికి ఫోటోలు ఇచ్చిన పవన్ వారితో మాట్లాడే సమయంలో అక్కడ పని చేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది పవన్ కు వారి సమస్యల గురించి వివరించారు. గత 8ఏళ్లుగా అసెంబ్లీ పని చేస్తున్నామని, అమరావతి రైతు కూలీలుగా ఉన్న తాము అసెంబ్లీలో 6వేల జీతానికి జాయిన్ అయ్యామని, ఇప్పుడు 10వేల జీతం వస్తోందని తెలిపారు.

అయితే, అమరావతి రైతు కూలీలమైన తమకు అప్పట్లో ప్రభుత్వం నెలకు 2250 భత్యం ఇచ్చేదని, ఆ తర్వాత అసెంబ్లీ సిబ్బందిగా ఉన్న కారణంగా ఆ భత్యాన్ని ఆపేశారని తెలిపారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా ఉన్న తమను మున్సిపాలిటీ పరిధిలోకి వెచ్చేలా చూడాలని పవన్ కళ్యాణ్ కు విన్నవించుకున్నారు. వారి సమస్యలు సాంతం విన్న పవన్ సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.