వాడు, వీడు అంటే ఊరుకునేది లేదు.. తడి బట్టలతో ప్రమాణం చేసి చెప్తా

వాడు, వీడు అంటే ఊరుకునేది లేదు.. తడి బట్టలతో ప్రమాణం చేసి చెప్తా
  • నాడు లింగయ్య కు టికెట్ ఇప్పించింది నేనే  
  • రేపు వీరేశంను గెలిపించేది నేనేమండలి డిప్యూటీ  మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్

నకిరేకల్, (వెలుగు) : ‘‘గుడిలో తడి బట్టలతో ప్రమాణం చేస్త. నాడు చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇప్పించింది నేనే. రేపు జరగబోయే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని గెలిపించబోయేదీ నేనే” అని  శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్  నేతి విద్యాసాగర్  అన్నారు. విద్యాసాగర్,  నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్  రావు దంపతులు బీఆర్ఎస్ ను వీడి  కాంగ్రెస్ లో చేరి తొలిసారి నకరేకల్ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, నకిరేకల్  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో బైక్  ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి విద్యాసాగర్  ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తనను వాడు వీడు అని మాట్లాడడంపై ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి అలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

జిల్లాలోనే నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని చెప్పారు.  వేముల వీరేశం మాట్లాడుతూ తనపై  పదేపదే కేసులు పెడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఏమీ అభివృద్ధి చేయలేదు  కాబట్టే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. అన్ని వర్గాల వారిని బాధపెట్టిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఓటర్లను ఆయన కోరారు. నకిరేకల్  ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు దంపతులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తనను ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్, వేముల వీరేశం ఆధ్వర్యంలో  బీఆర్ఎస్ కు చెందిన కట్టంగూర్  ఎంపీపీ జేల్లా ముత్తి లింగయ్యతోపాటు పలు గ్రామాల సర్పంచులు,  వివిధ పార్టీల నేతలు  కాంగ్రెస్ లో చేరారు.